ఊళ్ల చుట్టూ ఎండిన దేవదారు చెట్లు. ఎండాకాలంలో వాటినుంచి రాలిపడి పోయే పుల్లలు. ఆ పుల్లల వల్ల ఎప్పుడు అగ్ని ప్రమాదం జరుగుతుందోనని భయంతో బతికేవాళ్లు వాళ్లంతా. కానీ... ఇప్పుడు ఆ బాధ కొంత తగ్గింది. ఎందుకంటే పనికిరాని ఎండు పుల్లలతో అందమైన హ్యాండీక్రాఫ్ట్స్ తయారవుతున్నాయి. అదీకాక అక్కడి వాళ్లకీ అవి ఉపయోగపడుతున్నాయి కూడా. ఓ ఇద్దరు అక్కా చెల్లెళ్లు చేసిన ఆలోచన వల్ల ఫారెస్ట్ ఫైర్స్ తగ్గడంతోపాటు ఆడవాళ్లకు ఉపాధి కూడా దొరికింది.
ఈ ఏడాది ఏప్రిల్ నెల వరకు ఉత్తరాఖండ్‌లో అడవులు చాలాసార్లు కాలిపోయాయి. దాదాపు వెయ్యి హెక్టార్ల విస్తీర్ణంలో మంటలు వ్యాపించాయి. వాటివల్ల ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఎక్కువ జనాభా ఉండే అటవీ ప్రాంతాల్లో అక్కడి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ కొన్ని ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టింది. ఫైర్‌ని కంట్రోల్ చేయడానికి సహాయక బృందాలను కూడా ఏర్పాటు చేసింది. అయితే మంటల్ని అదుపు చేసేందుకు మాత్రమే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
అలాకాకుండా అసలు మంటలు రాకుండా చేయొచ్చు కదా! ఆ పనే చేస్తున్నారు చంపావత్ ప్రాంతంలోని సుమారు వంద మంది గ్రామీణ మహిళలు. ఈ మహిళల సైన్యం అగ్నికి మూలకారణమైన దేవదారు చెట్ల వ్యర్థాలను అడవుల నుంచి సేకరిస్తున్నారు. దేవదారు చెట్ల ఆకులు రాలినప్పుడు వాటితోపాటే చిన్న చిన్న పుల్లలు కింద పడుతుంటాయి. ఎండిపోయిన ఆ పుల్లలు ఎండు గడ్డికి మల్లే నిప్పుని చాలా వేగంగా వ్యాపింపచేస్తాయి. ఉత్తరాఖండ్ అడవుల్లో ఫారెస్ట్ ఫైర్స్‌కి ఎక్కువగా ఈ పుల్లలే కారణం అవుతున్నాయి.
ఉత్తరాఖండ్ భూభాగంలో 71 శాతానికి పైగా అటవీప్రాంతం ఉంది. అక్కడ దేవదారు చెట్లు విపరీతంగా పెరుగుతాయి. అక్కడివాళ్లు వాటిని ‘చిర్ కా పేడ్’ అని పిలుస్తారు. మొత్తం అటవీ విస్తీర్ణంలో దాదాపు16 శాతం అవే ఉన్నాయి. ప్రతి ఏడాది3.4 లక్షల హెక్టార్లలో 2.06 మిలియన్ టన్నుల దేవదారు వ్యర్థాలు పేరుకుపోతున్నాయని పంత్‌నగర్ యూనివర్సిటీ ఎక్స్‌పర్ట్స్ చెప్పారు. ఆ పుల్లలు మండేందుకు వెలిగించిన సిగరెట్, పంటపొలాల్లో వ్యర్థాలు కాల్చినప్పుడు ఎగిసిపడే నిప్పు రవ్వలు చాలు. ఒక్కచోట నిప్పు అంటుకుందంటే చాలు దావానంలా ఆ ప్రాంతాన్నే కాల్చేస్తుంది. ఈ పుల్లలకు ఒక్కసారి నిప్పు అంటుకుందంటే ఆ మంటలను ఆపడం చాలా కష్టం.
సమస్యకు మూలం తెలుసుకుని..
