రెండుమూడు రోజుల్లో SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ ఓ కొలిక్కి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రెండుమూడు రోజుల్లో SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ ఓ కొలిక్కి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

అమ్రాబాద్/నాగర్ కర్నూల్/మహబూబ్ నగర్: SLBC టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు చేస్తున్న రెస్క్యూ ఆపరేషన్ మరో రెండు మూడు రోజుల్లో ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ నిపుణుల పర్యవేక్షణలో టన్నెల్ బోర్ మిషన్లు, డీ-వాటరింగ్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. మరో రెండు మూడు నెలల్లో ఎస్.ఎల్.బి.సి పనులను పునరుద్దరిస్తామని ఆయన ప్రకటించారు.

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ ఘటనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇక్కడి పరిస్థితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఈ తరహా దుర్ఘటనలు జరిగినప్పుడు సహాయక చర్యల్లో పాల్గొనేందుకు గాను యావత్ భారతదేశంలోనే అపార అనుభవం గడించిన నిపుణులను రంగంలోకి దింపామన్నారు. ఇప్పటికే ఈ తరహా అనుభవం గడించిన 11 ఏజెన్సీలకు చెందిన బలగాలు రెస్క్యూ చర్యల్లో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. మరో సారి జియాలజికల్ సర్వేకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. 

టన్నెల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుక రావడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నామన్నారు. ఘటనా స్థలిలో నీరు లీకేజ్ ఆటంకంగా మారిందని ఆయన పేర్కొన్నారు. నీటి ఉధృతి పెరిగిందని రెస్క్యూ టీంలు పేర్కొంటున్నాయని అయితే యుద్ధ ప్రాతిపదికన నీళ్లు తోడేందుకు మోటార్లు నిరంతరం పని చేస్తున్నాయన్నారు. అయినా రెస్క్యూ టీంలు నిద్రాహారాలు మాని అహర్నిశలు శ్రమిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న రెస్క్యూ చర్యలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.

ఇటువంటి విపత్కర పరిస్థితిని విపక్షాలు చిల్లర రాజకీయాలకు వాడుకుంటున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ఘటనలో ఏడుగురు మృత్యువాత పడిన సమయంలో నాడు ప్రతిపక్షంలో ఉన్న తాము ఈ తరహా రాజకీయాలు చేయలేదన్నారు. అంతెందుకు.. శ్రీశైలం పవర్ ప్లాంట్లో ఎనిమిది మంది చనిపోయినప్పుడు మానవీయ కోణంలో స్పందించామే తప్ప రాజకీయాలు చేయలేదన్నారు. జరిగిన సంఘటన దురదృష్టకరమని ఇటువంటి సమయంలో హుందాగా వ్యహరించాల్సిన విపక్షాలు ఇంతగా దిగజరుతాయని అనుకోలేదన్నారు. నిర్మాణాత్మక సూచనలు, సలహాలు అందించాల్సిన స్థానంలో ఉన్న విపక్షాలు అవగాహన రాహిత్యంతో ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. 

ఎస్.ఎల్.బి.సి ప్రాజెక్ట్ బీఆర్ఎస్ పాలనలో పదేళ్ల పాటు నిర్లక్ష్యానికి గురైందని.. ఆ కారణంగానే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. "ఇది ప్రపంచంలోని అతి పొడవైన సొరంగాలలో ఒకటని, 45 కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి ఇంటర్మీడియట్ అవుట్‌లెట్‌లు లేవని వీటిలో 35 కిలోమీటర్లు పూర్తయిందని, ఈ ప్రాజెక్ట్ పూర్తయితే నల్లగొండ జిల్లా సస్యశ్యామలంగా మారడమే కాకుండా,ఫ్లోరైడ్ బాధ నుంచి శాశ్వత విముక్తి లభిస్తుందన్నారు. అటువంటి సమయంలో దురదృష్టవశాత్తు ఈ పరిణామం చోటు చేసుకుందన్నారు. విపక్షాలు ఇప్పటికైనా మానవీయ కోణంలో స్పందించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హితవు పలికారు.