డేటింగ్‌లో అబ్బాయిలనే నేరస్తులుగా ఎందుకు చూస్తున్నారు : హైకోర్టు

డేటింగ్‌లో అబ్బాయిలనే నేరస్తులుగా ఎందుకు చూస్తున్నారు : హైకోర్టు

టీనేజ్ డేటింగ్‌కు సంబంధించిన కేసుల్లో మైనర్ అబ్బాయిలను మాత్రమే అరెస్టు చేయడం ఎంతవరకు న్యాయమని ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రశ్నించింది. నిజానికి ఇలాంటి కేసుల్లో కౌన్సెలింగ్‌ చేయాలని కోర్టు సూచించింది. మైనర్ బాలబాలికలు డేటింగ్‌కు వెళ్లడం, బాలిక తల్లిదండ్రులు దానిపై ఫిర్యాదు చేయడం వంటి కేసుల్లో అరెస్టులను పరిశీలించి నివారించాలని హైకోర్టు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. 

న్యాయవాది మనీషా భండారీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్)పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతూ బహారీ, జస్టిస్ రాకేష్ తప్లియాల్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. అబ్బాయిలను అరెస్టు చేయకుండా ఉండేందుకు సిఆర్‌పిసి సెక్షన్ 161 కింద స్టేట్‌మెంట్ నమోదు చేస్తే సరిపోతుందా అని బెంచ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 

మైనర్ పిల్లల డేటింగ్ కేసుల్లో లింగ వివక్షతను చూపుతున్నారని పిటిషనర్ కోర్టులో వాదించారు. ఇష్టంతోనే ఇరువురు కలిసినా, తప్పు అమ్మాయిదే అయినా అబ్బాయిలను నేరస్థులుగా చూస్తున్నారని పేర్కొన్నారు. సెక్షన్ 3,4,5,6 మరియు 7 ప్రకారం మైనర్ అమ్మాయి, అబ్బాయి డేటింగ్ చేసినా నేరం కాదు. అమ్మాయి పేరెంట్స్ ఫిర్యాదుతో మైనర్ అబ్బాయిని అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని పిటిషన్‌లో ప్రశ్నించారు. 

POCSO చట్టం ఇలాంటి కేసుల్లో మైనర్ బాలుడిని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలనే చెప్తోందని అన్నారు న్యాయవాది. దీంతో మైనర్ పిల్లల డేటింగ్ కేసులో బాలుడిని అరెస్టు చేయకూడదని కోర్టు చెప్పింది. రాష్ట్రం ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలించి, పోలీసు శాఖకు సాధారణ ఆదేశాలు జారీ చేయవచ్చని పేర్కొంది.