అప్పుడూ.. ఇప్పుడూ విలీనమే

అప్పుడూ.. ఇప్పుడూ విలీనమే

ఉద్యమం టైమ్‌‌‌‌లో జేఏసీ విలీనంగానే నిర్ణయించింది

1948 సెప్టెంబర్‌‌‌‌ 17.. తెలంగాణ చరిత్రలో ఒక వివాదాస్పద దినంగానే మిగిలిపోయింది. భవిష్యత్తులో కూడా అట్లనే ఉంటుంది. సెప్టెంబర్‌‌‌‌ 17 హైదరాబాద్‌‌‌‌ స్వాతంత్య్ర దినమని, సంబరాలు అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలాకాలంగా బీజేపీ డిమాండ్‌‌‌‌ చేస్తున్నది. తెలంగాణ ఉద్యమ టైమ్‌‌‌‌లో టీఆర్​ఎస్​.. – జేఏసీ ఎంతో చర్చించి సెప్టెంబర్‌‌‌‌ 17ను ఇండియాలో హైదరాబాద్‌‌‌‌ సంస్థానం విలీనమైన దినంగా లెక్కలోకి తీసుకోవాలని నిర్ణయించాయి. మొదట్లో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం కేసీఆర్‌‌‌‌ సెప్టెంబర్‌‌‌‌ 17న పొరుగున ఉన్న మరట్వాడ (పూర్వ హైదరాబాద్‌‌‌‌ రాష్ట్రంలో భాగం)లో జరుపుకున్నట్లే ఏపీలో కూడా స్వాతంత్య్ర దినాన్ని నిర్వహించాలని మాట్లాడింది నిజమే. కానీ తెలంగాణ జేఏసీలో భాగంగా సెప్టెంబర్‌‌‌‌ 17ను ‘‘విలీనదినం’’గానే తెరాస కూడా పరిగణించింది. ఇప్పటికీ అదే విధానాన్ని అనుసరిస్తున్నది.

నిజాం స్వతంత్రంగా ఉండాలనుకుండు

బ్రిటిష్‌‌‌‌ వాళ్లు భారతదేశాన్ని పరిపాలించిన కాలంలో 600కు పైగా చిన్నా, పెద్ద సంస్థానాలు రాజుల, సంస్థానాధీషుల పాలనలో ఉండేవి. దేశానికి స్వాతంత్య్రం ప్రకటించినపుడు ఈ సంస్థానాధీషులకు బ్రిటిష్‌‌‌‌ పాలకులు స్వేచ్ఛనిచ్చారు. వారు ఇండియా లేదా పాకిస్తాన్‌‌‌‌లో విలీనం కావచ్చు లేదా స్వతంత్రంగా కొనసాగవచ్చును. పాకిస్తాన్‌‌‌‌ భూభాగంలో ఉన్న సంస్థానాలు ఆ దేశంలో విలీనం కాగా సర్దార్‌‌‌‌ పటేల్‌‌‌‌, నెహ్రూ చొరవతో మూడు సంస్థానాలు తప్ప మిగిలినవన్నీ 1948 నాటికే భారతదేశంలో విలీనమైనాయి. మిగిలిన మూడు సంస్థానాలు జునాగఢ్‌‌‌‌, కశ్మీర్‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌. జునాగఢ్‌‌‌‌ పాలకుడు ముస్లిం కాగా రాజ్య ప్రజల్లో అత్యధికులు హిందువులు. కశ్మీర్‌‌‌‌ రాజు హిందూ కాగా ప్రజల్లో అత్యధికులు ముస్లింలు. హైదరాబాద్‌‌‌‌ రాజైన నిజాం ముస్లిం కాగా అత్యధిక ప్రజానీకం హిందువులు. ప్రజలు తిరుగుబాటు చేయడంతో జునాగఢ్‌‌‌‌ రాజు పాకిస్తాన్‌‌‌‌కు పారిపోయాడు. పాకిస్తాన్‌‌‌‌ కశ్మీర్‌‌‌‌పై యుద్ధం ప్రారంభించగానే ఆ రోజు భారత్‌‌‌‌లో విలీన ఒప్పందంపై కొన్ని షరతులతో (కాశ్మీర్‌‌‌‌కు స్వయం ప్రతిపత్తి) సంతకం చేశారు. ఇక మిగిలింది హైదరాబాద్‌‌‌‌. ఇక్కడి పరిస్థితి భిన్నంగా ఉంది. రజాకార్ల నాయకుడు కాశీం రజ్వీ పాకిస్తాన్‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌ను విలీనం చేయాలన్నాడు. భారత్‌‌‌‌లో కలిసిపోవాలని ప్రజలు, కాంగ్రెస్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ చేసినా నిజాం స్వతంత్రంగా ఉండాలనుకున్నాడు.

అయితే 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చినపుడే అధికారికంగా హైదరాబాద్‌‌‌‌ భారత్‌‌‌‌లో ఒక రాష్ట్రమైంది. నిజాం రాజు అదే రోజు ‘‘రాజప్రముఖ్‌‌‌‌’’గా ప్రమాణ స్వీకారం చేశారు. అధికారికంగా హైదరాబాద్‌‌‌‌ 1950 జనవరి 26న భారత్‌‌‌‌లో విలీనమైనా అనధికారికంగా సెప్టెంబర్‌‌‌‌ 17, 1948 నుంచే నెహ్రూ – పటేల్‌‌‌‌ల ఆదేశాల ప్రకారం మిలటరీ ప్రభుత్వం పాలన సాగించింది.

