Char Dham Yatra: చార్ధామ్ యాత్ర తాత్కాలికంగా  నిలిపివేత 

Char Dham Yatra: చార్ధామ్ యాత్ర తాత్కాలికంగా  నిలిపివేత 

ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చార్ ధామ్ యాత్ర కొనసాగే గర్వాల్ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే ఐఎండీ ప్రకటించింది. దీంతో ఆదివారం (జూలై 7,2024)  చార్ ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. జూలై 7,8 తేదీ భారీ వర్షాలుకురిసే అవకాశం ఉందని ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. యాత్రికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని చార్ ధామ్ యాత్రను వాయిదా వేస్తున్నట్లు గర్వాల్ అధికారులు తెలిపారు. ఈ రెండు రోజులు భక్తులు రుషికేష్ దాటి చార్ ధామ్ యాత్రకు వెళ్లొద్దని సూచించారు. యాత్రకు వాతావరణ అనుకూలించే వరకు భక్తులు వేచి ఉండాలని కోరారు.  

గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు నదులు ఉప్పొంగుతున్నాయి. వరదలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అనేక గ్రామాలు నీట మునిగాయి. రోడ్లు తెగిపోయి రవాణా నిలిచిపోయింది. వరదల్లో ఇండ్లు కొట్టుకుపోయాయి. పంటలు నీటమునిగాయి. కొండచరియలు విరిగి పడి పలువురు మృతిచెందారు. ఈ క్రమంలో మరో మూడు రోజులు ఉత్తరాఖండ్ లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ క్రమంలో చార్ ధామ్ యాత్రకు వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని.. వాతావరణం అనుకూలించే సమయంలోనే యాత్ర కొనసాగించాలని సూచించింది.