- కేసీఆర్ అవినీతిపై సీబీఐతో కేంద్రం ఎందుకు ఎంక్వైరీ చేయించలే: ఉత్తమ్
- ఇతర రాష్ట్రాల లీడర్లపై కేసులు పెట్టినోళ్లు మీ మిత్రుడ్ని ఎందుకు వదిలేసిన్రు?
- అన్నీ తెలిసి కాళేశ్వరానికి కేంద్ర ప్రభుత్వం అప్పులు ఎట్లిచ్చింది?
- కాళేశ్వరంపై ఈ వారంలోనే జ్యుడీషియల్ ఎంక్వైరీ మొదలు
- ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టేది లేదని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ అవినీతి గురించి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇప్పుడు సీబీఐ ఎంక్వైరీ.. ఇంకేదో అంటూ మాట్లాడుతున్నారని, పదేండ్ల నుంచి కేంద్రంలో వాళ్ల ప్రభుత్వమే ఉండగా ఏం చేశారని రాష్ట్ర ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్‌స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. ‘‘కేసీఆర్లక్షల కోట్లు దోచుకున్నట్లు కిషన్‌రెడ్డి అంటున్నరు. కేంద్రంలో అధికారంలో ఉన్నది వాళ్లే కదా! మరి, ఎందుకు జైల్లో పెట్టలేదు? బీఆర్ఎస్, బీజేపీ కలిసి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నయ్. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న కర్నాటక, రాజస్థాన్, హిమాచల్ప్రదేశ్సహా ఇతర రాష్ట్రాల్లోని నాయకులపై కేసులు పెట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పెద్దలకు తెలంగాణలో తమ ఫ్రెండ్కేసీఆర్ అవినీతి కనిపించలేదా? ఎందుకు కేసీఆర్‌పై సీబీఐ, ఈడీ కేసులు పెట్టలేదు? పెడుతామంటే ఎవరు ఆపిండ్రో చెప్పాలి” అని నిలదీశారు.
ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కుటుంబానికి ఏటీఎంగా మారిందని ఎన్నోసార్లు అన్నారని, మరి వాళ్లు ఎందుకు ఎంక్వైరీ చేయించలేదని, దీని వెనుక ఉన్న మతలబు ఏమిటో చెప్పాలని కిషన్‌రెడ్డిని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై జ్యుడీషియల్ఎంక్వైరీ చేయిస్తామని తాము చెప్పామని, అది ఈ వారంలోనే మొదలు పెడతామని స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం సెక్రటేరియెట్ మీడియా సెంటర్లో మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం దరఖాస్తు చేసినట్లు అప్పటి బీఆర్ఎస్ప్రభుత్వం చెప్తే.. ఎలాంటి అప్లికేషన్రాలేదని కేంద్ర ప్రభుత్వం నేను అప్పట్లో పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పింది.ఈ రెండు పార్టీల తీరుతో భవిష్యత్ తరాలపై మోయలేని అప్పుల భారం పడింది” అని మండిపడ్డారు.
ప్రాజెక్టుకు అప్పులెట్లిచ్చిన్రు?
కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లతో కేంద్రం అనుమతి ఇచ్చిందని, తర్వాత దాన్ని రూ.1.27 లక్షల కోట్లకు పెంచేందుకు గ్రీన్సిగ్నల్ఇచ్చిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ప్రాజెక్టు రీ డిజైనింగ్కేంద్రంలోని వివిధ ఏజెన్సీలు ఎలా అనుమతులు ఇచ్చాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ ఇరిగేషన్ప్రాజెక్టుకు కూడా కార్పొరేషన్లు లోన్లు ఇవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పవర్ఫైనాన్స్కార్పొరేషన్, రూరల్ఎలక్ట్రిఫికేషన్కార్పొరేషన్రూ.60 వేల కోట్ల లోన్లు ఇచ్చాయి. నాబార్డులు, ఇతర బ్యాంకులు అప్పులిచ్చాయి. అప్పులు ఇచ్చిన సంస్థలకు ప్రాజెక్టు పనులను తనిఖీ చేసే బాధ్యత లేదా? బీఆర్ఎస్, బీజేపీ కలిసి దోచుకునేందుకే లోన్లు ఇచ్చారా?” అని మండిపడ్డారు. గత ఏడాది అక్టోబర్21న మేడిగడ్డ పిల్లర్లు కుంగినప్పటి నుంచి దానిపై కేసీఆర్‌నోరు విప్పలేదని అన్నారు. కనీసం మీడియాను కూడా మేడిగడ్డ దగ్గరికి వెళ్లనివ్వలేదని, తాను ఇరిగేషన్‌శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతే ఇతర మంత్రులు, మీడియాను వెంటబెట్టుకొని మేడిగడ్డకు వెళ్లానని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
ఇరిగేషన్‌పై త్వరలో శ్వేతపత్రం
మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ ఖర్చంతా నిర్మాణ సంస్థ ఎల్అండ్టీనే భరిస్తుందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఇరిగేషన్డిపార్ట్మెంట్పై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్కలిసి 3,500 రోజులు పని చేశాయని, ఇరిగేషన్‌శాఖలో అవినీతి కూడా ఆ రెండు పార్టీలు కలిసే చేశాయని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్పదేండ్లు అధికారంలో ఉన్నాయని.. తాము వచ్చి 20 రోజులు కూడా కాలేదని, తమను బద్నాం చేసేందుకు ఆ రెండు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన అన్నారు.