ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతంలోని 14 నియోజకవర్గాలకు ఇవాళ పోలింగ్ జరుగుతుంది. వీటిలో అందరి దృష్టిని ఆకర్షించిన సుల్తాన్ పూర్, ఆజంగఢ్ కూడా ఉన్నాయి. సుల్తాన్‌పూర్ నుంచి కేంద్ర మంత్రి మేనకా గాంధీ, ఆజంగఢ్ నుంచి ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పోటీలో ఉన్నారు. ఆదివారం పోలింగ్‌లో ఈ రెండు సెగ్మెంట్లతో పాటు మరో నాలుగు నియోజకవర్గాలు కీలకంగా మారాయి. యూపీలో తూర్పు ప్రాంతం బాగా వెనకబడింది. అభివృద్ధికి నోచుకోలేదు. పూర్వాంచల్‌గా పేరొందిన ఈ ప్రాంతం రాజకీయంగా చాలా కీలకమైంది. రాష్ట్ర పాలిటిక్స్‌ని శాసించేది పూర్వాంచల్ యూపీయే అంటారు రాజకీయ విశ్లేషకులు. ప్రియాంక గాంధీని ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ హోదాలో తూర్పు ప్రాంత వ్యవహారాల ఇన్‌చార్జిగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కొన్ని నెలల కిందట నియమించారు. దీన్ని బట్టి ఈ ప్రాంతం పొలిటికల్‌గా ఎంత కీలకమైందో అర్థమవుతోంది.
ఆజంగఢ్
ఆజంగఢ్ నుంచి సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పోటీ చేస్తున్నారు. 2014లో మోడీ ప్రభంజనాన్ని తట్టుకుని ఇక్కడి నుంచి ఎస్పీ అగ్ర నేత ములాయం సింగ్ యాదవ్ గెలిచారు. ఆజంగఢ్ సెగ్మెంట్ సమాజ్‌వాది పార్టీకి పెట్టని కోట వంటిది. ఈసారి యాదవుల ఓట్లు చీల్చడంలో భాగంగా అఖిలేశ్‌పై భోజ్‌పురి నటుడు, గాయకుడు దినేశ్ లాల్ యాదవ్‌ని బీజేపీ పోటీకి పెట్టింది. ‘నిర్హౌవా’గా పాపులర్ అయిన దినేశ్ లాల్ ప్రచారంలో హల్ చల్ చేశారు. మూడు కిలోమీటర్ల మేర రిక్షా తొక్కి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అప్పటి నుంచి తన మార్క్ ప్రచారంతో దూసుకెళ్లారు. అఖిలేశ్ యాదవ్ తన కుటుంబం బాగోగులు తప్ప సమాజం గురించి, సామాన్యుల గురించి పట్టించుకోరని దినేశ్‌లాల్ ఘాటు విమర్శలు చేశారు. ఈ ప్రాంతాన్ని పూర్వాంచల్ యాదవ భూమిగా కూడా పిలుస్తారు. యాదవుల తర్వాత ముస్లింలు, దళితుల జనాభా ఎక్కువ. 2004 ఎన్నికల్లో ఆజంగఢ్ నుంచి బీఎస్పీ కేండిడేట్‌గా పోటీ చేసిన రమాకాంత్ యాదవ్ గెలిచారు. ఆ తర్వాత 2008లో జరిగిన బై ఎలక్షన్‌లో బీఎస్పీ టికెట్‌పై పోటీ చేసిన అక్బర్ అహ్మద్ (డంపీ) విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో బీజేపీలోకి మారిపోయి,రమాకాంత్ యాదవ్ విజయం సాధించారు. 2014లో ఎస్పీ అగ్రనాయకుడు ములాయం సింగ్ యాదవ్ గెలిచారు.
