ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సౌలత్​లు కల్పించండి: ఉత్తమ్

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో  సౌలత్​లు కల్పించండి: ఉత్తమ్
  • ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో  సౌలత్​లు కల్పించండి
  • అధికారులకు  మంత్రి ఉత్తమ్​ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ధాన్యం కొనుగోలు సెంటర్లలో మౌలిక వసతులు కల్పించాలని అధికారులను సివిల్​ సప్లయ్స్​ మంత్రి ఉత్తమ్​ కుమార్​రెడ్డి ఆదేశించారు. అకాల వర్షాలకు రైతులు నష్టపోకుండా చూడాలని సూచించారు. వానాకాలం పంట కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్లతో శనివారం హైదరాబాద్​ సివిల్​ సప్లయ్స్​ భవన్​ నుంచి మంత్రి ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. ఈ సీజన్​లో 1.50 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి అంచనాలు ఉన్నాయని తెలిపారు. 

ధాన్యం కొనుగోళ్లకు రూ.30 వేల కోట్ల మేర నిధులు అవుతాయని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేల కోట్లు కేటాయించిందని చెప్పారు. అవసరమైతే అదనపు నిధుల విడుదలకు సిద్ధంగా ఉందని  ప్రకటించారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా 7,572 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇప్పటికే 4,598 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాం. 30 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోదాముల్లో వడ్ల నిల్వకు సిద్ధం చేశాం.   వడ్ల కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల సహకారం తప్పనిసరిగా ఉండాలి” అని మంత్రి పేర్కొన్నారు. మిల్లర్ల డిమాండ్  మేరకు మిల్లింగ్​ చార్జీలు పెంచామని, సీఎంఆర్​ చేరగానే మిల్లర్లకు బ్యాంకు​గ్యారంటీ రిలీజ్​ చేస్తామని మంత్రి వెల్లడించారు.