నల్గొండ అర్బన్, వెలుగు: సార్వత్రిక సమ్మె, గ్రామీణ భారత్ బంద్‌కు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ యూఎస్‌పీసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గురువారం జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్ వద్ద టీచర్లు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీడీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్య గారు మాట్లాడుతూ.. కేంద్రం కార్మికులు హక్కులు కాలరాసేలా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు, విద్యుత్ చట్ట సవరణను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తూ చట్టం చేయాలని కోరారు. టీఎస్ యుటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సైదులు మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వ విధానాలతో కార్మికులు, రైతులు, సాధారణ ప్రజలతో పాటు ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. పదేళ్లలో ఆదాయపన్ను స్లాబులను సవరించలేదని, జీఎస్టీ మాత్రం అన్ని వస్తువులపై వేస్తున్నారని మండిపడ్డారు.
అదే కార్పొరేట్లకు పన్నుల్లో రాయితీలు కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ సంఘాల నేతలు రత్నయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం, ఖుర్షీద్‌మియా, నర్రా శేఖర్ రెడ్డి, బడుగు అరుణ, సంతోషం, నలపరాజు వెంకన్న, గేర నర్సింహ, మురళయ్య, సైదులు పాల్గొన్నారు.