![ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు.. కొండచరియలు పడి నలుగురు మృతి](https://static.v6velugu.com/uploads/2023/08/Uttarakhand-Heavy-Rains-Flash-Floods_l2W6hRPYdV.jpg)
- మరో16 మంది గల్లంతు
- కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
రుద్రప్రయాగ్: ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కేదార్‌నాథ్‌కు వెళ్లే మార్గంలోని గౌరీకుండ్‌లో కొండచరియలు విరిగిపడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇంకో 16 మంది గల్లంత య్యారు. గురువారం రాత్రి నుంచి పడుతున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయని డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు శుక్రవారం తెలిపారు. దానికితోడు ఆకస్మిక వరదలు ఆ ప్రాంతాన్ని ముంచెత్తాయన్నారు. మందాకిని నది ఒడ్డున ఉన్న దుకాణాలు వరదలో కొట్టుకుపోయాయని, దీంతో మొత్తం 16 మంది గల్లంతయ్యారని తెలిపారు. ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికి తీశామని, తప్పిపోయినవారి కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు, కొండల మీదినుంచి పడుతున్న బండరాళ్లు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయన్నారు.
వరదలపై సీఎం సమీక్ష
సీఎం పుష్కర్ సింగ్ ధామి వరద పరిస్థితులపై సెక్రటేరియెట్‌లో సమీక్షించారు. నదులు, వాగుల నీటిమట్టం పెరిగిందని, వాటి చుట్టుపక్కల ఉంటున్నవాళ్లు అలర్ట్ గా ఉండాలని కోరారు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు పడొచ్చని అక్కడి వాతావారణ శాఖ హెచ్చరించింది. పౌరీ, తెహ్రీ, రుద్రప్రయాగ్, డెహ్రాడూన్‌లలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.