వాషింగ్టన్: సముద్రంలో కూలిన ఎఫ్ 35 ఫైటర్ జెట్ ఆచూకీ కోసం అమెరికా నేవీ చాలా తీవ్రంగా వెతుకుతోంది. అత్యాధునికంగా తీర్చిదిద్దిన ఈ స్టెల్త్ ఫైటర్ శకలాలను తమకంటే ముందే చైనా చేజిక్కించుకుంటుందేమోనని టెన్షన్ పడుతోంది. శత్రుదేశాలు గుర్తించకుండా వాటి గగనతలంపై సీక్రెట్‌గా ప్రయాణించగలిగే సామర్థ్యంతో తయారైన యుద్ధ విమానాలివి. సోమవారం ఎఫ్ 35 సీ విమానం ఒకటి దక్షిణ చైనా సముద్రంలో కూలిపోయింది. దీని శకలాలు కనక డ్రాగన్ కంట్రీ చేతిలో పడితే.. అందులోని టెక్నాలజీని కాపీ కొడుతుందనేదే అగ్రరాజ్యం టెన్షన్‌కు కారణం. సముద్రంలో ఎఫ్35సీ కూలిపోతున్న ఫొటోలు బయటకు రావడంతో అవి శుక్రవారం వైరల్ అయ్యాయి. ప్లేన్ సముద్రంలో మునిగిపోతుండటం, దాని కాక్ పిట్ ఓపెన్ అయి ఉండటం, పైలెట్ ఎజెక్షన్ సీటు కూడా కనిపించకపోవడం వంటివి ఫొటోల్లో స్పష్టంగా కనిపించాయి. మీడియాలో వైరల్ అయిన ఫొటోలు ఎఫ్35సీవేనని శుక్రవారం యూఎస్ నేవీ సెవెన్త్ ఫ్లీట్ అధికార ప్రతినిధి హేలీ సిమ్స్ కన్ఫమ్ చేశారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని, శకలాల కోసం ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. కార్ల్ విన్సన్ పై దిగుతుండగా డెక్ ను ఢీకొట్టి విమానం సముద్రంలోకి దూసుకెళ్తున్న వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. ఫిలిప్పీన్స్ తీరంలో యూఎస్ఎస్ కార్ల్ విన్సన్ యుద్ధనౌకపై ల్యాండింగ్ సందర్భంగా ఈ ప్రమాదం జరిగినట్లు అమెరికన్ నేవీ ఇదివరకే ప్రకటించింది. విమానం నుంచి పైలెట్ సేఫ్‌గా ఎజెక్ట్ అయ్యాడని, ఆ సమయంలో విన్సన్ పై ఉన్న సెయిర్లలో ఆరుగురికి గాయాలు అయ్యాయని తెలిపింది. అయితే, ఈ ప్రమాదంలో విన్సన్ నౌకకు పెద్దగా డ్యామేజ్ జరగలేదని పేర్కొంది.
శత్రుదేశాలు గుర్తించలేవ్
ఎఫ్35సీ స్టెల్త్ ఫైటర్లను ప్రపంచంలోనే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారు చేశారు. వీటిని ఎగిరే కంప్యూటర్లుగా పిలుస్తుంటారు. శత్రుదేశాల గగనతలాలపై వాటికి తెలియకుండానే, సీక్రెట్ గా ఇవి ఎగరగలవు. ప్రయాణిస్తూనే సమాచారం సేకరిస్తూ, ప్రత్యేక నెట్ వర్క్ ద్వారా నేవీ, ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఇతర వ్యవస్థలకు అందిస్తాయి. ఇవి గంటకు 1200 మైళ్ల వేగంతో (మ్యాక్ 1.6) దూసుకెళ్తూ టార్గెట్లపై బాంబుల వర్షం కురిపించగలవు. అందుకే.. ఎఫ్35సీల తయారీ ప్రాజెక్టుకు అమెరికా 1.5 లక్షల కోట్ల డాలర్లు
ఖర్చు చేసిందని చెప్తారు.
ఆ ప్లేన్ పై మాకు ఇంట్రెస్ట్ లేదు: చైనా
అమెరికాకు చెందిన ఎఫ్35సీ దక్షిణ చైనా సముద్రంలో కూలిపోయిన విషయంపై తమకు కూడా సమాచారం అందిందని గురువారం చైనీస్ ఫారిన్ మినిస్ట్రీ వెల్లడించింది. అయితే, ‘‘వాళ్ల వార్ ప్లేన్ పట్ల మాకు ఇంట్రెస్ట్ లేదు..” అని ప్రకటించింది. ‘‘దక్షిణ చైనా సముద్రంలో ప్రతి చోటా బలప్రదర్శనకు పూనుకోవడం కంటే ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం తోడ్పడాలని అమెరికాకు మేం సలహా ఇస్తున్నాం” అని ఈ మేరకు చైనీస్ ఫారిన్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ పేర్కొన్నారు.
గతంలో కూడా..
ఎఫ్35సీ శకలాలు చైనా చేతికి చిక్కితే.. తమ టెక్నాలజీ డ్రాగన్ చేతిలో పడ్డట్లేనని అమెరికా భయపడుతోంది. ఇప్పటికే ఇలాంటి అనుభవం కూడా ఒకసారి అమెరికాకు ఎదురైంది. అమెరికాకు చెందిన ఎఫ్117 స్టెల్త్ విమానం 1999లో సెర్బియాలో కూలిపోతే.. ఆ శకలాలు చైనా చేతికి చిక్కాయి. దీంతో ఆ టెక్నాలజీ ఆధారంగా చైనా ఇటీవల జే20 స్టెల్త్ జెట్ ను తయారు చేసుకుంది. ఎఫ్ 35 సీ శకలాలను తీసుకెళ్లేందుకు అమెరికా తన సాల్వేజ్ షిప్‌ను సంఘటన స్థలానికి తరలించేందుకే పది రోజులు పట్టొచ్చని, ఆలోపే శకలాలను చైనీస్ సబ్ మెరైన్లు కనిపెట్టే చాన్స్ ఉందని నిపుణులు చెప్తున్నారు. పైగా సముద్రం అడుగు నుంచి శకలాలను పైకి తేవడం అంత ఈజీ కూడా కాదని అంటున్నారు. మరోవైపు 13 లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణంలోని దక్షిణ చైనా సముద్రం అంతా తమదేనని చెప్పుకునే చైనాకు.. ఇక్కడి వ్యవహారాలను మానిటర్ చేయడం, శకలాలను సంపాదించడం పెద్ద కష్టం కూడా కాదంటున్నారు.