- బస్సుల్ని తగలబెట్టేస్తారు! రైలుపట్టాలు పీకేస్తారు!
- పోలీస్ స్టేషన్లకు నిప్పు పెట్టేస్తారు!
- ఆఫీసుల్లోకి చొరబడి ఫర్నీచర్ నాశనం చేస్తారు!
కారణాలేవైనా కావచ్చు, కానీ… నిరసన పేరుతో ఆందోళనకారులు కోపం చూపించేది మాత్రం బస్సులు, రైళ్ళు, సర్కారీ ఆఫీసులపైనే.ఇట్లా ఎన్నాళ్ళు?…. అందుకే 1984లో ఓ చట్టం వచ్చింది. జైలుశిక్షలకు, జరిమానాలకు అవకాశమిచ్చిన చట్టమది.కానీ, ఇంతవరకు సరిగా అమలుచేయలేకపోయారు. యూపీలో యోగి ఆదిత్యానాథ్ గవర్నమెంట్ మాత్రం ఆ చట్టాన్ని వాడుకుంటూ, జరిగిన డ్యామేజీకి పరిహారం చెల్లించాలంటూ…పట్టుబట్టి…వసూళ్ళు మొదలుపెట్టింది.
‘నిరసన’ ప్రజల హక్కు. శాంతియుతంగా జరిగితే ప్రభుత్వాలు అబ్జెక్షన్ చెప్పవు. పెద్దగా అడ్డుకోవు. మహా అయితే పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి కొద్దిసేపటి తర్వాత వదిలేస్తారంతే. పెద్దఎత్తున అల్లర్లకు దిగి, ఆస్తులను ధ్వంసం చేస్తుంటే మాత్రం చూస్తూ ఊరుకోరు. ఈ నేపథ్యంలో… తాజాగా సిటిజెన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్నార్సీ)ని వ్యతిరేకిస్తూ యూపీలో జరిగిన నిరసనల్లో 17 మంది చనిపోగా, కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఇందుకు సంబంధించి 478 మందిని గుర్తించి, వాళ్లలో 372 మందికి యోగి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దీనిపై బులంద్‌షహర్‌లోని ముస్లిం మతస్తుల కమిటీ స్పందించింది. తమ వంతుగా 6.27 లక్షల రూపాయలకు డీడీ తీసి ఉన్నతాధికారులకు అందజేసింది. అయితే యోగి నిర్ణయం లీగల్ స్ర్కూటినీలో నిలుస్తుందో లేదో చూడాలంటున్నారు లీగల్ ఎక్స్‌పర్ట్‌లు.
‘డేరా’పై హైకోర్టు ఆగ్రహం
2017 ఆగస్టులో హర్యానాలో పలు రేప్ కేసుల్లో డేరా బాబా అలియాస్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను సీబీఐ స్పెషల్ కోర్టు దోషిగా తేల్చినప్పుడు ఆయన భక్తులు హింసకు పాల్పడ్డారు. కేవలం పంచ్‌కులా ప్రాంతంలోనే రూ.126 కోట్ల విలువైన ప్రైవేటు, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అయింది. దీంతో హైకోర్టు కన్నెర్ర చేసింది. ఆ డబ్బు చెల్లించే వరకు డేరా సచ్ఛా సౌదా ఆస్తులను ఫ్రీజ్ చేయాలని ఆర్డర్ వేసింది. దేశ చరిత్రలో ఒక కోర్టు నుంచి ఇలాంటి ఆదేశాలు రావటం అదే తొలిసారి.
‘జాట్’ ఇచ్చింది జీరో!
డేరా బాబా ఎపిసోడ్ కన్నా ఏడాది ముందు అదే హర్యానాలో జాట్ సామాజిక వర్గం కోటా కోసం కొట్లాటకు దిగింది. 2016 ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున జరిగిన గొడ వల్లో 30 మంది చనిపోయారు. రూ.1,800–2,000 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లినట్లు అసోచాం అంచనా వేసింది. ఆ రాష్ట్రంలో అప్పట్లో కూడా అధికారంలో ఉన్న బీజేపీ… పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజీకి కారణమైనవారి నుంచి సొమ్ము వసూలు చేస్తామని పంజాబ్, హర్యానా హైకోర్టుకు హామీ ఇచ్చింది. కానీ.. ఇంతవరకూ నయా పైసా రాబట్టలేదు.