ఫూల్‌పూర్
ఈ నియోజకవర్గం నుంచి మహామహులు లోక్‌సభకి ఎన్నికయ్యారు. తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, ఆయన చెల్లెలు విజయలక్ష్మీ పండిట్ ఇక్కడి నుంచి గెలిచారు. 1971లో మాజీ ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ కూడా ఇదే సెగ్మెంట్ నుంచి లోక్‌సభలో ప్రవేశించారు. ఫూల్‌పూర్ పరిధిలో మొత్తం ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లుండగా, వీటిలో అలహాబాద్ వెస్ట్, అలహాబాద్ నార్త్ గ్రామీణ ప్రాంతాల్లోనూ, మిగతా మూడు నియోజకవర్గాలు పట్టణ ప్రాంతాల్లోనూ ఉన్నాయి. ఫూల్‌పూర్ లోక్‌సభ పరిధిలో కేండిడేట్ల గెలుపోటములను నిర్ణయించే సత్తా బీసీ కులాలకే ఉంది. ఆ తర్వాతి స్థానంలో కాయస్థ, బ్రాహ్మణులు, వైశ్యులు ఉన్నారు. 1999, 2004ల్లో ఎస్పీ గెలవగా, 2009 ఎన్నికల్లో బీఎస్పీ దక్కించుకుంది. 2014 ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై కేశవ్ ప్రసాద్ మౌర్య విజయం సాధించారు. 2017లో అసెంబ్లీకి ఎన్నిక కావడంతో జరిగిన బై ఎలక్షన్‌లో సమాజ్ వాది పార్టీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్ సింగ్ విజయం సాధించారు. ప్రస్తుతం ఎస్పీ టికెట్‌పై పంధారి యాదవ్, కాంగ్రెస్ తరఫున పంకజ్ నిరంజన్, బీజేపీ అభ్యర్థిగా కేసరి పటేల్ పోటీలో ఉన్నారు.
అలహాబాద్ (ప్రయాగ్‌రాజ్)
అలహాబాద్ పరిధిలో ఐదు అసెంబ్లీ నియోజక వర్గాలుండగా, రెండు సెగ్మెంట్లు ఎస్సీలకు రిజర్వు అయ్యాయి. పటేల్ కులస్తులు, దళితులు ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆ తర్వాత స్థానం బనియాలది. కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో దళితులు, ఠాకూర్లు, బ్రాహ్మణులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఎంతో మంది ప్రముఖులు లోక్‌సభకి ఎన్నికయ్యారు. లాల్ బహదూర్ శాస్త్రి, వీపీ సింగ్, హేమావతి నందన్ బహుగుణ వంటి టాప్ లీడర్లు అలహాబాద్‌కి ప్రాతినిధ్యం వహించారు. 1984 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై సినీ నటుడు అమితాబ్ బచ్చన్ పోటీ చేసి మాజీ ముఖ్యమంత్రి హెచ్.ఎన్.బహుగుణను ఓడించారు. బీజేపీ సీనియర్ లీడర్ మురళీ మనోహర్ జోషి మూడుసార్లు ఇక్కడి నుంచే గెలిచి, 2004లో ఓడిపోయారు. 2004, 2009 పార్లమెంట్ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీకి చెందిన రేవతి రామన్ సింగ్ గెలుపొందారు. 2014 ఎన్నికల్లో బీజేపీ తరఫున శ్యామ చరణ్ గుప్తా గెలిచారు. ప్రస్తుతం సమాజ్‌వాది పార్టీ తరఫున రాజేంద్ర పటేల్, కాంగ్రెస్ టికెట్‌పై యోగేంద్ర శుక్లా, బీజేపీ అభ్యర్థిగా రీటా బహుగుణ శుక్లా పోటీ చేస్తున్నారు.
అంబేడ్కర్ నగర్
నియోజకవర్గాల పునర్విభజనలో అంబేడ్కర్ నగర్ లోక్‌సభ స్థానం ఏర్పడింది. అంతకుముందు అక్బర్‌పూర్‌గా ఉండేది. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉండే అక్బర్‌పూర్… బహుజన్ సమాజ్ పార్టీ రంగంలోకి దిగడంతో ఆ పార్టీకి కీలక స్థానంగా మారిపోయింది. జనాభాలో 24 శాతం మంది ఎస్సీలు, ఎస్టీలే ఉన్నారు. సోషలిస్టు నాయకుడు రామ్‌మనోహర్ లోహియా, పూర్వాంచల్ గాంధీగా పేరుబడ్డ ఫ్రీడం ఫైటర్ జైరామ్ వర్మ ఈ ప్రాంతంవారే. 1989 నుంచి బీఎస్పీకి సేఫ్ సీట్‌గా అక్బర్‌పూర్ (అంబేద్కర్ నగర్) గుర్తింపు పొందింది. బీఎస్పీ అధినేత మాయావతి ఇక్కడి నుంచి నాలుగుసార్లు లోక్‌సభకి ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆమె ఎక్కడా పోటీలో లేనప్పటికీ… ఫలితాల అనంతరం హంగ్ ఏర్పడి ప్రధాని అయ్యే అవకాశం వస్తే మాత్రం అంబేద్కర్ నగర్ సెగ్మెంట్ నుంచి పోటీకి దిగుతారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఒక ర్యాలీలో వెల్లడించారు. అంబేద్కర్ నగర్‌గా ఏర్పడ్డాక 2009 ఎన్నికల్లో బీఎస్పీ కేండిడేట్ రాకేశ్ పాండే విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హరి ఓం పాండే గెలిచారు. ప్రస్తుతం బీఎస్పీ టికెట్‌పై రితేశ్ పాండే, బీజేపీ అభ్యర్థిగా ముకుట్ బిహారీ వర్మ పోటీ చేస్తున్నారు. సమాజ్‌వాది అగ్రనేత ములాయం తమ్ముడు శివ్‌పాల్ స్థాపించిన ప్రగతిశీల్ సమాజ్‌వాది పార్టీ తరఫున ప్రేమ్ నాథ్ నిషాద్ బరిలో ఉన్నారు.
