ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్, వెలుగు : మహిళలు చదువుకుంటేనే కుటుంబం బాగుంటుందని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. మహబూబ్‌నగర్‌లో నిర్మిస్తున్న ప్రభుత్వ గిరిజన కాలేజీ హాస్టల్‌ను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆడపిల్లల హాస్టల్‌ను ఊరికి దూరంగా నిర్మించడం మంచిది కాదన్న ఉద్దేశంతోనే స్టేడియం గ్రౌండ్ సమీపంలో నిర్మించినట్లు చెప్పారు. హాస్టల్‌ను తాను దత్తత తీసుకొని స్టూడెంట్లకు ఇబ్బంది రాకుండా అండగా ఉంటానని, అవసరమైన అన్ని వసతులను కల్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రతి నెల హెల్త్ చెకప్ చేయించాలని ఆదేశించారు. హాస్టల్ స్టూడెంట్లతో కమిటీని ఏర్పాటు చేసి పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. కలెక్టర్ వెంకట్రావు, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, రహమాన్ పాల్గొన్నారు.
పేదల భూములను ఆక్రమించడం సరికాదు
ఉప్పునుంతల (వంగూర్), వెలుగు : కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇచ్చిన భూములను కొందరు వ్యక్తులు కబ్జా చేశారని, వాటిని వెంటనే అప్పగించాలని డీసీసీ అధ్యక్షుడు చిక్కుడు వంశీకృష్ణ, బీఎస్పీ జిల్లా నాయకులు కొయ్యల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంగూరు మండలం గజరా గ్రామంలోని 239 సర్వే నంబర్‌లోని 4.04 ఎకరాల భూమిని 2002లో కాంగ్రెస్ ప్రభుత్వం
జంగారావు అనే వ్యక్తి వద్ద కొని పేదలకు పట్టాలిచ్చిందని చెప్పారు. కానీ ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా ఆ స్థలం ఇంకా అగ్రికల్చర్ ల్యాండ్‌గానే కొనసాగుతోందన్నారు. ఆ భూమిని జంగారావు కుమారుడు సంజీవ్‌రావు అదే గ్రామానికి చెందిన కర్ణాకర్‌రావు అనే వ్యక్తికి అమ్మాడన్నారు. తహసీల్దార్‌తో కుమ్మక్కై పేదలకు కేటాయించిన భూమిని అమ్ముకోవడం సరైంది కాదన్నారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పాండురంగారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రమేశ్‌గౌడ్, యాదగిరిరావు, సతీశ్‌రెడ్డి, రాజు, గెలువయ్య, శంకర్‌యాదవ్, మల్లయ్యయాదవ్, పరుశరాములు
పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఆలంపూర్, వెలుగు : పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అబ్రహం, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చందు అన్నారు. గురువారం ఆలంపూర్‌లో నిర్వహించిన పెన్షన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో వారు మాట్లాడారు. ప్రజా సంక్షేమం, గ్రామాలు, పట్టణాల అభివృద్ధే లభ్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తోందన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంతా అమల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అనంతరం వారు జోగులాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈవో పురేందర్, చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మనోరమ పాల్గొన్నారు.
