
- ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికే హరీశ్ తప్పుడు ప్రచారం: ఉత్తమ్
- ఆంధ్ర నీళ్ల దోపిడీకి గత పాలకులే కారణమని ఫైర్
హైదరాబాద్, వెలుగు: రబీ యాక్షన్ ప్లాన్ ప్రకారమే నీటి విడుదల చేస్తున్నామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో హరీశ్ రావు తెలిసి మాట్లాడుతున్నాడో.. తెలియక మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికే ఆయన తప్పుడు సమాచారం ఇస్తున్నారని మండిపడ్డారు. బుధవారం గాంధీ భవన్లో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు.
పంటలు దెబ్బతినకుండా నీళ్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి, తాను ఇద్దరం కలిసి కలెక్టర్‌కు, చీఫ్ ఇంజనీర్‌కు ఆదేశాలిచ్చామని, దాని ప్రకారమే నీటిని విడుదల చేశారని తెలిపారు. రబీలో 56 లక్షలకు పైగా ఎకరాల్లో వరిసాగవుతోందని, తక్కువ నీటిని సమర్థవంతంగా ఉపయోగిస్తున్నామని తెలిపారు.
నీటి దోపిడీని ప్రోత్సహించిందే బీఆర్ఎస్..
పదేండ్ల పాటు బీఆర్ఎస్ చేసిన పొరపాట్ల వల్లే రైతులకు కష్టకాలం వచ్చిందని ఉత్తమ్ ఆరోపించారు. కృష్ణా నదిలో నీటిని అక్రమంగా తరలించుకుపోతుంటే.. ఆనాడు కేసీఆర్, జగన్ ఇద్దరు కలిసి విందు, వినోదాలు చేసుకున్నారని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం ఎక్కువ నీటి దోపిడీని ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అని ఆరోపించారు. ఆనాటి ఆంధ్ర పాలకులతో కుమ్మక్కయింది కేసీఆర్ అని, ఆంధ్రకు ఎక్కువ నీళ్లు ఇవ్వండని లేఖ రాసింది మీరు కాదా? అని హరీశ్‌పై ఉత్తమ్ మండిపడ్డారు.
చేసేది అంతా చేసి ఇప్పుడు మమ్మల్ని తిట్టడం ఏమిటని హరీశ్ పై ఫైర్ అయ్యారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా కోసం కేంద్రం దగ్గర కొట్లడుతున్నది తమ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఆంధ్ర చేస్తున్న గోదావరి నీళ్ల దోపిడీకి మీరే కారణమని ఆరోపించారు. తాము చేసిన ఒత్తిళ్ల వల్లే కేఆర్ఎంబీ సమావేశాలు పెట్టారని చెప్పారు. తాము చేసిన ప్రయత్నం వల్లే ఇప్పుడు కృష్ణా నుంచి ఏపీ నీళ్లు తీసుకెళ్లకుండా ఆపగలిగామని, అందులో నీళ్లు నిల్వ ఉన్నాయంటే తమ ప్రయత్నాలే వల్లేనన్నారు.
కృష్ణా, గోదావరి జలాల తరలింపుతో రైతులకు ఇబ్బందులు
బీఆర్ఎస్ చేసిన పొరపాటు వల్ల కృష్ణా, గోదావరి జలాల తరలింపులో రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి ఉత్తమ్ అన్నారు. ఏపీకి ఈ నీటిని బీఆర్ఎస్ ధారాదత్తం చేసిందని ఆరోపించారు. కృష్ణా నది జలాల్లో 512 టీఎంసీలు ఏపీకి ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రభుత్వం లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూల్స్ మార్చాలని ఒత్తిడి తెచ్చామని తెలిపారు. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టకపోవడం తెలంగాణకు నష్టమన్నారు. మేడిగడ్డ దగ్గర ప్రమాద రక్షణ చర్యలు చేపట్టకపోతే.. ఊళ్లు కొట్టుకుపోతా యని ఎన్‌డీఎస్‌ఏ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పారు.