- మరో 23 మంది ప్రయాణికులకు గాయాలు
- రాజస్థాన్ లో కారును ఢీ కొట్టిన బస్సు
- నుజ్జునుజ్జుగా మారిన కారు.. ఐదుగురు మృతి
డెహ్రాడూన్, జైపూర్: ఉత్తరాఖండ్ లో ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. దీంతో నలుగురు ప్రయాణికులు మరణించారు. మరో 23 మంది గాయపడ్డారు. బుధవారం భీమ్ తల్ లోని సల్ది ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు 27 మంది ప్రయాణికులతో అల్మోరా నుంచి హల్ద్వానీకి వెళ్తోంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పి 1500 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ప్రమాదంపై స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని భీమ్ తల్ లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు పేర్కొన్నారు.
రాజస్థాన్లో ఐదుగురు..
రాజస్థాన్లోని కరౌలీ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి కారు, బస్సు ఢీకొనడంతో ఐదుగురు స్పాట్ లోనే చనిపోయారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన ఐదుగురు వ్యక్తులు కైలా దేవి ఆలయాన్ని సందర్శించుకుని కారులో తిరిగి వెనక్కి గంగాపూర్ సిటీవైపు వస్తున్నారు. కుడ్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సేలంపూర్– కుడ్గావ్ రహదారిపై ప్రయాణిస్తుండగా వేగంగా వచ్చిన బస్సు వారి కారును ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జుగా మారింది. కారులోని ఐదుగురు స్పాట్లోనే మరణించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.