ఈ పుల్లల వల్ల తీవ్రమైన సమస్య ఎదురవుతోందని గ్రహించారు నూపుర్, ఆమె చెల్లెలు శార్వరి. ఈ సమస్యకు పరిష్కార మార్గం ఏదైనా కనిపెట్టాలని ఆలోచించడం మొదలుపెట్టారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ‘పిరుల్ హ్యాండీక్రాఫ్ట్స్’ అనే స్టార్టప్. నూపుర్, శార్వరిలది మహారాష్ట్రలోని నాగ్‌పూర్. సామాజిక బాధ్యత కాస్త ఎక్కువ ఉన్న కుటుంబం వాళ్లది.
అలాంటి వాతావరణంలో పెరగడం వల్ల వీళ్లకు కూడా పర్యావరణం, సమాజం మీద ప్రేమ ఎక్కువ. నూపుర్ వెటర్నరీ డాక్టర్, శార్వరి టెక్స్‌టైల్ డిజైనర్. నూపుర్‌కి సొసైటీ కోసం ఏదైనా చేయాలనే ఆలోచన బలంగా ఉండేది. తన ఆలోచనలకు తోడు ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ చేపట్టిన ‘యూత్ ఫర్ ఇండియా ప్రోగ్రాం ఫెలోషిప్’కి ఎంపికైంది. ఆ ప్రోగ్రాంని ఎస్బీఐ గ్రామీణ, అట్టడుగు వర్గాల ప్రజల సమస్యలకు పరిష్కార మార్గాలు కనుక్కోవాలనే లక్ష్యంతో మొదలుపెట్టింది.
ఆ ప్రోగ్రాంలో భాగంగానే 2021లో నూపుర్‌ని ఉత్తరాఖండ్‌లోని ‘ఖేతిఖాన్’ అనే ప్రాంతానికి పంపారు. అప్పుడు అక్కడి వాళ్లను కలిసి వాళ్ల సమస్యల గురించి తెలుసుకుంది. అందులో భాగంగానే ఆమెకు దేవదారు చెట్ల పుల్లల వల్ల అడవుల్లో జరిగే అగ్ని ప్రమాదాల గురించి తెలిసింది. ఆ ఊరి చుట్టూ దేవదారు చెట్లతో ఉన్న అడవి ఉంది. ఆ చెట్ల నుంచి రాలి పడే పుల్లలు ప్రతి ఏడాది ఒక లేయర్‌లా పేరుకుపోతాయి.
ఎండిపోయిన ఆ పుల్లల మద చిన్న నిప్పురవ్వ పడినా మంటలు చెలరేగుతాయి. అలా చాలాసార్లు జరిగింది. ప్రత్యేకించి ఆ సమస్యను పరిష్కరించడానికి ఏం చేయొచ్చనే దానిమీద రీసెర్చ్ చేసింది నూపుర్. చివరకి ఆమెకు దేవదారు వ్యర్థాలను అక్కడినుంచి తొలగించడం ఒక్కటే మార్గంగా కనిపించింది. కానీ.. అలా చేయాలంటే ఖర్చుతో కూడిన వ్యవహారం. ప్రతి ఏడాది అంత ఖర్చు చేయడం ఎవరికైనా చాలా కష్టం. ఏం చేయాలా అని ఆలోచిస్తున్న నూపుర్‌కి ‘‘వాటిని తొలగించేందుకు అయ్యే ఖర్చు నుంచి లాభాలు తీయొచ్చు” అని సలహా ఇచ్చింది చెల్లెలు శార్వరి. పాట్నాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చదువుకుంటున్న శార్వరి దేవదారు పుల్లలతో చాలా రకాల క్రాఫ్ట్స్ తయారు చేయొచ్చని చెప్పింది.
ఆడవాళ్లకు ఆర్థిక అండ
దేవదారు పుల్లలతో హ్యాండీక్రాఫ్ట్స్ తయారుచేయిస్తే.. అక్కడి గ్రామీణ మహిళలకు కూడా ఉపాధి దొరుకుతుంది అనుకుంది. వెంటనే అక్కడ కొంతమంది ఆడవాళ్లతో మాట్లాడి పుల్లలు ఏరుకొచ్చి, క్రాఫ్ట్స్ తయారుచేసేందుకు ఒప్పించింది. అక్కడివాళ్లలో కొందరు దీనివల్ల ఒక స్థిరమైన జీవనోపాధి దొరుకుతుందని నమ్మి ముందుకొచ్చారు. ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల చాలామంది మగవాళ్లు సిటీలకు వెళ్లి పనులు చేసేవాళ్లు.
