ఆపదలో ఆధ్యాత్మిక కేంద్రం

దేవభూమిగా పిలుచుకునే ఉత్తరాఖండ్​లోని జోషిమఠ్ రోజురోజుకూ కుంగిపోతున్నది. చార్ధామ్ యాత్రల్లో ఒకటైన బద్రినాథ్ క్షేత్రానికి గేట్​వేగా జోషిమఠ్​ను పిలుస్తుంటారు. ఆధ్యాత్మిక కేంద్రంగా ఎంతో ప్రసిద్ధి చెందిన జోషిమఠ్ ఇప్పుడు ప్రమాదంలో ఉంది. ఇక్కడ దాదాపు 600 ఇండ్లు బీటలు వారాయి. కొన్ని చోట్ల భూమిలోంచి నీరు బయటికి వస్తున్నది. ఓ ఆలయం కూలిపోయింది. సుమారు 30 వేల మంది ప్రమాదపు అంచున ఉన్నారు.  

ఎందుకీ పరిస్థితి

జోషిమఠ్.. కొండల్లో ఏటవాలుగా ఉన్నట్టు ఒకవైపు ఒరిగి ఉంటుంది. దీనికితోడు అప్పుడప్పుడు అక్కడి భూమి కంపిస్తూ ఉంటుంది. పునాదులు కూడా బలంగా లేవు. రైని ప్రాంతంలోని అలకనంద నదికి వరదలు వచ్చినప్పుడల్లా జోషిమఠ్ మట్టి కొట్టుకుపోతున్నది. సమీపంలో భారీ నిర్మాణాలు చేపట్టడంతోనే తమకు ఇలాంటి పరిస్థితి వచ్చిందనేది అక్కడి ప్రజలు మాట. ఎన్టీపీసీకి చెందిన తపోవన్ ​వి-ష్ణుగఢ్ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం అతిపెద్ద ముప్పుగా మారిందని అంటున్నారు. ఈ ప్రాజెక్టు వద్ద నిరుడు ఆకస్మిక వరదలతో 200 మంది వరకు చనిపోయారు. నిర్మాణంలో ఉన్న 12 కి.మీ పొడవైన సొరంగం సెలాగ్ నుంచి ప్రారంభమై, తపోవన్ వరకు వెళ్తుంది. టన్నెల్ తవ్వేందుకు లోపల బ్లాస్టింగ్స్ చేస్తున్నారని జోషిమఠ్ వాసుల ఆరోపణ. కానీ తాము బోరింగ్ మెషిన్ ద్వారా టన్నెల్​ వేస్తున్నామని, బ్లాస్టింగ్స్ కూడా చేయడం లేదని ఎన్టీపీసీ చెబుతున్నది. ఇదీగాక ఏడాది పొడవునా చార్ధామ్ యాత్ర చేయడానికి హెలోంగ్ నుంచి మార్వారి దాకా 20 కి.మీ మేర చేపట్టిన రహదారి వెడల్పు చేసే పనుల కారణంగా తమ ఇండ్లకు బీటలు వారుతున్నాయని అక్కడి ప్రజలు అంటున్నారు. 

1976లోనే వార్నింగ్

ఉత్తరాఖండ్ లో తరచూ వరదలు రావడానికి గల కారణాలు తెలుసుకునేందుకు 1976లో అప్పటి ప్రభుత్వం మిశ్రా కమిటీని ఏర్పాటు చేసింది. జోషిమఠ్​కు భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందని కమిటీలోని సభ్యులు 50 ఏండ్ల కిందటే హెచ్చరించారు. జారి వచ్చిన ఒక కొండపై జోషిమఠ్ ఉందని, ఏటవాలుగా ఉండటంతో భూమి కింద ఉన్న మట్టి పొరల్లో బలం లేదని వివరించారు. బ్లాస్టింగ్స్, పెద్ద పెద్ద నిర్మాణాలకు ఈ నేల అస్సలు సహకరించదని రిపోర్టులో ప్రస్తావించారు. 2022లో కూడా వాడియా ఇన్​స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీకి చెందిన సైంటిస్టులు పరిశోధనలు చేశారు. భూమిలో పెద్ద పెద్ద బండరాళ్లు ఉన్నట్టు గుర్తించారు. రాళ్ల మధ్య ఒత్తిడి కారణంగా భూగర్భ పొరల్లో మార్పులు జరిగి ప్రమాదం సంభవించే చాన్స్​ఉందని హెచ్చరించింది. 2013లో ఉత్తరాఖండ్​ వరదలతో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని, మురుగు నీరంతా భూమిలోకి ఇంకిపోతున్నది. 

స్టడీలో ఏం తేలనుందో..

జోషిమఠ్​ను ప్రభావితం చేస్తున్నట్టు భావిస్తున్న నిర్మాణాలన్నీ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. కుంగిపోయే, కొండచరియలు విరిగిపడే ప్రాంతంలో మొత్తం 4,500 ఇండ్లు ఉన్నాయి. వాటిని ఖాళీ చేయించి నిర్వాసితులను అధికారులు క్యాంపులకు తరలిస్తున్నారు. పగుళ్లు ఏర్పడిన ఇండ్లు వదిలి, వేరే ఇండ్లల్లో ఉండాలని సీఎం పుష్కర్​ధామి ఇటీవలి పర్యటనలో వారికి సూచించారు. 6 నెలల పాటు నెలకు రూ.4వేల చొప్పున కిరాయి చెల్లిస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. పీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహించింది. ప్రధాని మోడీ కూడా ఉత్తరాఖండ్ సీఎం ధామీతో ఫోన్​లో మాట్లాడి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సోమవారం కేంద్ర బృందం బీటలు వారిన ప్రాంతాన్ని సందర్శించింది. జోషిమఠ్​లో పరిస్థితిపై స్టడీ చేయాల్సిందిగా హైదరాబాద్​లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్ఆర్ ఎస్సీ), డెహ్రాడూన్​లోని ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్(ఐఐఆర్ ఎస్)ను ఉత్తరాఖండ్ ప్రభుత్వం కోరింది. 

నైనిటాల్​కూ పొంచి ఉన్న ముప్పు

భవిష్యత్తులో నైనిటాల్, ఉత్తరకాశీ, చంపావట్ వంటి ప్రాంతాలకూ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారీ నిర్మాణాలే జోషిమఠ్ కుంగిపోవడానికి కారణమని, బలహీనమైన పునాదుల వల్ల మట్టి జారిపోతున్నదని సైంటిస్టులు అంటున్నారు. జోషిమఠ్​లాగే నైనిటాల్​లోనూ టూరిజం బాగా పెరిగిందని, భారీ నిర్మాణాలు జరిగాయని చెబుతున్నారు. కొండచరియలు విరిగిపడగా ఏర్పడిన శిథిలాల మీదే చాలా వరకు నైనిటాల్ విస్తరించి ఉందని, ఉత్తరకాశీ, చంపావట్​లో జనాభాతో పాటు నిర్మాణాలు పెరగడంతో ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- సూత్రావే సంజీవ్​,
సీనియర్​ జర్నలిస్ట్​