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
శ్రీరంగాపూర్, వెలుగు: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని కంబాళాపూర్ గ్రామంలో గురువారం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నన్నెమోని ఆనంద్ (36) బుధవారం రాత్రి రంగ సముద్రం రిజర్వాయర్‌లోకి చేపల వేటకు వెళ్లాడు. గురువారం ఉదయం వరకు కూడా ఇంటికి రాకపోవడంతో భార్య కుటుంబ సభ్యులు వెతకగా రిజర్వాయర్‌లో శవమై కనిపించాడు. భర్త మృతిపై అనుమానం ఉన్నట్లు భార్య ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి డెడ్‌బాడీని పోస్టుమార్టం తరలించినట్లు ఎస్సై మల్లేశ్ చెప్పారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
జిల్లాను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దండి
రైతులకు ఉదారంగా రుణాలు ఇవ్వండి
బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ వెంకట్ రావు
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మహబూబ్‌నగర్‌లో నేలలు అనువుగా ఉన్నందున జిల్లాను హార్టికల్చర్ హబ్ తీర్చిదిద్దేందుకు సహకరించాలని కలెక్టర్ ఎస్.వెంకట్ రావు బ్యాంకర్లకు సూచించారు. గురువారం రెవెన్యూ మీటింగ్ హాలులో నిర్వహించిన బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాంకర్లు రైతులకు రుణాలు ఇవ్వడంలో ఉదారంగా వ్యవహరించాలని అన్నారు. ఇప్పటి వరకు బ్యాంకుల ద్వారా రుణాలు పొందని రైతులను గుర్తించి ముందుగా వారికి రుణాలు ఇవ్వాలని జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ వెంకటేశ్ఆదేశించారు. జిల్లాలో కూరగాయలు, పండ్ల తోటలు, సెరికల్చర్ సాగుకు అవకాశాలున్నాయన్నారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులందరికి రుణాలు ఇవ్వాల్సిందిగా బ్యాంకర్లను కోరారు. ఇప్పటి వరకు 32 శాతం లక్ష్యాలు సాధించగా, తక్కిన లక్ష్యాలను సాధించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా డీఆర్డీఓ యాదయ్య, బ్యాంకర్లకు సూచిచారు. ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద అమలు చేసే రుణాలను సెప్టెంబర్10లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎల్ డీఎం భాస్కర్, నాబార్డు ఏజీఎం ఎంవీఎస్ఎస్ శ్రీనివాస్, ఆర్బీఐ ఏజీఎం తేజ్ దీప్తి మొహర, గ్రామీణ వికాస్ బ్యాంక్ ఆర్ఎం సుభాష్, డీఆర్డీఓ యాదయ్య, హార్టికల్చర్ ఏడీ సాయిబాబ, జిల్లా బీసీ సంక్షేమాధికారి ఇందిర, ఎస్సీ సంక్షేమ ఆఫీసర్ యాదయ్యగౌడ్, ఆయా బ్యాంకుల కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.
420 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : అనుమతి లేకుండా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గురువారం సివిల్ సప్లై అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పక్కా సమాచారంతో సివిల్ సప్లై డీఎస్ఓ మోహన్ బాబు, సివిల్ సప్లై మేనేజర్ బాల్ రాజు, స్థానిక పోలీసులు దాడి చేసి నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర గేటు వద్ద లారీలో అక్రమంగా తరలిస్తున్న 420 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీ కాంట్రాక్టర్ సుధాకర్ రెడ్డి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పుల్లూరు దగ్గర 17 క్వింటాళ్లు..
ఆలంపూర్, వెలుగు: పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర అక్రమంగా తరలిస్తున్న17 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఉండవల్లి ఎస్సై బాలరాజు తెలిపిన ప్రకారం.. కర్నూలు జిల్లా నంద్యాల కు చెందిన మధుబాబు, నీలిజయనరసింహులు బొలెరో వాహనంలో రేషన్ బియ్యం తరలిస్తున్నారని పక్కా సమాచారం వచ్చింది. దీంతో పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర తనిఖీలు నిర్వహించి బొలెరో వాహనంలో 36 బస్తాల రేషన్ బియ్యం గుర్తించారు. సంబంధిత పత్రాలు చూపించకపోవడంతో వారిపై కేసు నమోదు చేసి బియ్యంతో సహా వెహికల్‌ను పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ప్రొటోకాల్ రగడ
అమనగల్లులో పోటాపోటీగా ర్యాలీలు, ధర్నాలు
అమనగల్లు, వెలుగు : అమనగల్లు పట్టణంలో గురువారం టీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రోటోకాల్ గొడవ తోపులాటలకు దారి తీసింది. పట్టణంలోని నేషనల్ హైవేపై కొత్తగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌ను బుధవారం రాత్రి మున్సిపల్ పాలకవర్గంతో కలిసి జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధులైన నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ను ఆహ్వానించకుండా అవమానపర్చారని ఆరోపిస్తూ గురువారం టీఆర్ఎస్ నాయకులు పట్టణంలోని నేషనల్ హైవేపై ధర్నా చేపట్టారు. ఆచారి దిష్టిబొమ్మను దహనం చేశారు. విషయం తెలుసుకున్న బీజేపీ లీడర్లు ర్యాలీగా అక్కడికి చేరుకుని వారూ ధర్నా నిర్వహించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. నాయకులు ఒకరినొకరు తోసేసుకున్నారు. వెంటనే అమనగల్లు సీఐ ఉపేందర్ ఆధ్వర్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను శాంతింపజేశారు. అనంతరం రెండు పార్టీల లీడర్లు పరస్పరం పోలీస్స్టేషనల్లో ఫిర్యాదు చేశారు.
