భక్తులకు బిగ్ అలర్ట్.. కుంభమేళా పొడగింపుపై యూపీ సర్కార్ కీలక ప్రకటన

భక్తులకు బిగ్ అలర్ట్.. కుంభమేళా పొడగింపుపై యూపీ సర్కార్ కీలక ప్రకటన

లక్నో: ఉత్తరప్రదేశ్‎లోని ప్రయాగ్ రాజ్‎లో జరుగుతోన్న ప్రపంచంలోనే అతిపెద్ద అధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా చివరి దశకు చేరుకుంది. 2025, జనవరి 13న మొదలైన మహా కుంభ్.. 2025, ఫిబ్రవరి 26న ముగియనుంది. కుంభమేళా ముగిసే సమయం ఆసన్నమైనప్పటికీ భక్తులు తండోపతండాలుగా కుంభమేళాకు వెళ్తున్నారు. భక్తులతో ప్రయాగ్ రాజ్ కిటకిటలాడుతోంది. దీంతో యూపీ సర్కార్ కుంభమేళాను పొడగిస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మహా కుంభ్‎ను మరికొన్ని రోజులు ఎక్స్‎టెండ్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

ఈ నేపథ్యంలో ప్రభుత్వం కుంభమేళాను పొడిగిస్తుందని ప్రచారం ఊపందుకుంది. దీంతో యూపీ సర్కార్ అలర్ట్ అయ్యింది. కుంభమేళాను పొడిగించేది లేదని.. సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారం అవాస్తమని.. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 26తో కుంభమేళా వేడుక ముగుస్తోందని క్లారిటీ ఇచ్చింది యోగి ఆదిత్య నాథ్ ప్రభుత్వం. మహాకుంభమేళాను పొడిగించనున్నట్లు సోషల్ మీడియాలో వ్యాపిస్తోన్న పుకార్లపై ప్రయాగ్‌రాజ్ జిల్లా మేజిస్ట్రేట్ రవీంద్ర మందర్  మంగళవారం (ఫిబ్రవరి 18) స్పందించారు. కుంభమేళాను పొడిగిస్తున్నట్లు జరుగుతోన్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు.

 ఈ కార్యక్రమం యొక్క షెడ్యూల్ మతపరమైన ముహూర్తాల (శుభ సమయాలు) ప్రకారం నిర్ణయించబడిందని.. ఇది మారదని క్లారిటీ ఇచ్చారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 26న మహాకుంభ్ ముగుస్తుందని ఆయన తేల్చి చెప్పారు. కుంభమేళా తేదీలను పొడిగించాలని ప్రభుత్వం లేదా జిల్లా యంత్రాంగం నుండి ఎటువంటి ప్రతిపాదన లేదని.. భక్తులు ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని సూచించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ సూచనల మేరకు భక్తులందరికీ ప్రయాణం, ఇతర ఏర్పాట్లు సజావుగా జరిగేలా జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని తెలిపారు. 

మహాకుంభ్ మిగిలిన రోజులకు త్రివేణి సంగమం వద్ద స్నానాలు చేసేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రయాగ్‌రాజ్‌లో భక్తుల రాకపోకలు,  ట్రాఫిక్ నిర్వహణకు కూడా స్థానిక యంత్రాగం పటిష్ట ఏర్పాట్లు చేసిందన్నారు. సో.. యూపీ సర్కార్ ప్రకటనతో కుంభమేళా పొడగింపుపై క్లారిటీ వచ్చింది. కుంభమేళా పొడిగించేది లేదని యోగి సర్కార్ తేల్చి చెప్పడంతో కుంభమేళాకు వెళ్లాలనుకునే భక్తులకు ఫిబ్రవరి 26వ తేదీ లోపే వెళ్లాలి.