కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకపోవడానికి రాష్ట్రప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టు్ల్లో అవినీతిని కప్పిపుచ్చుకునేందుకునే రాష్ట్ర సర్కారు ఇన్వెస్ట్ మెంట్ క్లియరెన్స్ ఇవ్వలేదని ఆరోపించారు. కేసీఆర్ సర్కారు చేసిన తప్పిదం వల్లే కాళేశ్వరానికి కేంద్రం జాతీయ హోదా నిరాకరించిందని ఉత్తమ్ కుమార్ మండిపడ్డారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ సర్కారు కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ప్రాజెక్టుకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ గురించి గతంలోనే కేంద్రం అడిగినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ఉత్తమ్ ఆరోపించారు. కృష్ణా ,గోదావరి నదులపై కడుతున్న ప్రాజెక్టులకు 6 నెలల్లో క్లియరెన్స్ తీసుకోవాలని గతంలో కేంద్రం నోటిఫికేషన్స్ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం కడుతుంటే సీఎం కేసీఆర్ చూస్తూ కూర్చున్నాడని, దాని వల్ల మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా రైతులు నష్టపోతారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తే రైతులకు మేలు జరిగేదన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై పార్లమెంటులో నిలదీస్తానని చెప్పారు.