తాము మొదలు పెట్టి వదిలేసిన పనులకే రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తోందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. హుజూర్ నగర్లో మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేసిన పనులు తాము ఉన్నప్పుడు ప్రారంభించినవే అని ఆయన చెప్పారు. తాను హౌసింగ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు 100 ఎకరాల పై చిలుకు ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ నుండి హౌసింగ్ డిపార్ట్ మెంట్‌గా మార్చామని తెలిపారు. 2160 ప్లాట్లకు 86 కోట్లతో పనులు మొదలుపెట్టామని వివరించారు. అలాగే.. విద్యుత్, నీటి సౌకర్యంతో పాటు రోడ్లకు దాదాపు 20 కోట్ల పనులకు డబ్బులు కేటాయించడం జరిగిందన్నారు. అదే సమయంలో రాష్ట్ర విభజన జరిగి ప్రభుత్వం మారడంతో ఈ ప్రభుత్వమే పనులను నిలిపివేసిందని విమర్శించారు.
ఇప్పటికైనా మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసిన ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి ఆ ఇండ్లను అర్హులైన పేదలకు ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ డిమాండ్ చేశారు. CTG ఫండ్ క్రింద కీతావారి గూడెం నుండి మునగాలకు వెళ్ళే రోడ్డు నిర్మాణం తాను కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపించినదే అని చెప్పారు. డాక్టర్లు, స్టాఫ్, పేషెంట్లు లేకుండా ఈఎస్ఐ ఆస్పత్రి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందని ఆయన విమర్శించారు. కాంట్రాక్ట్ పద్దతిలో విధుల్లో చేరే వారి నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. ఆరు నెలల క్రితం మున్సిపల్ కమిషనర్ కంప్యూటర్ లాగిన్ దొంగలించిన విషయం పై చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.