మాజీ మంత్రి హరీశ్‌రావు పదే పదే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మండిపడ్డారు. కమీషన్లకు కక్కుర్తి పడి నీటి వాటాల్లో రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. కృష్ణా బోర్డుకు తాము ప్రాజెక్టులను అప్పగించలేదని, బీఆర్ఎస్ మాత్రం తమపై విష ప్రచారం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిసినప్పుడు కూడా ప్రాజెక్టులను అప్పగించేది లేదని ఖరాకండిగా చెప్పామని తెలిపారు. సోమవారం సాయంత్రం సెక్రటేరియెట్‌లో మీడియాతో ఉత్తమ్ మాట్లాడారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ప్రాజెక్టులు ఇవ్వడానికి 56 రోజుల తమ పాలనలో ఎప్పుడూ ఒప్పుకోలేదన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.95 వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టినా ఒక్క ఎకరానికి కూడా నాటి బీఆర్ఎస్ సర్కార్ నీళ్లు ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ అన్నారు. ‘‘మూడేండ్లకే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయే పరిస్థితి తలెత్తింది. దీనికి కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతే కారణం. నిజాలేంటో తేల్చడానికి విజిలెన్స్‌తో విచారణ చేయిస్తున్నం” అని చెప్పారు. ఉమ్మడి మహబూబ్నగర్జిల్లాకు నీళ్లు ఇచ్చే ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ప్రాజెక్టును పదేండ్లు నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్, హరీశ్ రావు యువతను, ప్రజలను రెచ్చగొట్టారు.. బ్లాక్మెయిల్ చేశారు. హరీశ్‌రావు పెట్రోల్ పోసుకున్నట్లు నమ్మించి.. వేరే వాళ్ల మరణాలకు కారణం అయ్యిండు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఘనత కేసీఆర్‌ది, బీఆర్ఎస్ది ఎంతమాత్రం కాదు. యూపీఏ భాగస్వామ్య పక్షాలు సహా ప్రతిపక్షపార్టీల మద్దతును కాంగ్రెస్ కూడగట్టడంతోనే తెలంగాణ వచ్చింది” అని అన్నారు. కేసీఆర్‌పాలనలో అస్తవ్యస్థమైన ఇరిగేషన్ వ్యవస్థను చక్కదిద్దుతున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. కృష్ణా బోర్డుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టులు అప్పగించబోమని స్పష్టం చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
Also Read : మేడారం జాతరపై మావోయిస్టుల లేఖ కలకలం