వరంగల్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 400 ఎంపీ సీట్లలో గెలుపొందడం ఖాయమని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‍సింగ్ దామి అన్నారు. గురువారం ఆయన ఎంపీ లక్ష్మణ్ తో కలిసి వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ తరఫున గ్రేటర్ వరంగల్ లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దామి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. కాశ్మీర్ వంటి సున్నితమైన సమస్య పరిష్కారంతోపాటు అయోధ్యలో రామమందిర నిర్మాణం మోదీ వల్లే సాధ్యమైందని చెప్పారు.
మరోసారి నరేంద్ర మోదీని గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రంతో పాటు వరంగల్ జిల్లాకు పరిశ్రమలు, నేషనల్ హైవేలు, యూనివర్సిటీలు, రైల్వే ప్రాజెక్టులు వస్తాయన్నారు. అరూరి రమేశ్ మాట్లాడుతూ.. తాను భూములు గుంజుకన్నట్లు సీఎం రేవంత్‍రెడ్డి నిరూపించాలని లేదంటే తన సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భూకబ్జాను ఆధారాలతో నిరూపిస్తే ఆస్తులు మొత్తం ప్రజలకు రాసిస్తానని సవాల్ విసిరారు. కడియం శ్రీహరి టీడీపీ, బీఆర్‍ఎస్ పార్టీలకు వెన్నుపోటు పొడిచాడని.. కాంగ్రెస్ పార్టీకి అదే గతి పడుతుందని అరూరి రమేశ్ పేర్కొన్నారు.