రిపబ్లిక్ డే పరేడ్‌లో ఏటా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అద్భుతంగా తీర్చిదిద్దిన శకటాలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులను కూడా ప్రకటిస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌లో బెస్ట్ స్టేట్ శకటంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అవార్డు గెలుచుకుంది. పాపులర్ చాయిస్ కేటగిరీలో మహారాష్ట్ర శకటం టాప్‌లో నిలిచింది. ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు 12 రాష్ట్రాల శకటాలకు మాత్రమే అర్హత లభించింది. ‘‘వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్, కాశీ విశ్వనాథ్ ధామ్” థీమ్‌తో రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్న యూపీ శకటాన్ని స్టేట్ కేటగిరీలో ఉత్తమ శకటంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హస్త కళల థీమ్‌తో శకటం రూపొందించిన కర్ణాటక రెండో స్థానంలో నిలవగా, ‘‘రాష్ట్ర స్వర్ణోత్సవాలు, మహిళా సహకార సంఘాలు, స్వయం సహాయక గ్రూప్‌ల’’ థీమ్‌తో శకటం రూపొందించిన మేఘాలయకు మూడో స్థానం దక్కింది. మోస్ట్ పాపులర్ చాయిస్ కేటగిరీలో బయో డైవర్సిటీ థీమ్‌తో శకటం రూపొందించిన మహారాష్ట్ర టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ కేటగిరీలోనూ యూపీ రెండో స్థానాన్ని కైవసం చేసుకోగా, జమ్ము కశ్మీర్ మూడో స్థానాన్ని దక్కించుకుంది.
కేంద్ర విద్యా శాఖ, పౌర విమానయాన శాఖలు జాయింట్ విన్నర్స్
కేంద్ర మంత్రిత్వ శాఖల శకటాల్లో రెండు డిపార్ట్‌మెంట్లకు కలిపి బెస్ట్ విన్నర్‌గా ప్రకటించింది కేంద్రం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ థీమ్‌తో విద్యా శాఖ రూపొందించిన శకటానికి, ‘‘ఉడాన్ స్కీమ్‌లో భాగంగా చేపట్టిన బుద్ధిస్ట్ సర్క్యూట్, ఏవియేషన్ సెక్టార్‌లో మహిళల పాత్ర” అన్న థీమ్‌తో రూపుదిద్దుకున్న పౌర విమానయాన శాఖ శకటానికి కలిపి కేంద్రం జాయింట్‌గా బెస్ట్ విన్నర్ అవార్డును ప్రకటించింది. రిపబ్లిక్ డే పరేడ్‌లో విమానయాన శాఖ శకటాన్ని ప్రదర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
Uttar Pradesh selected as best state tableau of Republic Day parade 2022; Maharashtra wins in the popular choice category; CISF named best marching contingent among CAPF: Defence Ministry pic.twitter.com/oyrMRDebbp
— ANI (@ANI) February 4, 2022
పాపులర్ చాయిస్‌లో ఎయిర్ ఫోర్స్ మార్చ్ పాస్ట్ బెస్ట్
రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్న వివిధ సెక్యూరిటీ ఫోర్సెస్‌కు కూడా కేంద్రం వాటి మార్చ్ పాస్టింగ్‌కు అవార్డులు ప్రకటించింది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ విభాగాల్లో సీఐఎస్‌ఎఫ్ కంటింజెంట్ మార్చ్ పాస్టింగ్‌కు బెస్ట్ అవార్డు దక్కింది. త్రివిధ దళాల్లో నేవీ మార్చ్ పాస్ట్‌కు ఆ స్థానం దక్కింది. పాపులర్ చాయిస్ కేటగిరీలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విజేతగా నిలిచింది. సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో పాపులర్ కేటగిరీ కింద సీఆర్పీఎఫ్ మార్చ్ పాస్ట్‌కు బెస్ట్ అవార్డు దక్కింది.
తొలిసారి పబ్లిక్ ఓటింగ్..
కేంద్ర, రాష్ట్ర శకటాలకు, భద్రతా బలగాల మార్చ్ పాస్టింగ్‌లను స్క్రీనింగ్ చేసి అవార్డులు ప్రకటించేందుకు రక్షణ శాఖ మూడు కమిటీలను నియమించింది. ఈ కమిటీ ఎంపిక చేసిన వాటికి బెస్ట్ అవార్డులు ప్రకటించగా.. తొలిసారి ప్రజలకు ఓటింగ్ అవకాశం కల్పించినట్లు రక్షణ శాఖ తెలిపింది. ‘‘MyGov’’ యాప్, వెబ్‌సైట్‌లో సాధారణ ప్రజలు ఓట్లు వేసే అవకాశం కల్పించి, వాళ్లు ఎంపిక చేసిన విభాగాలను పాపులర్ కేటగిరీలో విన్నర్స్‌గా ప్రకటించినట్లు పేర్కొంది.