పోలీసు చర్యతో కొందరిలో విషాదం

మిలటరీ చర్య (పేరుకు పోలీసు చర్య) కొందరిలో ఆనందాన్ని మరికొందరిలో విషాదాన్ని నింపింది.  కమ్యూనిస్టుల పోరాటాల ఫలితంగా నల్గొండ, వరంగల్‌‌‌‌, కరీంనగర్‌‌‌‌, ఖమ్మం తదితర జిల్లాల్లో ప్రజలు పంచుకున్న భూములను సైన్యం సహాయంతో భూస్వాములు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ప్రశ్నించినవారిని కోర్టుల పాల్జేశారు. ఉద్యమకారులకు ఉరిశిక్షలు విధించారు. భారత సైనికులు హైదరాబాద్‌‌‌‌పై మిలటరీ చర్య సందర్భంగా దారుణాలకు పాల్పడ్డారని ప్రధాని నెహ్రూ నియమించిన పండిట్‌‌‌‌ సుందర్‌‌‌‌లాల్‌‌‌‌ కమిటీ తమ రిపోర్టులో ప్రకటించింది. సెప్టెంబర్‌‌‌‌ 17 విషయంలో తెరాస ప్రస్తుత నిర్ణయానికి 2013 నవంబర్‌‌‌‌లో మన్మోహన్‌‌‌‌సింగ్‌‌‌‌ ప్రభుత్వం బహిర్గతం చేసిన ఈ నివేదిక కూడా ఒక కారణమని చెప్పవచ్చు. మరట్వాడలో కమ్యూనిస్టులు లేరు. అందుకే రజాకార్ల పీడ విరగడైందని వారు 17 సెప్టెంబర్‌‌‌‌ను ‘‘స్వాతంత్య్ర దినం’’గా జరుపుకుంటున్నారు. తెలంగాణలో కమ్యూనిస్టుల అణిచివేతకు సైన్యం జరిపిన చర్యలతో ఇక్కడి ప్రజల పరిస్థితి మరో రకంగా మారింది. అందుకే సెప్టెంబర్‌‌‌‌ 17 తెలంగాణ ప్రజలకు ‘‘విలీన దినం’’ మాత్రమే. భారత్‌‌‌‌లో విలీనమైనందున భారత స్వాతంత్య్ర దినమే తెలంగాణకు స్వాతంత్య్ర దినం.

స్వాతంత్రమని అనలేదు

1947 నవంబర్‌‌‌‌ 29న భారత ప్రభుత్వం, నిజాం ప్రభుత్వం ఏడాది పాటు అమలులో ఉండేలా కొన్ని కండీషన్లతో స్టేటస్‌‌‌‌కో అగ్రిమెంట్‌‌‌‌ చేసుకున్నాయి. బ్రిటీష్‌‌‌‌ వాళ్లతో నిజాం కుదుర్చుకున్న అగ్రిమెంట్‌‌‌‌ లాంటిదే ఇది. అభద్రతాభావంతో నిజాం, కమ్యునిస్టుల భయంతో సర్దార్‌‌‌‌ పటేల్‌‌‌‌ దాన్ని ఉల్లంఘించారు. ఏడాది కాకుండానే ‘‘ఆపరేషన్‌‌‌‌ పోలో’’ పేరుతో రజాకార్లను కారణంగా చూపి హైదరాబాద్‌‌‌‌పైకి సెప్టెంబర్‌‌‌‌ 13న సైన్యాలను పంపించారు. సెప్టెంబర్‌‌‌‌ 17న నిజాం ‘‘లొంగుబాటు’’ ప్రకటించడంతో పోలీసు చర్య ముగిసింది. జనరల్‌‌‌‌ చౌదరి సారథ్యంలో మిలటరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. కానీ ఐక్యరాజ్య సమితిలో ఎక్కడ దోషిగా నిలబడాల్సి వస్తుందోనని (స్టేటస్‌‌‌‌కో అగ్రిమెంట్‌‌‌‌ ఉల్లంఘించి హైదరాబాద్‌‌‌‌పై సైనికచర్య చేపట్టినందుకు) నెహ్రూ నిజాంను ‘‘రాజు’’గానే కొనసాగించాడు. మిలటరీ ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు, ఉత్తర్వులన్నీ నిజాం మీర్‌‌‌‌ ఉస్మాన్‌‌‌‌ అలీఖాన్‌‌‌‌ సంతకంతోనే వెలువడేవి. 1949 నవంబర్‌‌‌‌ 24న హైదరాబాద్‌‌‌‌ సంస్థానాన్ని ఇండియన్‌‌‌‌ యూనియన్‌‌‌‌లో చేరుస్తూ నిజాం ప్రవేశ లేదా విలీనపత్రంపై సంతకం చేశారు.  అప్పట్లో అంతా హైదరాబాద్‌‌‌‌ సంస్థానం భారత్‌‌‌‌లో విలీనమైనదనే అన్నారు. దీన్ని ‘‘స్వాతంత్రమని’’ అనలేదు.

– వి.ప్రకాశ్‌‌‌‌, చైర్మన్‌‌‌‌, తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ

For More News..

ఉద్యోగం పోయినోళ్లకు నయా జాబ్స్..

ఈ సీజన్ ఐపీఎల్‌లో సచిన్ కొడుకు ఆడే చాన్స్!