లక్నో: మొబైల్ ఫోన్ చోరీ చేసి, బీటెక్ విద్యార్థిని మృతికి కారకుడైన వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు సోమవారం ఎన్కౌంటర్ చేశారు. ఘజియాబాద్‌లోని మసూరి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెక్‌పాయింట్ వద్ద పోలీసులు వెహికల్స్ తనిఖీ చేస్తుండగా బైక్‌మీద వస్తున్న ఇద్దరిని ఆపారు. అయితే, వాళ్లు బైక్ వదిలి పరిగెత్తడంతో పాటు, పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితుల్లో ఒకరికి బులెట్ తగిలి పడిపోయాడు. మరొకతను తప్పించుకున్నాడు. బులెట్ గాయాలైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించగా ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయాడు. మృతుడిని బీటెక్ స్టూడెంట్ కీర్తి సింగ్(19) మరణానికి కారకుడైన నిందితుల్లో ఒకరైన జితేంద్రగా పోలీసులు గుర్తించారు.
అసలేం జరిగిందంటే..
జితేంద్ర మరొకరితో కలిసి ఈ నెల 27న ఘజియాబాద్‌లో ఆటోలో వెళ్తున్న బీటెక్ స్టూడెంట్ కీర్తి సింగ్ నుంచి మొబైల్ ఫోన్ చోరీ చేసేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ఆ యువతి ప్రతిఘటించడంతో నిందితులు ఆమె చేయి పట్టుకుని కిందకు లాగారు. అలాగే ఆమెను 15 మీటర్ల వరకు రోడ్డుపై గుంజుకెళ్లి, ఫోన్ లాక్కుని పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి.. ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ ఆదివారం ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన జరగడంతో విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ మసూరి ఏరియా సీఐపై సస్పెన్షన్ వేటు పడగా, ఇద్దరు సబ్ఇన్స్పెక్టర్లను పోలీస్ లైన్స్ కు అటాచ్ చేశారు. సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో జితేంద్ర చనిపోయాడు. ఇతడిపై ఇదివరకు 12 కేసులున్నాయని, పరారీలో ఉన్న మరో నిందితుడిపై 25 వేల రివార్డును ప్రకటించామని పోలీసులు తెలిపారు.