నల్లగొండ: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ తో పాటు ప్రజలను మోసం చేయడం వల్లే ఉప ఎన్నిక వచ్చిందని ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మునుగోడులో జరిగిన కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలపై ఛార్జ్ షీట్ను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు విడుదల చేశారు. మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట అన్న ఉత్తమ్ కుమార్.. బీజేపీలో చేరితే మునుగోడు ఎలా అభివృద్ధి చెందుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. 8 ఏండ్లలో జరగని అభివృద్ధి ఇప్పుడెట్లా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు ప్రజల కోసం చేసిందేమీ లేదని ఉత్తమ్ ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీ మోసాలపై విడుదల చేసిన ఛార్జ్ షీట్ ప్రతి ఇంటికీ చేరాలని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు, భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వకపోవడం, డిగ్రీ కాలేజీల ఏర్పాటు హామీ, పోడు భూముల సమస్యపై నిర్లక్ష్యం, డబుల్ బెడ్రూం ఇండ్ల హామీ, ఫ్లోరైడ్ సమస్య తదితర అంశాలపై ప్రజలను టీఆర్ఎస్ ఎలా మోసం చేసిందో ప్రజలకు వివరించాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు.