జార్ఖండ్​ను రోహింగ్యాలకు ధర్మశాలగా మార్చారు

జార్ఖండ్​ను రోహింగ్యాలకు ధర్మశాలగా మార్చారు
  • జేఎంఎం కూటమిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపణలు

రాంచీ: జార్ఖండ్ లోని జేఎంఎం నేతృత్వంలోని కూటమి రాష్ట్రాన్ని రోహింగ్యాలు, బంగ్లాదేశీ చొరబాటుదారులకు ధర్మశాలగా మార్చిందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. రాష్ట్రంలోని మాఫియాను యముడి దగ్గరకు పంపించడానికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరమని తెలిపారు. సోమవారం గర్వాలోని భవన్ పూర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ‘‘జార్ఖండ్.. రోహింగ్యాలు, బంగ్లాదేశీ చొరబాటుదారులకు ధర్మశాలగా మారింది. ప్రజలందరు ఐకమత్యంగా ఉండాలి. అలా ఉంటేనే క్షేమంగా ఉంటారు. 

లేకపోతే తుడిచిపెట్టుకుపోతారు. జార్ఖండ్ లోని జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ కూటమి అవినీతి, అరాచకం, సహజవనరుల దోపిడీకి ఆజ్యం పోసింది. వ్యక్తిగత ఎదుగుదల కోసం గాంధీ, సోరెన్, లాలూ యాదవ్ కుటుంబాలు దోపిడీ, అవినీతికి పాల్పడ్డాయి. ప్రజలు శాంతియుతంగా పండుగలు జరుపుకోవడానికి జార్ఖండ్ లోని జేఎంఎం సర్కారు అనుమతించడం లేదు. యువతకు ఉద్యోగాలు, మహిళా సాధికారత, దేశ భద్రతకు బీజేపీ మాత్రమే గ్యారంటీ ఇవ్వగలదు” అని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.