సూర్యపేట క్యాంప్ ఆఫీస్ ఇవ్వండి..కలెక్టర్‌‌కు లెటర్ రాసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

  •     అన్ని వసతులు ఉండడంతో తనకు కేటాయించాలని విన్నపం 
  •     ప్రస్తుతం అందులో ఉంటున్న ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి 
  •     ఖాళీ చేస్తారా..? లేదా..? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌‌ కోసం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌‌‌‌ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. మిగితా క్యాంప్‌‌ ఆఫీసులకు భిన్నంగా అందులో అన్ని సౌలత్‌‌లు ఉండడంతో తనకు కేటాయించాలని కలెక్టర్‌‌‌‌కు లేఖ రాశారు.  అయితే ప్రస్తుతం అందులో ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఉంటున్నారు. ఆయన ఆఫీస్‌‌ను ఖాళీ చేస్తారా..? లేదా..? అనేది జిల్లాలో చర్చనీయాశంగా మారింది. కలెక్టర్‌‌‌‌ కూడా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

సకల హంగులతో క్యాంప్ ఆఫీస్ నిర్మాణం

గత బీఆర్‌‌‌‌ఎస్‌‌ సర్కారు  ప్రతి నియోజకవర్గంలో రూ.కోటితో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులను నిర్మించిన విషయం తెలిసిందే. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాత్రం ఎమ్మెల్యే జగదీశ్‌‌ రెడ్డి ప్రభుత్వం మంజూరు చేసిన ఫండ్స్‌‌కు అదనంగా రూ. 2.30 కోట్ల మినరల్‌‌ (డీ‌‌ఎం‌‌ఎఫ్‌‌టీ) ఫండ్స్ కేటాయించారు.  రూ.10.10 లక్షలతో పవర్ ప్లాంట్,  రూ.10 లక్షలతో గేట్లు, టాయిలెట్లు,  రూ.10 లక్షలతో మీటింగ్ హాల్ , రూ.10 లక్షలతో  డైనింగ్ హాల్, రూ.10 లక్షలతో సీసీ రోడ్డు, రూ.10 లక్షలతో పెంట్ హౌస్‌‌ నిర్మాణం చేశారు.  ఆఫీస్ పెయింటింగ్‌‌కు రూ. 10 లక్షలు,    సోలార్ ఫెన్సింగ్, సీసీ కెమెరాలకు రూ.5లక్షలు, జనరేటర్‌‌‌‌కు రూ.20లక్షలు ఖర్చు చేశారు. కాగా, ఈ ఫండ్స్‌‌ కేటాయింపులు రూల్స్‌‌కు విరుద్ధం కావడం గమనార్హం.  

అనువైన ఆఫీస్‌‌ దొరకకపోవడంతో..

కాంగ్రెస్ అధికారంలో రావడంతో పాటు హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌ ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి పదవి దక్కడంతో జిల్లా కేంద్రంలో క్యాంప్‌‌ ఆఫీస్‌‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తాత్కాలిక భవనం కోసం ప్రయత్నాలు చేసినా.. మంత్రి స్థాయికి సరిపడా ఆఫీసు దొరకలేదు. దీంతో ప్రస్తుతం ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఉంటున్న క్యాంప్ ఆఫీస్ కేటాయించాలని జిల్లా కలెక్టర్‌‌‌‌కు లేఖ రాశారు. ఏ నియోజకవర్గంలో లేని విధంగా మినరల్‌‌ ఫండ్స్‌‌తో  నిర్మించిన ఆఫీస్‌‌కు తనకు ఇవ్వాలని అందులో కోరినట్లు సమాచారం. 

జగదీశ్‌ రెడ్డి నిర్ణయంపై ఉత్కంఠ

నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే వారికే క్యాంపు ఆఫీసులు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే  మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన జగదీశ్ రెడ్డి  అందులో ఉంటున్నారు. కానీ, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌‌ రెడ్డి అదే క్యాంప్‌ ఆఫీస్‌ను కోరుతుండడంతో జగదీశ్ రెడ్డ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆయన ఖాళీ చేస్తారా..?  అందులోనే ఉంటానంటారా..? అనే దానిపై చర్చజరుగుతోంది. మరోవైపు ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనే దానిపైనా  ఆసక్తి నెలకొంది.