గత పదేండ్లలో లక్షా 81 వేల కోట్లు ఖర్చు చేసినా ఆయకట్టు పెరగలే

గత పదేండ్లలో లక్షా 81 వేల కోట్లు ఖర్చు చేసినా ఆయకట్టు పెరగలే
  • గత ప్రభుత్వ పదేండ్ల పాలనలో ఇరిగేషన్ నాశనం: మంత్రి ఉత్తమ్​ 
  • కాళేశ్వరంపై రూ.లక్ష కోట్లు పెట్టినా అందుకు తగ్గ ఆయకట్టు రాలే
  • పాలమూరు, సీతారామతో ఒక్క ఎకరానికీ నీళ్లివ్వలే
  • మేం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లిచ్చే ప్రాజెక్టులు చేపట్టినం 
  • ఐదేండ్లలో భారీగా ఆయకట్టును పెంచుతాం 
  • నిర్లక్ష్యం చేస్తే అధికారులపై చర్యలు తప్పవని వార్నింగ్
  • ఎమ్మెల్యే ఫిర్యాదుతో మిర్యాలగూడ ఈఈ లక్ష్మణ్ సస్పెన్షన్​ 

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో ఇరిగేషన్​పై రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా ఆయకట్టు మాత్రం పెరగలేదని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఇరిగేషన్ రంగాన్ని గత సర్కారు నాశనం చేసిందని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టినా అందుకు తగ్గట్టుగా ఆయకట్టును సృష్టించలేకపోయారని విమర్శించారు. పైగా ఆ ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని, మిగతా రెండు బ్యారేజీలూ వీక్​గానే ఉన్నాయన్నారు. ఉమ్మడి నల్గొండ ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంగళవారం జలసౌధలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి అధికారులతో ఉత్తమ్ రివ్యూ చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుపై రూ.27 వేల కోట్లు, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై రూ.9 వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలేదన్నారు. దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్​సాగర్, ఎస్ఎల్బీసీ, డిండి వంటి ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. ఎక్కువ వడ్డీకి షార్ట్​టర్మ్ లోన్స్ తీసుకురావడంతో రాష్ట్రంపై తీవ్రమైన ఆర్థిక భారం పడిందన్నారు. రాష్ట్ర ఇరిగేషన్ బడ్జెట్​ రూ.22 వేల కోట్లయితే.. రూ.11 వేల కోట్లు అప్పుల చెల్లింపులకే సరిపోతున్నదని చెప్పారు. 

ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం.. 

తమ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నదని మంత్రి ఉత్తమ్ చెప్పారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లందించే ప్రాజెక్టులపై తాము దృష్టి పెట్టామన్నారు. వచ్చే ఐదేండ్లలో వీలైనంత ఎక్కువ ఆయకట్టును పెంచడమే లక్ష్యంగా ప్రాజెక్టుల పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు కొత్త ప్రాజెక్టులను నిర్మిస్తున్నామన్నారు. సీతారామ ప్రాజెక్టుకు 67 టీఎంసీల నీటి కేటాయింపులు వచ్చేలా చూశామని తెలిపారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు మరో 44 టీఎంసీల జలాలను తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టామన్నారు. సమ్మక్క సాగర్ బ్యారేజీపై ఎన్​వోసీ తెచ్చేందుకు చత్తీస్​గఢ్​తో చర్చలు జరుపుతున్నామని, ఇప్పటికే కార్యదర్శుల స్థాయిలో చర్చలు పూర్తయ్యాయని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వం కృష్ణా జలాలను ఏపీకి పంచి ఇచ్చేసిందని, కానీ, 555 టీఎంసీలు తెలంగాణకు దక్కేలా ట్రిబ్యునల్ లో కాంగ్రెస్ సర్కారు పోరాటం చేస్తున్నదని చెప్పారు. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర హక్కులను కాపాడి తీరుతామన్నారు.   

తప్పు చేస్తే సహించేది లేదు.. 

ఇంజినీరింగ్ అధికారులు పనుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులంతా తమ తమ హెడ్​క్వార్టర్స్​లలోనే డ్యూటీ చేయాలన్నారు. ప్రభుత్వం పెట్టుకున్న ఇరిగేషన్ లక్ష్యాలను అందుకునేలా పనిచేయాలని ఆదేశించారు. నల్గొండ సీఈ అజయ్ కుమార్, మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఫిర్యాదుల మేరకు.. మిర్యాలగూడ ఈఈ లక్ష్మణ్​ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఎవరైనా సరే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇలాంటి చర్యలు తప్పవని హెచ్చరించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇరిగేషన్ శాఖ అస్తవ్యస్తంగా తయారైందన్నారు. ప్లానింగ్, సిబ్బంది, మౌలిక వసతులు, సంస్థాగత నిర్మాణంపై అప్పటి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే కొత్తగా 700 మంది ఏఈఈలను నియమించిందన్నారు.