మహిళల మృతికి ప్రభుత్వ వైఫల్యమే కారణం
అమనగల్లు, వెలుగు : కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు చనిపోవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ వికటించి చికిత్స పొందుతున్న మహిళలను గురువారం ఆయన పరామర్శించారు. మృతుల ఫ్యామిలీలకు రూ. 25 లక్షల పరిహారం, డబుల్ బెడ్‌రూం ఇల్లు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చికిత్స ఖర్చులను కూడా ప్రభుత్వమే చెల్లించాలన్నారు. అనంతరం మృతుల్లో ఒకరికి రూ. 25 వేలు, చికిత్స పొందుతున్న వారికి రూ. 10 వేల ఆర్థికసాయం అందజేశారు రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొక్కా నరసింహారెడ్డి, నాయకులు రాంరెడ్డి, కాసుల వెంకటేశ్, దండు శ్రీను పాల్గొన్నారు.
ప్రధానిని విమర్శించే స్థాయి మంత్రికి లేదు
బీజేపీ స్టేట్ లీడర్ ప్రభాకర్ రెడ్డి
వనపర్తి, వెలుగు: ప్రధాని మోడీపై మంత్రి నిరంజన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు సరికాదని, మంత్రి తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని బీజేపీ స్టేట్లీడర్అయ్యగారి ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంత్రి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గురువారం బీజేపీ నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనలు చేపట్టారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చే నిధులపై టీఆర్ఎస్ మంత్రులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు, వైకుంఠధామాలు, పింఛన్లు, రేషన్ బియ్యం, మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తున్నారని గుర్తు చేశారు. ప్రధానిపై చేసిన విమర్శలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నిరసనలో లీడర్లు బి.కృష్ణ, జింకల కృష్ణయ్య, రామ్మోహన్, కుమార్, విష్ణువర్ధన్ రెడ్డి,పెద్ది రాజు తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ ఇస్తాం
దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
కొత్తకోట, వెలుగు : అర్హులైన ప్రతిఒక్కరికీ పెన్షన్ అందజేస్తామని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి చెప్పారు. మండలానికి చెందిన 1,075 మందికి మంజూరైన ఆసరా పెన్షన్లను గురువారం కలెక్టర్ యాస్మిన్‌భాషతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు అప్పులపాలు కావొద్దని రైతుబంధు, ఆడ పిల్లల పెండ్లికి తల్లిదండ్రులు ఇబ్బంది పడొదన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. పింఛన్లు అందనివారు మరోసారి అప్లై చేసుకోవాలని సూచించారు. జడ్పీ వైస్‌చైర్మన్ వామన్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ సుకేశిని విశ్వేశ్వర్, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు బాబు రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి గాడిల ప్రశాంత్, మార్కెట్ చైర్మన్ శ్రావణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.