ఉత్తరాఖండ్​లో అమల్లోకి యూసీసీ.. దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డు

ఉత్తరాఖండ్​లో అమల్లోకి యూసీసీ.. దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డు


డెహ్రాడూన్: బీజేపీ పాలిత ఉత్తరాఖండ్​లో యూనిఫాం సివిల్​కోడ్ (యూసీసీ) సోమవారం నుంచి​అమల్లోకి వచ్చింది. యూసీసీకి సంబంధించిన నోటిఫికేషన్, విధివిధానాలను తన అధికారిక నివాసం అయిన ముఖ్య సేవక్​సదన్​లో సీఎం పుష్కర్​సింగ్​ ధామి ఆవిష్కరించారు. వివాహాలు, విడాకులు, లివిన్​రిలేషన్స్ తప్పనిసరి రిజిస్ట్రేషన్​ కోసం రూపొందించిన పోర్టల్​ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పుష్కర్​సింగ్​ ధామి మాట్లాడుతూ.. యూసీసీ ద్వారా అన్ని మతాల్లోని పౌరులందరికీ సమానమైన హక్కులు, బాధ్యతలు దక్కేలా చూస్తామని తెలిపారు. మతంతో సంబంధం లేకుండా మహిళలపై అన్ని రకాల వివక్షలను అంతం చేసేందుకు ఇది ఒక సాధనమని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌‌కే కాకుండా యావత్‌‌ దేశానికి ఇది చరిత్రాత్మకమైన రోజని, దేశంలో యూసీసీని అమలుచేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌‌ నిలిచిందని పేర్కొన్నారు. 

యూసీసీ ఏ మతానికి వ్యతిరేకం కాదు..

యూసీసీ అనేది ఏ మతానికి, వర్గానికి వ్యతిరేకం కాదని సీఎం ధామి పేర్కొన్నారు. దీని అమలుతో నిజమైన మహిళా సాధికారత సాధ్యపడుతుందని చెప్పారు. వారి హక్కులను కాలరాసే బాల్య వివాహాలు, ట్రిపుల్ తలాక్, విడాకులు, ఆస్తుల వారసత్వం, బహుభార్యత్వం వంటి దురాచారాలను పూర్తిగా రూపుమాపడానికి యూసీసీ తోడ్పడుతుందని వెల్లడించారు.  రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 కింద పేర్కొన్న పలు షెడ్యూల్డ్ తెగలను దీనినుంచి దూరంగా ఉంచామని తెలిపారు. 2022 ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో యూసీసీ అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. మళ్లీ అధికారంలోకి వచ్చాక నిరుడు ఫిబ్రవరి 6న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో బీజేపీ సర్కారు యూసీసీ బిల్లును ప్రవేశపెట్టింది.  ఫిబ్రవరి 7న అసెంబ్లీ మెజారిటీతో ఆమోదించింది. మార్చి 13న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దానిపై సంతకం చేశారు. దీంతో దేశంలో యూసీసీ అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది.  

యూసీసీ అమలుతో వచ్చే కీలక మార్పులివే..

  • లింగ భేదం లేకుండా కొడుకులు, కూతుళ్లకు ఆస్తిలో సమాన వాటా 
  • అన్ని వర్గాలకు ఒకే విడాకుల చట్టం
  • బహుభార్యత్వం నిషేధం. మొదటి జీవిత భాగస్వామి జీవించి ఉంటే రెండో వివాహం అనుమతించబడదు. 21 ఏండ్ల వయసున్న పురుషులు,  18 ఏండ్లున్న మహిళలు వివాహం ద్వారా ఒక్కటి కావొచ్చు.  మతపరమైన ఆచారాల ప్రకారం వివాహాలు జరుపుకోవచ్చు, వివాహ నమోదు తప్పనిసరి.
  • సహజీవన సంబంధాలకు రిజిస్ట్రేషన్​ కంపల్సరీ. 18 నుంచి 21 ఏండ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న భాగస్వాములకు తల్లిదండ్రుల సమ్మతి అవసరం. 
  • అన్ని మతాల్లో పిల్లలను దత్తత తీసుకొనే హక్కు ఉంటుంది. అయితే, ఒక మతం నుంచి మరో మతం పిల్లలను దత్తత తీసుకోవడం నిషేధం.
  • హలాల్, ఇద్దత్ వంటి కొన్ని ఆచారాలపై నిషేధం 
  • సైనికులు, ఎయిర్​ఫోర్స్​లో పనిచేస్తున్నవారు, యుద్ధంలో నిమగ్నమై ఉన్నవారు, నేవీలో ఉన్నవారి కోసం ప్రివిలేజ్డ్‌‌ విల్‌‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. వారు అత్యవసర పరిస్థితుల్లో ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని వీలునామాను వేగంగా, సులభంగా తయారు చేయించవచ్చు.