
చమోలి: ఉత్తరాఖండ్లో మంచు చరియలు విరిగి పడిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్వో)కు చెందిన 8 మంది కార్మికులు ఈ దుర్ఘటనలో మృతి చెందారు. రెస్క్యూ సిబ్బంది మొత్తం 47 మందిని కాపాడారు. ఉత్తరాఖండ్‌లో గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా హిమపాతం కురుస్తున్నది. మంచు గుట్టలా పేరుకుపోయింది.
ఈ క్రమంలో టిబెట్బార్డర్కు సమీపంలో చమోలి–బద్రీనాథ్ రహదారిపై ఏర్పాటు చేసిన బీఆర్వో శిబిరంపై పెద్దఎత్తున మంచు చరియలు విరిగిపడ్డాయి. దాంతో అక్కడ పనిచేస్తున్న 55 మంది బీఆర్వో కార్మికులు మంచులో చిక్కుకుపోయారు. శుక్రవారం ఉదయం(ఫిబ్రవరి 28, 2025) 7.15 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు.
మంచు చరియలు విరిగిపడ్డ ప్రదేశం సముద్ర మట్టానికి 3,200 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ మంచుతో కూడిన వర్షం దట్టంగా కురుస్తుండటంతో సహాయక చర్యలకు అడుగడుగునా ఆటంకం కలిగింది. అయినా.. ఐబెక్స్బ్రిగేడ్కు చెందిన 100 మందికి పైగా సిబ్బంది సహాయ చర్యలను కొనసాగించారు.
మంచు చరియల కింద చిక్కుకున్న 47 మందిని మొత్తంగా రక్షించారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో హెలికాప్టర్లో జోషిమఠ్కు తరలించి, చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యలను సీఎం పుష్కర్ సింగ్ ధామి నిరంతరం పర్యవేక్షించినట్లు అధికారులు తెలిపారు. హిమపాతానికి సంబంధించిన సమాచారం లేదా సహాయం కోసం ఆ రాష్ట్ర సర్కారు హెల్ప్‌లైన్ నంబర్లను జారీ చేసిన సంగతి తెలిసిందే.