
న్యూఢిల్లీ: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్ ఆరో సీజన్ మే 29 నుంచి జూన్ 15వ తేదీ వరకు జరుగుతుందని ఆర్గనైజర్లు ప్రకటించారు. ఈ సీజన్‌కు అహ్మదాబాద్‌లోని ఈకేఏ ఎరీనా ఆతిథ్యం ఇస్తుందని శుక్రవారం వెల్లడించారు. ఇదే స్టేడియంలో 2016 కబడ్డీ వరల్డ్ కప్, 2019 ఇంటర్‌కాంటినెంటల్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లు జరిగాయి. దేశ, విదేశాలకు చెందిన మేటి టీటీ ప్లేయర్లు బరిలో నిలిచి గత ఐదు ఎడిషన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న యూటీటీలో ఎనిమిది జట్లు పోటీ పడుతున్నాయి.
డిఫెండింగ్ చాంపియన్ గోవా చాలెంజర్స్ మూడో టైటిల్ వేటలో ఉంది. కొత్త ఎడిషన్‌లో రెండు గ్రూపుల్లో నాలుగేసి జట్లు బరిలో నిలుస్తాయి. లీగ్ దశలో ప్రతీ జట్టు ఐదు మ్యాచ్‌ల్లో పోటీపడనుంది. ర్యాండమ్ ప్రకారం ప్రతీ టీమ్ గ్రూప్‌లోని మిగతా మూడు జట్లతో ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు ఆడుతుందని ఆర్గనైజర్స్ తెలిపారు. టాప్–4 టీమ్స్ నాకౌట్ రౌండ్‌కు క్వాలిఫై అవుతాయి.