పటీదార్లపై పిల్ వాపస్
గుజరాత్లో 2015 ఆగస్టులో పటేల్ కమ్యూనిటీ కోటా మూవ్మెంట్ సందర్భంగా ఆందోళనకారులు రెచ్చిపోయారు. 660 గవర్నమెంట్ వెహికిల్స్‌కి; 1,822 ప్రభుత్వ భవనాలకు నిప్పు పెట్టారు. ఈ రణరంగం పూర్తైన వారం రోజుల తర్వాత గుజరాత్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ప్రభుత్వ ఆస్తులకు జరిగిన డ్యామేజీ అంచనాకు ఎంక్వైరీ కమిషన్ వేయాలని ఆ పిల్లో కోరారు. అయితే, దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయమూ తీసుకోకముందే పిటిషన్ విత్‌డ్రా చేసుకున్నారు. ఎందువల్ల పిల్ వెనక్కి తీసుకున్నారో సరైన కారణాలు తెలియదు.
రైల్వేకి రూ.80 కోట్లు లాస్
సిటిజెన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్‌కి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకున్న నిరసనలు రైల్వే ఆస్తుల విధ్వంసానికి, దహనానికి దారి తీశాయి. కేవలం నాలుగు రోజుల్లోనే జరిగిన ఈ ఘటనల్లో రూ.80 కోట్ల విలువైన ప్రాపర్టీకి నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించి రైల్వే 64 ఎఫ్ఐఆర్లు నమోదు చేయగా, 931 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. బాధ్యుల్ని గుర్తించాలని కోరుతూ కలకత్తా హైకోర్టులో దాఖలైన 6 పిల్స్‌పై విచారణ జరుగుతోంది.
పూరీలో హింసతో తెరపైకి ‘పూచీకత్తు’
పూరీ శ్రీమందిర్‌లో అమల్లోకి తెచ్చిన క్యూ పద్ధతిని నిరసిస్తూ ‘జగన్నాథ్ సేన’ బంద్ పాటించింది. స్థానికులకు క్యూ పద్ధతి వద్దంటూ కిందటేడాది అక్టోబర్‌లో నిర్వహించిన ఈ బంద్ హింసాత్మకంగా మారింది. ఈ అల్లర్లలో రూ.20 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు ‘పూచీకత్తు’ అనే కొత్త రూలు పెట్టారు. ర్యాలీలు చేపట్టాలనుకునేవారు ఎవరైనా జరగబోయే నష్టానికి పరిహారం చెల్లిస్తామని బాండ్ పేపర్ రాసిస్తేనే అనుమతిస్తామని లింక్ పెట్టారు.
కర్ణాటకలో గప్‌చుప్
ఈపీఎఫ్ చట్టాన్ని సవరించాలనే కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ బెంగళూరులోని గార్మెంట్స్ ఫ్యాక్టరీ వర్కర్లు 2016 ఏప్రిల్‌లో ఆందోళనకు దిగారు. పోలీస్ వ్యాన్లు, బస్సులు సహా సుమారు 15 వాహనాలకు నిప్పు పెట్టారు. సెప్టెంబర్‌లో చోటు చేసుకున్న కావేరీ అల్లర్లలోనూ పబ్లిక్ ప్రాపర్టీకి డ్యామేజీ జరిగింది. 30కిపైగా బస్సులు కాలి బూడిదయ్యాయి. ఈ రెండు కేసుల్లోనూ బాధ్యుల నుంచి మూల్యం రాబట్టే ప్రయత్నాన్ని ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు.
ఫైన్ కడితేనే బెయిల్
ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారనే ఆరోపణలు ఎదుర్కొనేవారు… అంచనా మొత్తాన్ని డిపాజిట్ చేస్తేనే బెయిల్ ఇస్తామని కేరళ హైకోర్టు 2011లో కండిషన్ పెట్టింది. అయితే ఇంతవరకు అమల్లోకి రాలేదు. శబరిమల గుడిలోకి ఆడవాళ్లను పోనివ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆందోళనలు జరిగాయి. ఆ నిరసనల్లో 49 కేరళ ఆర్టీసీ బస్‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్–1984 కింద చాలామందిని అరెస్టు చేసినా జరిమానాలు వసూలు చేయలేదు.
లీగల్ యాక్షన్‌కు రెడీ!
‘యాంటీ–సిటిజెన్షిప్ లా’ని వ్యతిరేకిస్తూ అస్సాంలో అల్లర్లు సాగుతూనే ఉన్నాయి. డిసెంబర్లో గువాహటి, దిబ్రూఘర్‌లలో జరిగిన అల్లర్లలో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. దీంతో సర్వానందా సోనోవాల్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం.. ఈ వయొలెన్స్ వెనకున్న వ్యక్తులపై లీగల్ యాక్షన్ తీసుకోవటానికి ప్లాన్ రెడీ చేస్తోంది. ఈ అల్లర్లకు సంబంధించి సీసీ ఫుటేజీలతో మరింత ఎవిడెన్స్ సేకరించాక రంగంలోకి దిగనుంది.
డ్యామేజీ లెక్క కూడా తేల్చలే
2019 ఫిబ్రవరిలో గుజ్జర్ కమ్యూనిటీ కోటా ఉద్యమ కాలంలోనూ, 2017 నవంబర్‌లో ‘పద్మావత్’ సినిమా వివాదం తలెత్తినప్పుడు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, దహనం వంటివి ఎన్నోసార్లు జరిగాయి. అయినా.. కనీసం ప్రభుత్వ ఆస్తులకు ఎంత నష్టం జరిగిందనే లెక్కలు కూడా చేయటానికి ప్రభుత్వం ముందుకు రాలేదు.
భీమ్ ఆర్మీ బీభత్సం.. చర్యలు శూన్యం
రవిదాస్ టెంపుల్ కూల్చివేతను నిరసిస్తూ గతేడాది ఆగస్టు 22న ఢిల్లీలో జరిపిన ప్రదర్శన చివరికి హింసాత్మకంగా మారింది. గోవింద్‌పురి ప్రాంతంలో 14 కార్లు కాలి బూడిదయ్యాయి. ఈ ఆందోళన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ నాయకత్వంలో జరిగింది. పోయినేడాది నవంబర్లోనే తీస్ హజారీ కోర్టులో పార్కింగ్ ఇష్యూపై పోలీసులు, లాయర్ల మధ్య గొడవలు జరిగాయి. అడ్వకేట్లు 13 పోలీస్ వ్యాన్ల్ని, ప్రైవేటు వ్యక్తుల బైక్‌ల్ని తగలెట్టారు. సాకేత్ ప్రాంతంలోనూ వయొలెన్స్ చోటుచేసుకున్నా ఎవరినీ కనీసం అరెస్ట్ చేసిన పాపాన పోలేదు. రీసెంట్గా డిసెంబర్ 15న యాంటీ–సీఏఏ ఆందోళనల్లో భాగంగా జామియా నగర్, మథురా రోడ్డులో ఇళ్లు దహనం చేసిన సంఘటనలపై పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. నష్టాన్ని అంచనా వేయటానికి క్లెయిమ్స్ కమిషనర్‌ను నియమించాలని, బాధ్యుల నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేయటానికి అనుమతించాలని కోరారు.
చట్టాలు, కోర్టులు ఏం చెబుతున్నాయంటే..
అనేక సందర్భాల్లో ప్రభుత్వ ఆస్తులను డ్యామేజీ చేసేవారిని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఎలాంటి శిక్షలు విధించాలి అనే అంశంపై చాలా చర్చ సాగింది. ఎన్నో ఏళ్లుగా ఇది కోర్టుల్లో నలుగుతూనే ఉంది. 1984 నాటి ప్రభుత్వ ఆస్తుల డ్యామేజీ నివారణ చట్టంలోని సెక్షన్–3 ప్రకారం… పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేసినవాళ్లకు కనీసం ఆరు నెలల నుంచి గరిష్టంగా అయిదేళ్ల జైలు శిక్షగానీ, జరిమానాగానీ, లేదా రెండింటినీ విధించాలి. ఈ నేరాల్ని ఇండియన్ పీనల్ కోడ్ కింద నమోదు చేయాలి. అయితే, సుప్రీం కోర్టు ఈ చట్టంలో చాలా లొసుగులున్నాయని 2007లో రిటైర్డ్ సుప్రీం జడ్జి కె.టి.థామస్, సీనియర్ అడ్వకేట్ జనరల్ ఫాలి నారిమన్‌లతో రెండు కమిటీల్ని వేసింది. ఈ ఎక్స్పర్ట్ కమిటీల సిఫార్సుల మేరకు 2009నాటి డిపీపీపీ వర్సెస్ ఏపీ స్టేట్ అండ్ అదర్స్ కేసులో సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్ జారీ చేసింది.
జస్టిస్ థామస్ కమిటీ… ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసింది నిరసనకారులేనని ప్రాసిక్యూషన్ ఆరోపించినప్పుడు, ఆ పని చేసింది తాము కాదని నిరూపించుకునే బాధ్యత (reversing the burden of proof )ను నిందితులపై వేయాలని సూచించింది. ఏదైనా ఒక సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు జరిగిన నిరసన ఉద్యమంలో పబ్లిక్ ప్రాపర్టీ ధ్వంసమైందని, నిందితులు ఇటువంటి చర్యల్లో స్వయంగా పాల్గొన్నారని ప్రాసిక్యూషన్ ఆరోపిస్తుంది. తన అమాయకత్వాన్ని నిరూపించుకునే బాధ్యత నిందితులదే అవుతుంది. నిరూపించుకోలేని పక్షంలో కోర్టు విధించే శిక్షను అనుభవించక తప్పదు. ఈ మేరకు చట్టాన్ని సవరించాలని సుప్రీం కోర్టు సూచించింది. ఎందుకంటే, సాధారణంగా నిందితులెవరైనాగానీ ప్రాసిక్యూషన్ నిరూపించేవరకు అమాయకులేనని న్యాయశాస్త్రం చెబుతోంది.
నారిమన్ కమిటీ… ఆస్తుల డ్యామేజీకి పాల్పడ్డవాళ్ల నుంచే పరిహారాన్ని వసూలు చేయాలని సూచించింది. డ్యామేజీకి గురైన పబ్లిక్ ప్రాపర్టీని మరలా బాగు చేయడానికి తగిన పరిహారాన్ని ఆందోళనకారుల నుంచే రాబట్టాలని పేర్కొంది.
ఈ రెండు కమిటీల సూచనలను సుప్రీం కోర్టు ఆమోదించింది. ఏదైనా నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారి ప్రైవేటు లేదా పబ్లిక్ ప్రాపర్టీ విధ్వంసమైతే అందుకు కారకులైనవాళ్ల నుంచే పరిహారం రాబట్టాలి. ఈ ప్రదర్శనకు పిలుపునిచ్చిన సంస్థ లేదా నిరసనకారులు, లేదా డ్యామేజీలో పాల్గొన్న వ్యక్తులే కచ్చితంగా బాధ్యులవుతారు. ఆర్డినరీ కోర్టులుగానీ, ప్రత్యేక కోర్టులుగానీ నష్టాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది. సుప్రీం కోర్టు తన ఆదేశాలలో ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్‌కి హైకోర్టులు సూమోటో (తమంతట తాముగా)చర్యలు తీసుకోవాలనికూడా పేర్కొంది.