కాళేశ్వరం ఓ పనికిరాని ప్రాజెక్ట్

కాళేశ్వరం ఓ పనికిరాని ప్రాజెక్ట్
  • డిజైన్ చూసి ఎన్డీఎస్​ఏనే ఆశ్చర్యపోయింది: మంత్రి ఉత్తమ్
  • గత పాలకుల అతి తెలివి.. కాళేశ్వరంలో కనిపించింది
  • ఐదేండ్లలో ఎత్తిపోసింది 65 టీఎంసీలే
  • త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడి

కరీంనగర్, వెలుగు: కాళేశ్వరం ఓ పనికిరాని ప్రాజెక్ట్ అని, అధికారిక లెక్కల ప్రకారం.. ఐదేండ్లలో మూడు బ్యారేజీల నుంచి ఉపయోగపడింది కేవలం 65 టీఎంసీలు మాత్రమేనని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ డిజైన్, కన్ స్ట్రక్షన్, ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ లో లోపాలు ఉన్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) మధ్యంతర రిపోర్టులో పేర్కొన్నదని వివరించారు. అసలు ఎలా ప్రాజెక్టు డిజైన్ చేశారో అని ఎన్డీఎస్ఏనే ఆశ్చర్యపోయిందన్నారు. కరీంనగర్ లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘కాళేశ్వరం ప్రాజెక్టులో పంపులు నడిపిన టైం, విద్యుత్ వినియోగం ఆధారంగా ఎంత నీళ్లు పంపింగ్ చేశారని అంచనా వేశాం. అధికారిక లెక్కల ప్రకారం ఐదేండ్లలో మూడు బ్యారేజీల నుంచి ఉపయోగపడింది కేవలం 65 టీఎంసీలు మాత్రమే. అంటే ఏటా ఎత్తిపోసింది కేవలం 13 టీఎంసీలే అన్నమాట. ఒక టీఎంసీకి 10 వేల ఎకరాలు చొప్పున 13 టీఎంసీలతో పారింది 1.30 లక్షల ఎకరాలు మాత్రమే. కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేకపోయినా పాత ఆయకట్టుకు స్థిరీకరించామని గత సర్కార్ పెద్దలు చెప్పేటోళ్లు. అవన్నీ అబద్ధాలే అని ఇప్పుడు స్పష్టమైంది.

గత పాలకుల అతి తెలివితేటలు కాళేశ్వరంలో కనిపించాయి. పంప్ హౌస్​లకు సంబంధించి కూడా కాంట్రాక్టర్లకు, ఇంజినీర్లకు నోటీసులు ఇచ్చాం’’అని అన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును షిఫ్ట్ చేయడమే చేసిన పెద్ద తప్పు అని విమర్శించారు. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి ఉంటే.. ఏడాదికి పవర్ బిల్లు వెయ్యి కోట్ల రూపాయలు మాత్రమే వచ్చేదన్నారు. కాళేశ్వరం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చి అన్ని పంపులు నడిస్తే ఎలక్ట్రిసిటీ బిల్లు 10వేల కోట్లు వస్తున్నదని తెలిపారు. ఈ పైసలు ఎవరు కట్టాలి అని ప్రశ్నించారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్​ను ఏవిధంగా ఉపయోగంలోకి తీసుకురావాలో, వాటికి ఎలా రిపేర్లు చేయాలో మళ్లీ ఎన్డీఎస్ఏతో చర్చిస్తామని తెలిపారు.  

ఆరోగ్యశ్రీతో పాటే కొత్త రేషన్ కార్డులు

త్వరలోనే కొత్త రేషన్ కార్డులతో పాటు ఆరోగ్యశ్రీ కార్డులు వేర్వేరుగా ఇస్తామని ఉత్తమ్ తెలిపారు. రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలపై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఒకదానితో ఒకటి లింక్ పెట్టబోమని చెప్పారు. ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని రైతులకు మంత్రి సూచించారు. కేసీఆర్ పదేండ్లలో రూ.25వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని, తాము ఒకే సారి రూ.31 వేల కోట్లు రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు.