- కొత్తగూడెంలో యూటీఎఫ్ బైక్ ర్యాలీ
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కుర్చి మారినప్పుడల్లా కొందరి నేతలకు మాట మార్చడం అలవాటైందని ఎమ్మెల్సీ అలుగుబల్లి నర్సిరెడ్డి ఆరోపించారు. కొత్తగూడెంలోని కొత్తగూడెం క్లబ్లో శనివారం టీఎస్ యూటీఎఫ్ జిల్లా మహాసభలు ప్రారంభమయ్యాయి. యూటీఎఫ్ నేతలు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. సంఘం జెండా ఆవిష్కరణ అనంతరం ఏర్పాటైన మహాసభలో నర్సిరెడ్డి మాట్లాడారు. ఉపాధ్యాయ, ఉద్యోగులకు టీఏ, డీఏలు, జీపీఎఫ్ డబ్బులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రులు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
మూడు డీఏలు ఇవ్వకపోవడంతో పాటు జీపీఎఫ్ డబ్బులు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమేననే విషయాన్ని మాజీ ఆర్థిక శాఖ మంత్రి హారీశ్‌రావు మర్చిపోయారని విమర్శించారు. గత ప్రభుత్వం విద్యారంగాన్ని పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే కొంత మెరుగ్గా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తోందని తెలిపారు.
ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. నూతన విద్యా విధానంతో ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రైవేటీకరించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్నుతున్న కుట్రలను టీచర్లంతా ఐక్యంగా ప్రతిఘటించాలన్నారు. క్వాలిటీ లేకుండా మధ్యాహ్న భోజనం ఉంటుందని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాట్లాడుతుండడం విచారకరమన్నారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి 60శాతం నిధులు కేంద్రం ఇస్తుందని విషయాన్ని మంత్రులు గుర్తించుకోవాలన్నారు.
మిడ్ డే మీల్స్‌కు ఎక్కువగా ఫండ్స్ కేటాయించేలా కేంద్ర మంత్రులు పోరాడి శాంక్షన్ తెచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై మాట్లాడాలని సూచించారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న డీఏలు, ఈ కుబేర్ లోని బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఈ ప్రోగ్రాంలో డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్
యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి. రాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కిషోర్ సింగ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్. కృష్ణ, ఉపాధ్యక్షులు మురళీ మోహన్, వరలక్ష్మి, నాయకులు ఎం. వెంకటేశ్వర్లు, పద్మారాణి, తావురియా, జయరాజు, రమేశ్, హతిరాం, గంగాధర్, బాలు పాల్గొన్నారు.