- కాళేశ్వరం బ్యారేజీలు పనిచేయకున్నా ఎక్కువ ఉత్పత్తి
- చరిత్రలో తొలిసారి1.53 కోట్ల టన్నులు
- ఇప్పటి వరకు 21.73 లక్షల టన్నులు కొనుగోలు
- ఇందులో 5.67 లక్షల టన్నులు సన్నొడ్లు
- జనవరి 10 వరకు కొనుగోళ్లు కొనసాగుతాయని వెల్లడి
హైదరాబాద్/హుజూర్ నగర్, వెలుగు: దేశంలోనే అత్యధికంగా వడ్ల దిగుబడి సాధించి తెలంగాణ రికార్డు సృష్టించిందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 66.07 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 1.53 కోట్ల టన్నుల దిగుబడి వచ్చిందని తెలిపారు. కాళేశ్వరం కింద మూడు బ్యారేజీలు పని చేయకపోయినా రికార్డ్ స్థాయిలో వడ్ల దిగుబడి రావడానికి తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కారణమని చెప్పారు.
రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రైతులెవరూ తొందరపడొద్దని, జనవరి 10 వరకు కొనుగోళ్లు కొనసాగుతాయని వెల్లడించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి మూడ్రోజుల్లోనే చెల్లింపులు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో కొనుగోలు సెంటర్లను ఉత్తమ్ పరిశీలించారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వడ్ల కొనుగోళ్లపై అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ప్రకటన విడుదల చేశారు.
మా పాలన చరిత్రాత్మకం..
కాంగ్రెస్ ఏడాది పాలన చరిత్రాత్మకమని ఉత్తమ్ అన్నారు. అన్ని వర్గాలకు మేలు చేసేలా పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. దేశ చరిత్రలో 21 లక్షల మంది రైతులకు రూ.18 వేల కోట్ల రుణాలు మాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 1.53 కోట్ల టన్నుల వడ్ల దిగుబడి వచ్చిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ ఇంత పంట పండలేదన్నారు.
పేదలకు త్వరలోనే రేషన్ కార్డులు ఇస్తామని, రేషన్ కార్డు ఉన్నోళ్లందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో అవసరమైన చోట లిఫ్ట్ ల మరమ్మతులు, కొత్త లిఫ్ట్ ల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. హుజూర్ నగర్, కోదాడ మీదుగా హైదరాబాద్ నుంచి విజయవాడకు రైల్వే లైన్ కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు.
సన్నొడ్లు 5 లక్షల టన్నులు కొన్నం..
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 21.73 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేసినట్టు ఉత్తమ్ వెల్లడించారు. ఇందులో 16.06 లక్షల టన్నులు దొడ్డు వడ్లు కాగా, 5.67 లక్షల టన్నులు సన్నాలు ఉన్నాయని తెలిపారు. ‘‘ఇప్పటివరకు రూ.5,040.01 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశాం. అందులో రూ.2,760.22 కోట్లు రైతులకు చెల్లించాం. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన సన్నొడ్లకు సంబంధించిన బోనస్ రూ.283.25 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 80.17 కోట్లు చెల్లించాం” అని వివరించారు.
‘‘గత వానాకాలంతో పోలిస్తే మా ప్రభుత్వం 2,447 కొనుగోలు కేంద్రాలు ఎక్కువగా ఏర్పాటు చేసింది. అలాగే గతంలో ఇదే టైమ్ వరకు 20.6 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేయగా, ఇప్పుడు మేం 21.73 లక్షల టన్నులు కొన్నం. అంటే గతేడాది కంటే 1.67 లక్షల టన్నులు ఎక్కువగా కొనుగోలు చేశాం. అదే విధంగా పోయినేడాది ఈ టైమ్ వరకు అప్పటి ప్రభుత్వం రూ.2,414.23 కోట్ల చెల్లింపులు చేస్తే.. ఇప్పుడు మేం రూ.2,760.22 కోట్లు రైతులకు చెల్లించాం” అని తెలిపారు.