2021లో దేశమంతా కొవిడ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ రోజుల్లో కొందరు మగవాళ్లు కూడా పనిలేక ఇళ్లకు తిరిగి వచ్చేశారు. ఆడవాళ్లు పొలం పనులు చేస్తూ కష్టపడేవాళ్లు. ఇంకొందరు పశువులను మేపేవాళ్లు. ఫెలోషిప్ కోసం అక్కడ ఉన్న రోజుల్లో కొందరు ఆడవాళ్లు పశువులను మేపేందుకు అడవిలోకి వెళ్లి అక్కడ చెలరేగిన మంటల్లో చిక్కుకుని చనిపోవడం చూసింది నూపుర్. ఇలాంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం దేవదారు పుల్లలను ఏరి వాటితో హ్యాండీక్రాఫ్ట్స్ తయారుచేయడమే అనిపించింది ఆమెకు.
ఆలోచన వచ్చాక దాన్ని ఆచరణలోకి తెచ్చే సమయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంది నూపుర్. వ్యర్థాలతో క్రాఫ్ట్స్ తయారుచేస్తాం అంటే చాలామంది మొదట్లో నమ్మలేదు ఆమెను. వాళ్లకు అర్థమయ్యేలా చెప్పి ఒప్పించింది. పనిమొదలుపెట్టిన వెంటనే మొదటి ఆర్డర్‌ని కూడా తెచ్చుకోగలిగింది. ఆ తర్వాత శార్వరి కూడా నూపూర్ ప్రాజెక్ట్‌లో చేరి... ఒక బిజినెస్ వెంచర్‌గా మార్చడంలో సాయపడింది. ప్రారంభంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా తట్టుకుని నిలబడి ఎంట్రపెనూర్లుగా సక్సెస్ అయ్యారు ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్లు.
సీజనల్ ప్రొడక్షన్
పుల్లలు సేకరించి క్రాఫ్ట్స్ తయారు చేయడం మొదలుపెట్టిన తర్వాత వీళ్లకు మరో సవాల్ ఎదురైంది. అదేంటంటే... పంటలు నాటే సీజన్‌లో, కోతల టైంలో అక్కడి ఆడవాళ్లు ఈ పనికి వచ్చేవాళ్లు కాదు. దాంతో ఆర్డర్ తీసుకున్న తర్వాత ప్రొడక్షన్ ఆలస్యమయ్యేది. దాంతో ఆ సమస్యను అధిగమించేందుకు సీజన్ల వారీగా ప్రొడక్షన్, ఆర్డర్లను షెడ్యూల్ చేసుకున్నారు. మొదట్లో వాళ్లతో క్రాఫ్ట్స్ తయారు చేయించడం అంత ఈజీ కాదేమో అనుకుంది నూపుర్. కానీ.. అక్కడి ఆడవాళ్లు చేయలేని పనంటూ ఏదీలేదు. కొండలు ఎక్కడం నుంచి వ్యవసాయం చేయడం.. పుల్లలతో బుట్టలు నేయడం వరకు అన్ని పనులు అవలీలగా చేస్తారు. దాంతో నూపుర్ పని ఈజీ అయ్యింది. కొన్ని సోషల్ మీడియా యాప్స్‌లో ట్రెండ్స్ ఫాలో అవుతూ.. అందుకు తగ్గట్టు క్రాఫ్ట్స్ తయారుచేయిస్తున్నారు.
