ఆస్తుల వివరాలు చెప్తారా..? జీతం ఆపేయమంటారా..? ప్రభుత్వ ఉద్యోగులకు యోగి సర్కార్ ఫైనల్ వార్నింగ్

లక్నో: ఉత్తరప్రదేశ్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న  నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పోర్టల్ అయిన మానవ్ సంపదలో ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంతా తమ స్థిర, చరాస్థుల వివరాలను ఆగస్ట్ 31లోగా పొందుపరచాలని యోగి సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వివరాలు సమర్పించని ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల జీతాలు ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. అంతేకాకుండా.. స్థిర, చరాస్థుల వివరాలను తెలియజేయని ఉద్యోగులకు మున్ముందు ప్రమోషన్స్లో కూడా చిక్కులు ఎదురవుతాయని యూపీ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్పష్టం చేసింది. వాస్తవానికి ఈ ఆదేశాలు ఇప్పటికిప్పుడు ఇచ్చినవేం కాదు. గతేడాది ఆగస్ట్లోనే ఈ ఆదేశాలు ఇచ్చి డిసెంబర్ 31, 2023ను డెడ్లైన్గా ప్రకటించారు.

ఈ డెడ్లైన్ను జూన్ 30, 2024కు, జులై 31, 2024కు ఇలా యూపీ ప్రభుత్వం ఒకటికి రెండుసార్లు పొడిగించింది. అయినప్పటికీ కేవలం 26 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే యోగి సర్కార్ ఆదేశాలను సీరియస్ గా తీసుకున్నారు. తమ స్థిరాస్తి, చరాస్తుల వివరాలు యూపీ గవర్నమెంట్ పోర్టల్ అయిన మానవ్ సంపదలో సమర్పించారు. తాజాగా డెడ్లైన్ను యోగి సర్కార్ ఆగస్ట్ 31కి పొడిగించింది. ఈసారి ఆస్తుల వివరాలు వెల్లడించకపోతే జీతాలు ఇచ్చే ప్రసక్తే లేదని యూపీ ప్రభుత్వం కరాఖండిగా చెప్పింది.

ఉత్తరప్రదేశ్ లో మొత్తం 17 లక్షల 88 వేల 429 మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీళ్లలో కేవలం 26 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఆస్తుల వివరాలను వెల్లడించారు. అంటే.. దాదాపు 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఆగస్ట్ 31, 2024 లోగా వారి ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంది. ఇన్నాళ్లు ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఆదేశాలను లైట్ తీసుకోవడంతో యోగి సర్కార్ ఈసారి ఝలక్ ఇవ్వాలని డిసైడ్ అయింది. ఆస్తుల వివరాలు వెల్లడించిన ప్రభుత్వ ఉద్యోగులకే జీతం చెల్లిస్తామని యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్ స్పష్టం చేయడం గమనార్హం. ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం కోసమే ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఆదేశాలను జారీ చేసినట్లు ఆయన తెలిపారు.