పిత్తాశయంలోని రాళ్లకు బదులు మహిళ గర్భాశయాన్నే తీసేసిండు

పిత్తాశయంలోని రాళ్లకు బదులు మహిళ గర్భాశయాన్నే తీసేసిండు

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యానికి ఓ బాధితుడు తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక ప్రైవేట్ వైద్యుడు శస్త్రచికిత్స సమయంలో రోగి శరీరంలోని ఒక అవయవానికి బదులు మరో అవయవాన్ని తొలగించాడు. నిందితుడిని నగరంలో ప్రైవేట్ నర్సింగ్ హోమ్ నడుపుతున్న ప్రవీణ్ తివారీగా గుర్తించారు. పిత్తాశయంలోని రాళ్లకు బదులు మహిళ గర్భాశయాన్ని తొలగించిన ఈ ఘటనలో వైద్యుడి పనిని తీవ్ర నిర్లక్ష్యంగా గుర్తించిన స్థానిక కోర్టు.. తగిన ఆదేశాలతో అతడిపై కేసు నమోదు చేశారు.

AsloRead:ప్రధాని మోదీ రైతుల హృదయాల్లో నిలిచిపోతారు: కొండపల్లి శ్రీధర్ రెడ్డి

డాక్టర్‌పై IPC సెక్షన్లు 336, 337, 338 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చర్య ద్వారా తీవ్రమైన గాయం కలిగించడం), 504 (శాంతి భంగం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం) కింద కేసు నమోదైంది. పోలీసులు విచారణ కోరిన తర్వాత ఈ విషయాన్ని వైద్యుల బృందంతో దర్యాప్తు చేస్తామని చీఫ్ మెడికల్ ఆఫీసర్ సందీప్ చౌదరి తెలిపారు.

అసలేమైందంటే.

వారణాసిలోని చోలాపూర్ బ్లాక్‌లోని బేలా గ్రామానికి చెందిన ఉషా మౌర్య.. పొత్తికడుపులో తీవ్రమైన నొప్పికి గురైంది. 2020లో జరిగిన ఈ సంఘటనలో ఆమె తన గ్రామానికి చెందిన ఆశా కార్యకర్తను సంప్రదించింది. ఆ తర్వాత ఆశా వర్కర్ ఆమెను గోలాలోని తివారీ నడుపుతున్న ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌కు తీసుకెళ్లగా.. అక్కడ ఉష పిత్తాశయంలో రాళ్ళు ఉన్నట్లు నిర్ధారణ అయింది. మే 28, 2020న డాక్టర్ క్లినిక్‌లో ఆమె పిత్తాశయాన్ని తొలగించేందుకు ఆపరేషన్ చేశాడు. అయితే, ఈ ఏడాది మార్చిలో, ఉష మరోసారి తన కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో.. మామూలు నొప్పిగా భావించిన ఆమె.. డైజెస్టివ్ టాబ్లెట్ వేసుకుంది. కానీ నొప్పి మాత్రం తగ్గకపోవడంతో ఆమెను కుటుంబసభ్యులు ఈసారి బనియాపూర్‌లోని మరో ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌కు తరలించారు.

అక్కడి డాక్టర్లు క్షుణ్ణంగా పరిశీలించగా, ఆమె పిత్తాశయంలో రాళ్లు అలాగే ఉన్నాయని కనుగొన్నారు. దాంతో పాటు మరో షాకింగ్ న్యూస్ ను కూడా వెల్లడించారు. ఆమె కడుపులో వారికి గర్భాశయం కనిపించలేదని తెలిపారు. ఆ తర్వాత ఆ రిపోర్టులతో ఉష .. తివారీ వద్దకు తిరిగి వెళ్లి వివరణ కోరింది, దీంతో అతను ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. అనంతరం ఆమె పోలీసు స్టేషన్‌లకు వెళ్లినా ఎలాంటి లాభం లేకపోవడంతో.. ఆమె చివరికి స్థానిక కోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత నిందితుడైన వైద్యుడిపై కేసు నమోదైంది. ఆమె ఫిర్యాదును దాఖలు చేయడంతో... త్వరలో చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఈ ఏడాది జూన్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో వైద్యులు శస్త్రచికిత్స చేస్తూ. కత్తెరను రోగి శరీరం లోపలే వదిలేశారు. దీంతో రోగి చనిపోయాడు.