Also Read :- గుడ్ న్యూస్ : ఇంటర్ సిలబస్ కుదింపు

 దానికి అదనంగా 1800 లష్కర్లను నియమించామన్నారు. మరింత మందిని నియమించుకునేలా ఇప్పటికే టీజీపీఎస్సీకి అనుమతులు ఇచ్చామని చెప్పారు. అలాగే పెండింగ్ ఉన్న ప్రమోషన్లు, ట్రాన్స్​ఫర్లపై 15 రోజుల్లో విధివిధానాలను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని దేవరకొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, హుజూర్​నగర్, నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పెండింగ్​లో ఉన్న లిఫ్ట్​ స్కీంలు, ప్రాజెక్టులు, చెరువుల ఆధునీకరణ పనులపై సమావేశంలో చర్చించారు. వీలైనంత త్వరగా పనులను పూర్తి చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. 

పనులు ఎందుకు లేటైతున్నయ్?: ఉత్తమ్​

రాష్ట్రంలో ప్రాజెక్టుల పనులు ఆలస్యం అవుతుండటంపై ఇంజనీరింగ్‌‌‌‌ అధికారులపై ఇరిగేషన్‌‌‌‌ మంత్రి ఉత్తమ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో ప్రాధాన్యతగా పెట్టుకున్న పలు ప్రాజెక్టుల పనులు మందకొడిగా సాగుతుండడంపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే, చాలా ప్రాజెక్టులకు భూసేకరణ సమస్యగా మారిందని అధికారులు మంత్రికి వివరించినట్టు సమాచారం. పరిహారం విషయంలో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ప్రాజెక్టులకు నిధుల కొరత కూడా ఉందని చెప్పినట్టు తెలిసింది. ఉదయసముద్రంతో పాటు మూసీ కింద చేపడుతున్న పలు లిఫ్టుల పనుల పురోగతి గురించి ఆయన ఆరా తీశారని సమాచారం. మూసీ కింద చేపడుతున్న లిఫ్ట్‌‌‌‌కు సంబంధించి కేశవాపూర్– -కొండ్రపోల్ మధ్య పైప్‌‌‌‌లైన్ నిర్మాణం ఎందుకు ముందుకు సాగడం లేదని ప్రశ్నించినట్టు సమాచారం. ఇదే అంశంపై ఆ పనులు చూస్తున్న ఈఈ లక్ష్మణ్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఈఈ పని తీరుపై మంత్రికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అయితే, ఆ పైప్‌‌‌‌లైన్ వెళ్లే దారిలో రైతుల భూములున్నాయని, వాళ్లు ల్యాండ్‌‌‌‌ ఇచ్చేందుకు అంగీకరించడం లేదని ఈఎన్‌‌‌‌సీ, సీఈ, ఈఈ వివరించినట్టు తెలిసింది. అయితే, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రాజెక్టులకు నిధులు పెండింగ్ ఉన్నాయని, విడుదల చేస్తే పనుల్లో వేగం పెరుగుతుందని అధికారులు చెప్పినట్టు తెలిసింది.

ఎస్ఎల్బీసీని గత సర్కార్ పట్టించుకోలే: వెంకట్​ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇరిగేషన్ శాఖ లక్షన్నర కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి అన్నారు. కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీపై తదుపరి చేపట్టాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్నామన్నారు. 70 శాతం పూర్తయిన ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను గత ప్రభుత్వం పట్టించుకోలేదని.. పదేండ్లలో 10 కిలోమీటర్ల మేర కూడా టన్నెల్ పూర్తి కాలేదన్నారు. అది పూర్తయి ఉంటే అప్పుడు నల్గొండ జిల్లాలో 3 లక్షల ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. 2005లో నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో మాట్లాడి ఈ ప్రాజెక్టును మంజూరు చేయించానన్నారు. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం నల్గొండ రైతులకు తీవ్ర ద్రోహం చేసిందన్నారు. తాము అమెరికా నుంచి బేరింగ్​లు తెప్పిస్తున్నామని.. మార్చి నాటికి అవి ఎస్ఎల్బీసీ వద్దకు వస్తాయన్నారు. బ్రాహ్మణ వెల్లంల ద్వారా లక్ష ఎకరాలకు నీళ్లు అందిస్తామని మంత్రి తెలిపారు. ఇటీవలే సీఎం రేవంత్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్​ను ప్రారంభించారన్నారు. ఆర్ఆర్ఆర్ భూసేకరణ విషయంలో బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డివి అర్థం లేని మాటలన్నారు. గత ప్రభుత్వంలో ఆర్ అండ్ బీ మంత్రిగా ఉన్న ఆయన ఆ శాఖ పనులు ఎన్నడూ చేయలేదని.. అప్పటి సీఎం కేసీఆర్ చేసే యాగాలు, యజ్ఞాలకు, హోమాల వ్యవహారాలను చూసే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారని మండిపడ్డారు. ఆర్ఆర్ఆర్ యుటిలిటీ చార్జీలు కట్టకపోవడంతో ప్రాజెక్టు ఆగిపోయిందని, తాను కేంద్ర మంత్రి గడ్కరీకి విజ్ఞప్తి చేయగానే యుటిలిటీ చార్జీలను రద్దు చేశారన్నారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. కొత్త సంవత్సరం పూట అయినా ఆయన్ను ప్రశాంతంగా గడపనివ్వండని కామెంట్ చేశారు.