ఓటు వజ్రాయుధం.. స్వేచ్ఛగా వినియోగించుకోండి: వి.పి.గౌతమ్

  • గ్రామాల్లో అధికారుల ప్రచారం.. పోలీసుల కవాతు

ఖమ్మం టౌన్/సత్తుపల్లి/కూసుమంచి, వెలుగు: ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని, ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఖమ్మం కలెక్టర్ వి.పి.గౌతమ్ కోరారు. జిల్లాలోని ఓటర్లను చైతన్య పరిచేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చైతన్య రథాలను బుధవారం ఆయన కలెక్టరేట్ లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గౌతమ్​మాట్లాడుతూ.. జిల్లాకు చెందిన సాంస్కృతిక సారథి కళాకారులను రెండు బృందాలుగా ఏర్పాటు చేసి ఓటరు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

ఆట, పాట ద్వారా ఓటర్లలో చైతన్యం కల్పించేందుకు ప్లాన్​చేసినట్లు తెలిపారు. అభ్యర్థుల ఖర్చుల వివరాలను ఎన్నికల వ్యయ పరిశీలన బృందాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని జిల్లా వ్యయ పర్యవేక్షణ నోడల్ ఆఫీసర్​విజయకుమారి అన్నారు. బుధవారం కలెక్టరేట్​లో అకౌంటింగ్‌‌ టీమ్, ఎస్ఎస్టీ, వీఎస్టీ, వీవీటీ టీమ్ సిబ్బందికి అవగాహన కల్పించారు.ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు శాంతి భద్రతలను కట్టుదిట్టం చేస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్​అశోక్ చక్రవర్తి తెలిపారు. బుధవారం సత్తుపల్లిలో కేంద్ర పారా మిలిటరీ బలగాలు, స్థానిక పోలీసులతో కలిసి కవాతు నిర్వహించాయి ఈ సందర్భంగా ఏసీపీ రామాంజనేయులు మాట్లాడుతూ.. ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలన్నా  ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలన్నారు.

కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున అన్ని పార్టీల నేతలు సహకరించాలన్నారు. కవాతులో పట్టణ, రూరల్ సీఐలు మోహన్ బాబు, హనూక్, సిబ్బంది పాల్గొన్నారు. ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం కుసుమంచి మండల కేంద్రంలో సీఆర్పీఎఫ్ జవాన్లతో కలిసి పోలీసులు కవాతు నిర్వహించారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు. సీఆర్పీఎఫ్​అసిస్టెంట్ కమాండెంట్ శర్వణన్, ఇన్​స్పెక్టర్లు కంది జితేందర్ రెడ్డి, రాజిరెడ్డి, ఎస్సైలు రమేశ్​కుమార్, వరాల శ్రీనివాసరావు, సతీశ్, వెంకటకృష్ణ పాల్గొన్నారు.

రూ.30 లక్షల గోడ గడియారాలు సీజ్

ఖమ్మం నియోజకవర్గం దంసలాపురం ఎస్ఆర్ హోమ్స్ బిల్డింగ్ లో క్రికెట్ కిట్లు ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది. ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ సుమ, టాస్క్ ఫోర్స్ ఏసీపీ శివరామయ్య పర్యవేక్షణలో సిబ్బంది సోదాలు జరిపారు. తనిఖీల్లో రూ.30 లక్షలు విలువ చేసే 9,750 గోడ గడియరాలు దొరికాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తన కుమార్తె వివాహానికి వచ్చిన ప్రజలకు పంచగా, మిగిలిన వాటిని బిల్డింగ్​లో స్టోర్​చేసినట్లు ఆయన అనుచరులు తెలిపారు. గడియారాలకు సంబంధించిన డాక్యుమెంట్లు చూపిస్తే తిరిగి ఇచ్చేస్తామని ఆఫీసర్లు స్పష్టం చేశారు.

ALS0 READ: ఒక్క చాన్స్ ప్లీజ్ .. వరుస పరాజయాలు చూసినా పట్టువదలని నేతలు