ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. పచ్చి అబద్ధాలు చెబుతుండు: ఉత్తమ్

సుర్యాపేట జిల్లా హుజుర్ నగర్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. 2023, నవంబర్ 10వ తేదీ శుక్రవారం నియోజకవర్గంలోని ఆర్డీఓ కార్యాలయంలో రెండో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ఈరోజు  సాయంత్రం 4 గంటలకు కోదాడలో, 6 గంటలకు హుజుర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని.. ఈ ర్యాలీకి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్, ఎఐసీసీ సభ్యలు రఘువీరారెడ్డి, సీపీఐ పార్టీ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొనబోతున్నట్లు చెప్పారు.

ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ చెప్పే మాయమాటలు ఎవ్వరు వినడం లేదన్నారు. రైతులకు మొదట ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు కొనసాగుతూనే ఉంటుందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అబద్ధాలు ఆడుతున్నాడని ఫైర్ అయ్యారు ఉత్తమ్.

రైతుబంధు ఆపాలని తాను ఎక్కడ అనలేదని.. ఎన్నికల సమయానికి ముందే.. దళిత బంధు, బీసీ బంధు, రైతుబంధు వంటి అన్ని ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఇవ్వాలని డిమాండ్ చేశానన్నారు.
నియోజకవర్గములో బీసీ, దళితులు, గిరిజనులపై పోలీస్ స్టేషన్ లో అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములను స్వాధీనం చేసుకుని దందాలకు పాల్పడ్డారని ఆరోపించారు. పేదలకు న్యాయం జరగాలంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సిందేనని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.