- ఇరిగేషన్ ఆఫీసర్లపైమంత్రి ఉత్తమ్ సీరియస్
- సూర్యాపేట సీఈ, సీడీవో సీఈ, ఈఎన్సీలకు ఫోన్
హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ శాఖ ఆఫీసర్లపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సొంత నియోజకవర్గంతోపాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని లిఫ్ట్ స్కీమ్స్ పనుల్లో జరుగుతున్న జాప్యంపై సీరియస్ అయ్యారు. సూర్యాపేట సీఈ, సీడీవో సీఈ, ఈఎన్సీలకు గురువారం ఫోన్ చేసి.. పనులు ఎందుకు లేట్ అవుతున్నాయంటూ నిలదీశారు. లిఫ్ట్ స్కీమ్స్‌కు సంబంధించిన డిజైన్లు లేట్అవుతుండడంతోనే పనులు ముందుకు కదలడం లేదని అధికారులు చెప్పడంతో.. ఇంత అలసత్వం ఎందుకని ఫైర్ అయ్యారు. సమస్య ఎక్కడుందని ప్రశ్నించారు. అధికారులు ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకోవడంతో.. ఇలాగైతే కుదరదని, తన సొంత నియోజకవర్గంలోనే పనులను ఇంత లేట్ చేస్తే రాష్ట్రంలో ప్రాజెక్టుల పరిస్థితి ఏంటని మండిపడ్డారు. వెంటనే నియోజకవర్గంలోని లిఫ్ట్ పనులను మొదలుపెట్టాలని ఆదేశించారు. సూర్యాపేట సీఈని వెంటనే హైదరాబాద్ ఆఫీస్‌కు రావాలని ఆర్డర్వేశారు. పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయో.. ఏయే లిఫ్టుల పని ఎంత వరకు వచ్చిందో రివ్యూ చేయాలని ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్‌ను ఆదేశించారు.
బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం..
సంక్షేమ పథకాల అమలుపై బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తున్నదని మంత్రి ఉత్తమ్మండిపడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు చేపట్టిన పథకాలు ఎక్కడా ఆగబోవని చెప్పారు. సెక్రెటేరియెట్‌లో మీడియాతో ఉత్తమ్ చిట్‌చాట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని, ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని కోరారు. ఇంతకన్నా మంచిపాలన ఇప్పటిదాకా తాను చూడలేదని, ఇన్ని మంచి పథకాలు ఎవరూ అమలు చేయలేదని అన్నారు.