ఇరవై వేల కిలోలు
క్రాఫ్ట్స్ అమ్మడానికి నూపుర్, శార్వరి కలిసి ‘పిరుల్ హ్యాండీ క్రాఫ్ట్స్’ అనే స్టార్టప్ మొదలుపెట్టారు. అందులో మొదట పదిహేను మంది మాత్రమే పనిచేసేవాళ్లు. ఇప్పుడు ‘ఖేతిఖాన్, త్యార్సున్, పటాన్, చాన్మారి, పాండా, పాటీ, జులాఘాట్’ ఈ ఏడు గ్రామాలకు చెందిన వంద మంది మహిళలు పనిచేస్తున్నారు. ఇప్పటివరకు 20 వేల కిలోల దేవదారు పుల్లలతో క్రాఫ్ట్స్ తయారుచేశారు. దానివల్ల ఇక్కడి మహిళలకు ఉపాధి దొరకడంతోపాటు అడవుల్లో మంటలు కూడా తగ్గిపోయాయి.
ప్రాసెస్ ఎలా?
గ్రామస్తులు సేకరించిన దేవదారు పుల్లలను బాగా శుభ్రం చేస్తారు. తర్వాత వాటిని నీటిలో నానబెడతారు. ఆ తర్వాత కాయిలింగ్ టెక్నిక్ వాడి టీ కోస్టర్ల లాంటి ప్రొడక్ట్స్ తయారుచేస్తారు. వాటితోపాటు చెవిపోగులు, స్టోరేజ్ కంటైనర్లు, హ్యాండ్‌బ్యాగ్స్, సర్వింగ్ ట్రేలు, టేబుల్ మ్యాట్‌లు, ప్లాంటర్లు కూడా తయారుచేస్తున్నారు. ఈ స్టార్టప్‌లో పనిచేస్తున్న సునీతా మోని మాట్లాడుతూ “ఇంతకుముందు నేను పశువులను మేపుతూ, గోధుమలు, వరి సాగు చేస్తూ బతికేదాన్ని.
అడవులు కాలిపోయిన ప్రతిసారి ఆవులకు మేత దొరికేది కాదు. ఒక్కోసారి ఇండ్లు కూడా కాలిపోయేవి. ప్రతిసారి భారీ మొత్తంలో నష్టపోయేవాళ్లం. ఈ పుల్లలను అందమైన వస్తువులుగా మార్చొచ్చని నాకు తెలియదు. ఇప్పుడు రోజుకో కొత్త డిజైన్ తయారు చేస్తున్నాం. గతంలో నెలకు1500 రూపాయలు మాత్రమే సంపాదించే నేను ఇప్పుడు అయిదు వేల రూపాయలకంటే ఎక్కువే సంపాదిస్తున్నా. ఆ ఆదాయంతోనే నా పిల్లలిద్దరినీ ప్రైవేటు స్కూల్స్‌లో చేర్పించా. నా పిల్లల భవిష్యత్తు కోసం ఒక తులం (దాదాపు12 గ్రాముల) బంగారాన్ని కొన్నా” అని సంతోషంగా చెప్పింది.
ఫారెస్ట్ ఫైర్స్ ఆగాయి
ఈ సంస్థ ఇప్పటివరకు దాదాపు12 వేల ప్రొడక్ట్స్ అమ్మింది. ఇండియాలోని చాలా ప్రాంతాలకు ఈ ఉత్పత్తులు చేరుతున్నాయి. ముఖ్యంగా బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ సిటీలతోపాటు అమెరికాలో కస్టమర్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు. ‘‘వెదురు లాంటి ఇతర ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్‌తో పోలిస్తే.. దేవదారు ప్రొడక్ట్స్‌మంచి ఫినిషింగ్‌తో పాటు మన్నికగా ఉంటాయి. వెదురు ప్రొడక్ట్స్‌కి ఫంగస్ పట్టే అవకాశాలు ఎక్కువ.
కానీ.. దేవదారుకి ఆ విషయంలో ఇబ్బంది లేదు. ఎందుకంటే వాటికి నేచురల్‌గా ఫంగస్ రెసిస్టెంట్ ఉంటుంది. పైగా మా ప్రొడక్ట్స్ వల్ల చాలామందికి ఎంతో మేలు కలుగుతుంది. మేము దేవదారు పుల్లలు సేకరించడం మొదలుపెట్టాక ఆ ప్రాంతాల్లో ఇప్పటివరకు ఫారెస్ట్ ఫైర్స్ జరగలేదు. ఇదివరకైతే.. ప్రతి ఏడాది కనీసం మూడు ప్రమాదాలు జరిగేవి” అని చెప్పింది నూపుర్.