
- కరీంనగర్ జిల్లా ఇన్ చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
కరీంనగర్, వెలుగు: రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందించాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి, కరీంనగర్ జిల్లా ఇన్ చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు చరిత్రలో నిలిచిపోనున్నాయని తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళిక, సమీక్షా సమావేశం కరీంనగర్ లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం జరిగింది. సమావేశానికి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తో పాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి ఉత్తమ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయానికి యోగ్యమైన భూమికి పంట వేసినా వేయకపోయినా ఏటా రూ.12 వేలు రైతు భరోసా ఇవ్వనున్నామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ. 7500 కోట్ల రైతు భరోసా సొమ్ము రైతుల అకౌంట్ లో వేశామని గుర్తు చేశారు. ఇక మీదట రోడ్లు, రియల్ ఎస్టేట్ స్థలాలు, సాగుకు యోగ్యంలేని భూములకు రైతు భరోసా ఇవ్వబోమని స్పష్టం చేశారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వడానికి ముందుకు వెళ్లలేదని, తాము అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని వెల్లడించారు.
ఈనెల 26 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. రూ. 22,500 కోట్లతో నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని చెప్పారు. మొదటగా ఇంటి స్థలం ఉండి ఇళ్లు లేనివారికి ఈ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎత్తిపోయకుండానే 155 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించినట్లు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు.
అర్హుల గుర్తింపులో పొరపాటుకు తావు ఇవ్వొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
అర్హుల గుర్తింపులో పొరపాటుకు తావు ఇవ్వరాదని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, వాణిజ్య, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులకు సూచించారు. ప్రభుత్వం, అధికారులు తాపత్రయపడేది పేదవాళ్ల సంక్షేమం కోసమేనన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో ఏవైనా ఆటంకాలు కలిగించినా, అధికారులపై దాడులు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు : మంత్రి పొన్నం ప్రభాకర్
రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వ్యవసాయదారులకు రైతు భరోసా తో పాటు వ్యవసాయ కూలీలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా రూ.12 వేలు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం ఇదేనని అన్నారు. 6 గ్యారంటీలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీలు టీ.జీవన్ రెడ్డి, టీ.భాను ప్రసాదరావు, ఎల్.రమణ ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గంగుల కమలాకర్, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, పాడి కౌశిక్ రెడ్డి, విజయ రమణారావు, మక్కాన్ సింగ్, సంజయ్ కుమార్, కరీంనగర్ నగర మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు పాల్గొన్నారు.