డిప్రెషన్‌‌లో చిక్కుకుని చావాలనుకున్నా

డిప్రెషన్‌‌లో చిక్కుకుని చావాలనుకున్నా

ఏదో శక్తి అడ్డుకుందన్న ఊతప్ప
టీమ్‌కు దూరంగా ఉన్నందుకు బాధలేదు

న్యూఢిల్లీ: కెరీర్‌‌లో అప్స్‌‌ అండ్‌‌ డౌన్స్‌‌తో డిప్రెషన్‌‌లోకి వెళ్లిన తాను.. ఒకానొక దశలో చచ్చిపోదామనుకున్నానని టీమిండియా వెటరన్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ రాబిన్‌‌ ఊతప్ప అన్నాడు. దాదాపు రెండేళ్లు చాలా కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నానని చెప్పాడు. కొన్నిసార్లు బాల్కనీ నుంచి దూకేందుకూ సిద్ధమయ్యేవాడినన్నాడు. ‘నాకింకా గుర్తు 2009 నుంచి 2011 వరకు గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నా. క్రికెట్‌‌ గురించి అస్సలు ఆలోచనలు వచ్చేవి కావు. ఈ రోజు గడిస్తే చాలనుకునే పరిస్థితి. ఎప్పుడూ ఆత్మహత్య ఆలోచనలే. ఏ దారిలో వెళ్తున్నానో నాకే అర్థం కాలేదు. నా జీవితం ఎటువైపు పోతుందో కూడా తెలుసుకోలేని స్థితిలో ఉండిపోయా. క్రికెట్‌‌లేని రోజుల్లో పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది. ఓ రోజు బాల్కనీలో కూర్చున్నా. సుసైడ్‌‌ చేసుకోవాలని గట్టిగా అనుకుని వన్​, టూ, త్రీ అంటూ లేచి దూకడానికి పరుగెత్తా. కానీ చివర్లో ఏదో ఓ శక్తిలాంటిది నన్ను ఆపింది’ అని రాజస్థాన్‌‌ రాయల్స్‌‌ ఏర్పాటు చేసిన ‘మైండ్‌‌, బాడీ, సోల్‌‌’ అనే కార్యక్రమంలో పాల్గొన్న ఊతప్ప వెల్లడించాడు.  ప్రొఫెషనల్స్‌‌ సాయంతో తాను ఈ సమస్య నుంచి బయటపడ్డానని చెప్పాడు. తర్వాతి దశల్లో వ్యక్తిగా తనను అర్థం చేసుకోవడం మొదలుపెట్టానన్నాడు. ‘నాలో మార్పుల కోసం వేరే వారిపై ఆధారపడటం స్టార్ట్‌‌ చేశా. నా జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టాలని ప్రయత్నించా. నెట్స్‌‌లో తీవ్రంగా కష్టపడినా.. పరుగులు చేయలేకపోయా. గంటలకొద్ది శ్రమించినా అవకాశాలు రాలేదు. ఇలా ఆరంభంలో నేను అనుకున్నది ఏదీ జరగలేదు. అంటే నాలోనే ఏదో తప్పు ఉందనే భావించా. కొన్నిసార్లు మన తప్పులను అంగీకరించం. వాటిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా మానసిక సమస్యలను. వీటివల్ల  సక్సెస్‌‌ రాదు. అందుకే నాలో ఉన్న తప్పును తెలుసుకునేందుకు ప్రయత్నించా. మానసిక సమస్యలను కూడా అంగీకరించడం మొదలుపెట్టా. క్రమంగా నాలో మార్పు మొదలైంది’ అని ఈ కర్ణాటక బ్యాట్స్‌‌మన్‌‌ వివరించాడు. జీవితంలో ఎదురయ్యే సానుకూలతలు, ప్రతికూలతలను సమంగా తీసుకోవాలన్నాడు. దీనివల్ల కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురైనా.. తర్వాతి దశల్లో చాలా ఎత్తుకు చేరుకుంటామన్నాడు. 2015 తర్వాత టీమిండియాకు ఆడనందుకు తనకు ఎలాంటి బాధలేదని రాబిన్ చెప్పుకొచ్చాడు.

For More News..

స్కూళ్లు, కాలేజీలు తెరిచే ప్లాన్‌ ఏది?

మారటోరియంలో వడ్డీ వసూలు చేయకూడదు!

ఐపీఎల్‌‌ కోసం బీసీసీఐ లాస్ట్ ఆప్షన్!