- వాళ్లు రెండు సార్లు మాఫీ చేసినా.. అవి వడ్డీలకే చాలలే: మంత్రి ఉత్తమ్
- అలాంటోళ్లు మమ్మల్ని విమర్శిస్తరా?
- దేశ చరిత్రలోనే భారీగా రుణమాఫీ చేసిన ఘనత మాదే
- సాంకేతిక సమస్యలతోనే కొందరికి మాఫీ కాలేదు
- మండల వ్యవసాయాధికారులు సమస్య పరిష్కరిస్తారని వెల్లడి
- బీఆర్ఎస్ అప్పులు చేస్తే.. మేం రుణమాఫీ చేసినం: జూపల్లి
హైదరాబాద్, వెలుగు: రైతు రుణమాఫీపై రాజకీయ దురుద్దేశంతోనే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్అయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణమాఫీ చెయ్యడం చేతకాలేదని, రెండుసార్లు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన బీఆర్ఎస్.. రెండు విడతల్లో చేసినా అవి కనీసం వడ్డీకి కూడా చాలలేదని విమర్శించారు. అలాంటోళ్లు తమను విమర్శించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. సోమవారం జలసౌధలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 నాటికి రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి చూపించామని తెలిపారు. ఇంతవేగంగా రుణమాఫీ చేసిన చరిత్ర తమ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా తెలంగాణలోనే రుణమాఫీ జరిగిందని చెప్పారు.
అన్ని సమస్యలు పరిష్కరిస్తం
సమస్యలన్నీ పరిష్కరించి కానివారికి రుణమాఫీ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ చెప్పారు. అన్ని మండల కేంద్రాల్లో ఫిర్యాదు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మండల వ్యవసాయాధికారులు ఆ సమస్యలు పరిష్కరిస్తారని పేర్కొన్నారు. గత పదేండ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రుణమాఫీ ఫిర్యాదు కేంద్రాలను ఏర్పాటు చేయలేదని చెప్పారు. అకాల వర్షాలు, వరదలకు పంట నష్టపోయినా ఏనాడూ ఆర్థిక సాయంగానీ, పరిహారంగానీ ఇవ్వలేదని విమర్శించారు. ‘‘బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చేదిలేదు.. సచ్చేది లేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏనాడూ రైతులను పట్టించుకోలేదు. రుణమాఫీపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కేటీఆర్ లేఖ రాయడం అనేది కేవలం ప్రచారం కోసమే” అని ఉత్తమ్ అన్నారు.
బీఆర్ఎస్ నేతలది గోబెల్స్ ప్రచారం: జూపల్లి
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పు చేస్తే.. తమ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసిందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రైతుల లోన్ అకౌంట్లలో కొన్ని డూప్లికేట్ ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వం రుణమాఫీలో చాలా తప్పులు చేసిందని ఆరోపించారు. బావ బామ్మర్దులు (హరీశ్‌రావు, కేటీఆర్) సవాల్ విసిరి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. బీఆర్‌ఎస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్‌ఎస్ రుణమాఫీని జీర్ణించుకోలేక పోతున్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రుణమాఫీలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు.
సర్కారుకు ఖర్చు లేకుండా ప్రాజెక్టుల పూడికతీత
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్యాములు, రిజర్వాయర్లలోని పూడికతీతకు ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆహ్వానించాలని అధికారులకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. గ్లోబల్ టెండర్లను ఆహ్వానించాలని, ఈపీసీ విధానంలో టెండర్లను పారదర్శకంగా నిర్వహించాలని చెప్పారు. ఈపీసీ విధానంలో టెండర్లను పిలిస్తే త్వరగా పనులు పూర్తవుతాయన్నారు. ప్రభుత్వానికి ఖర్చు లేకుండా రెవెన్యూ జనరేట్ అయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
ప్రాజెక్టుల్లో పూడికతీతపై వేసిన కేబినెట్ సబ్ కమిటీ సోమవారం సెక్రటేరియెట్‌లో సమావేశమైంది. ‘‘నీటి పారుదల జలాశయాలలో పూడికతీత పనులను పకడ్బందీ ప్రణాళికతో చేపట్టాలి. జలాశయాలలో ఉన్న ఇసుక, మట్టి నిల్వలను ఖనిజాభివృద్ధి సంస్థ అంచనా వేసి సర్కారుకు రెవెన్యూ వచ్చేలా అంచనాలు రూపొందించాలి. ప్రాజెక్టుల్లోని ఇసుక, మట్టి, ఖనిజాల ద్వారా వచ్చే ఆదాయంతో రిజర్వాయర్ల నిర్వహణ పనులను చేపట్టాలి. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి అన్ని జలాశయాలలో పూడికతీత పనులను చేపట్టి వేగంగా పనులు పూర్తి చేయాలి. ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడకుండా పూడికతీత పనులు జరిగేలా చూడాలి. అన్ని శాఖల అధికారులు పనులను పూర్తి చేసి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పెరిగేలా కృషి చేయాలి. జలాశయాలు వ్యవసాయానికి ఉపయోగకరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి”అని అధికారులకు మంత్రి ఉత్తమ్ వివరించారు. మంత్రులు తుమ్మల, జూపల్లి, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సాంకేతిక కారణాల వల్లే..
రూ.2 లక్షల వరకు రుణమాఫీలో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాలేదని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ‘‘1.20 లక్షల ఖాతాల ఆధార్ నెంబర్లు సరిగా లేకపోవడం వల్ల రుణమాఫీ ఆగింది. 1.61 లక్షల అకౌంట్లలో ఆధార్, పాస్ బుక్ పేరు మిస్ మ్యాచ్ ఉంది. లక్షన్నర అకౌంట్లలో బ్యాంకుల నుంచి తప్పులున్నాయి. 4.83 లక్షల అకౌంట్లకు రేషన్ కార్డు లేదు. వాటిని వెరిఫై చేయాల్సి ఉంది. 8 లక్షల అకౌంట్లకు రెండు లక్షల కంటే ఎక్కువ రుణాలున్నాయి”అని ఉత్తమ్ వివరించారు.