- అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: కేఆర్ఎంబీకి తాము ప్రాజెక్టులను అప్పగించలేదని, అప్పగించబోమని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సభను తప్పుదోవ పట్టించేలా మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలల్లోనే ప్రాజెక్టులను అప్పగించేందుకు కేంద్రానికి సమ్మతి తెలిపిందని హరీశ్‌రావు సభ దృష్టికి తెచ్చారు. జనవరి 17, ఫిబ్రవరి 1న కేంద్ర జలశక్తి శాఖ, కేఆర్ఎంబీ సమావేశాల మినిట్స్‌ను సభలో హరీశ్ చదివి వినిపించారు.
మంత్రి ఉత్తమ్ జోక్యం చేసుకొని అదే మినిట్స్‌లో రాష్ట్ర ఇరిగేషన్ సెక్రటరీ ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోబోమని చెప్పారని కూడా ఉందని, అది చదివి వినిపించాలన్నారు. స్పీకర్ సూచనతో మంత్రి ఉత్తమ్.. మినిట్స్చదివి వినిపించారు. ప్రాజెక్టులను అప్పగించలేదని ఉత్తమ్.. అప్పగించారని హరీశ్ మినిట్స్‌ను చదవడంతో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. మధ్యలో సీఎం రేవంత్ జోక్యం చేసుకొని.. కేంద్రం వద్ద జరిగిన సమావేశాల్లో అప్పటి సీఎం కేసీఆర్, ఇరిగేషన్‌శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారని, తాను, ఉత్తమ్ఇంత వరకు ఢిల్లీలో నిర్వహించిన ఏ సమావేశంలోనూ పాల్గొనలేదని తెలిపారు. తాము ఢిల్లీకే వెళ్లనప్పుడు ప్రాజెక్టులను ఎలా అప్పగిస్తామని సీఎం ప్రశ్నించారు.