సుల్తాన్‌పూర్
సుల్తాన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మాజీ ప్రధాని ఇందిర చిన్న కోడలు, కేంద్ర మంత్రి మేనకా గాంధీ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. సుల్తాన్‌పూర్‌కి సిట్టింగ్ ఎంపీ మేనకా గాంధీ కుమారుడు వరుణ్ గాంధీ. ఈసారి వరుణ్‌ని మేనక సొంత సెగ్మెంట్ ఫిల్‌భిత్‌కి పంపించి, ఇక్కడకు మేనకా గాంధీని తీసుకువచ్చింది బీజేపీ. కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ సంజయ్ సింగ్ మరోసారి ఇక్కడ పోటీకి దిగారు. ఆయన 2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచే గెలిచారు. 2014 ఎన్నికల్లో సంజయ్ భార్య అమితా సింగ్ కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. బీఎస్పీ తరఫున చంద్ర భద్ర సింగ్ అలియస్ సోను ఇక్కడ బరిలో ఉన్నారు.
నియోజకవర్గంలో 50 వేలకు పైగా బీసీ ఓటర్లున్నారు. ఒకప్పుడు ఎస్పీ, బీఎస్పీకి ఓటు బ్యాంకుగా ఉన్న వీరంతా మారిన రాజకీయ పరిస్థితుల్లో తమ వైఖరిని కూడా మార్చుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పెద్ద కులమైన ఠాకూర్లను కూడా తమ వైపు తిప్పుకోవడానికి యువ ఠాకూర్ చంద్రభద్ర సింగ్ (సోను)కి బీఎస్పీ వ్యూహాత్మకంగా టికెట్ ఇచ్చింది. అయితే, మేనకా గాంధీ తన గెలుపుపై ధీమాతో ఉన్నారు. పనుల కోసం ముస్లింలు తన దగ్గరకే రావలసి ఉంటుందని, అందువల్ల ముస్లింలు తనకే ఓటు వేయాలని, లేకపోతే వారి పనులు చేసిపెట్టనని ఎన్నికల ప్రచారంలో మేనకా గాంధీ చేసిన ప్రకటనలు వివాదాస్పదమయ్యాయి.
ప్రతాప్‌గఢ్
దేశంలోనే వెనకబడ్డ ప్రాంతాల్లో ఒకటిగా ప్రతాప్‌గఢ్ నియోజకవర్గానికి పేరుంది. ఈ నియోజకవర్గ పరిధిలో ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఇక్కడ జనాభాలో 32 శాతం ముస్లింలు. తర్వాతి స్థానాల్లో బ్రాహ్మణులు, ఠాకూర్లు, కుర్మీలు ఉన్నారు. 1999, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై రాజకుమారి రత్నా సింగ్ విజయం సాధించారు. మధ్యలో 2004లో జరిగిన జనరల్ ఎలక్షన్‌లో సమాజ్‌వాది కేండిడేట్ అక్షయ్ ప్రతాప్ సింగ్ గెలిచారు. మోడీ ప్రభంజనంలో జరిగిన 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కున్వర్ హర్ వంశ్ సింగ్ విజయం సాధించారు. ప్రస్తుతం బహుజన్ సమాజ్ పార్టీ కేండిడేట్‌గా అక్షయ్ కుమార్ త్రిపాఠి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ టికెట్‌పై రాజకుమారి రత్నా సింగ్, బీజేపీ అభ్యర్థిగా సంగం లాల్ గుప్తా బరిలో ఉన్నారు.