నిశ్శబ్ద ప్రమాదం..శబ్దకాలుష్యం!

నిశ్శబ్ద ప్రమాదం..శబ్దకాలుష్యం!

మానవాళికి హాని కలిగించే కాలుష్యాలలో శబ్ద కాలుష్యం రెండోది. శబ్దం అనే పదం లాటిన్ పదం  'నాసియా' నుంచి ఉద్భవించింది. దీనర్థం వాంతులు కలిగించేది అని. జీవులకు హాని కలిగించే ఎటువంటి శబ్దాన్నైనా శబ్దకాలుష్యం అంటారని,65 డెసిబెల్ ( శబ్దం తీవ్రతను కొలిచే ప్రమాణం డెసిబెల్ - డి.బి )కంటే ఎక్కువ శబ్దాలను శబ్ద కాలుష్యంగా పరిగణించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యు.హెచ్.ఒ) నిర్ధారించింది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం నివేదిక ఫ్రాంటియర్ 2022 దక్షిణాసియాలోని 13 శబ్ద కాలుష్య నగరాలను గుర్తించింది. అందులో ఐదు నగరాలు మన దేశంలోనే ఉన్నాయి. అవి మొరాదాబాదులో అత్యధికంగా 114 డిబి, కోల్​కతా 89 డిబి, ఆసన్సోల్ 89 డిబి, జైపూర్ 84డిబి, ఢిల్లీ 83 డిబి. ఉత్తర ప్రదేశ్​లోని మొరాదాబాద్ నగరం మాత్రం ప్రపంచవ్యాప్తంగా శబ్ద కాలుష్యంలో  రెండవ నగరంగా నమోదయింది.

శబ్దకాలుష్య కారకాలు

శబ్ద కాలుష్యం పల్లెలలో కంటే పట్టణాలలో ఎక్కువగా ఉంది. కార్లు, బస్సులు, లారీలు, మోటారు బైక్లు వంటివి తిరిగే ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, గృహోపకరణాలు, సంగీత వాయిద్యాలు, పారిశ్రామిక ప్రాంతాలు, జనరేటర్లు, మిల్లులు, భారీ యంత్రాలేగాక వివాహాలు, ఉత్సవాల్లో ఉపయోగించే డి.జె స్పీకర్లు, బాణసంచా, భవన నిర్మాణాలు, మైనింగ్ మొదలైనవాటివలన ఎక్కువగా శబ్దకాలుష్యం జరుగుతుంది.

శబ్ద కాలుష్య ప్రభావాలు

పిల్లల విద్యాభ్యాసం, వారి శారీరక, మానసిక ఆరోగ్యాలపైన ప్రభావం చూపుతుందని, పెద్దల్లో వినికిడి లోపాన్ని, అధిక రక్తపోటుతోపాటు గుండె, జీర్ణకోశ వ్యాధులు, కోపం, చిరాకు, ఒత్తిడి వంటి వ్యాధులు కలుగజేస్తాయని డబ్ల్యు.హెచ్.ఒ తెలిపింది. శబ్ద కాలుష్యం  వన్యప్రాణుల ఆరోగ్యం,  శ్రేయస్సుపై కూడా ప్రభావం చూపుతుంది. జంతువులు, పక్షులు వాటి ఆహార  సంపాదన  కోసం,  వాటి మనుగడ కోసం వివిధ రకాల శబ్దాలు చేస్తాయి. సముద్రాల్లో చమురు, గ్యాస్ నిక్షేపాల కోసం, సముద్ర అధ్యయనాల కోసం వాడే పరికరాలు, స్టీమర్ల నుంచి వెలువడే శబ్దాలు సముద్ర జీవుల వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.

పరిష్కారాలు 

బోధనాసంస్థలు, ఆసుపత్రులు మొదలైన బహిరంగ ప్రదేశాల్లో హారన్ మోగించడాన్ని నిషేధించాలి. వాణిజ్య, ఆసుపత్రి, పారిశ్రామిక భవనాలలో, తగినంత ధ్వని నిరోధక వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. సంగీత వాయిద్యాల ధ్వనిని కావాల్సిన పరిమితులకు నియంత్రించాలి. దట్టమైన చెట్లు శబ్ద కాలుష్య నివారణలో ఉపయోగపడుతాయి. అటవీ, పర్వత, మైనింగ్ ప్రాంతాల్లో పేలుడు పదార్థాలను ఉపయోగించడంపై నిషేధం విధించాలి. అందరూ సామాజిక బాధ్యతతో శబ్ద కాలుష్య నివారణ కోసం పాటుపడాలి.

- డి. జె. మోహన రావు, టీచర్