
రోజూ ఎంతోమంది చనిపోతుంటారు !! రోగాల వల్ల.. రోడ్డు ప్రమాదాల వల్ల.. ఆత్మహత్యల వల్ల ఎందరో ఆకస్మికంగా ప్రాణాలను కోల్పోతుంటారు !! కానీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ తర్వాత బయటికొచ్చిన.. ఆ నలుగురు మహిళలు విగత జీవులయ్యారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో ఆగస్టు 25న జరిగిన కుటుంబ నియంత్రణ సర్జరీలు ఆ నలుగురిని పొట్టనపెట్టుకున్నాయి. దీంతో వాళ్ల కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. ప్రస్తుతం ఆ నాలుగు కుటుంబాలు ఎలా ఉన్నాయి ? తల్లిని కోల్పోయిన ఆ పిల్లలను ఎలా సాకుతున్నారు ? వారికి ఏం సమాధానం చెప్పుతున్నరు ? ఎలా సర్ది పుచ్చుతున్నరు ? అనేది తెలుసుకునేందుకు ‘v6’ న్యూస్ చానల్ క్షేత్ర స్థాయికి వెళ్లింది. కుటుంబ నియంత్రణ సర్జరీలు వికటించి చనిపోయిన ఆ నలుగురు మహిళల కుటుంబాల గుండె గోడును తెలుసుకునే ప్రయత్నం చేసింది.
ఇబ్రహీంపట్నం మండలం సీతారాంపేటకు చెందిన అవుతారం లావణ్య (27) , మంచాల మండలం లింగంపల్లికి చెందిన మైలారం సుష్మ (26), మాడుగుల మండలం నర్సాయిపల్లికి చెందిన ఎన్.మమత (25), కొలుకులపల్లి తండాకు చెందిన మౌనిక (26) కుటుంబ నియంత్రణ సర్జరీలు వికటించి చనిపోయారు. వాళ్ల ఇళ్లకు వెళ్లిన ‘v6’కు కళ్లు చెమర్చే దృశ్యాలు కనిపించాయి. తమ్ముడినో.. చెల్లినో ఎత్తుకొని అమ్మ తిరిగొస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్న అమాయక పిల్లలు కనిపించారు. ఆ పిల్లలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక.. లోలోన కుమిలిపోతున్న ఇంటిపెద్దలు కనిపించారు.
లావణ్య ముగ్గురు పిల్లలు.. దయనీయం..
ఇబ్రహీంపట్నం మండలం సీతారాంపేటలోని అవుతారం లావణ్య ఇల్లు అది. ఆమె ఇంటికి వెళ్లిన ‘v6’కు లావణ్య 8 నెలల బాబు అనిరుధ్, అక్షర, భావన అనే మరో ఇద్దరు ఆడ పిల్లలు కనిపించారు. ‘అమ్మ ఇక లేదు.. తిరిగి రాదు’ అనే విషయం తెలియక.. అమాయకంగా తాత ఒడిలో అనిరుధ్ ఆడుకుంటున్నాడు.
చివరి నిమిషంలో పిల్లల్ని యాది చేసుకొని..
లావణ్య భర్త మాట్లాడుతూ.. ‘‘ఏఎన్ఎంలు మా ఇంటికొచ్చి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోమని చెప్పారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ క్యాంప్ పడిందన్నరు. దీంతో టెస్టులు చేయించి.. ఆగస్టు 25న క్యాంపులో ఆపరేషన్ చేయించినం. ఆపరేషన్ అయినప్పటి సంది లావణ్యకు వాంతులు, విరేచనాలు మొదలైనై. ఆపరేషన్ అయిన తెల్లారి మళ్లీ ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రికి తీసుకపోయినం. ఆ తర్వాత వనస్థలిపురం ఆస్పత్రికి.. అక్కడి నుంచి (ఆగస్టు 26న) ఉస్మానియా ఆస్పత్రికి డాక్టర్లు రాసిర్రు. ఆగస్టు 27న తెల్లారి నా భార్యకు సీరియస్ అయింది. దీంతో అక్కడి నుంచి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకుపోతే.. ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీ, గుండె, లివర్ అన్నింటిపైన ఎఫెక్ట్ పడిందన్నరు. చివరి నిమిషంలో పిల్లల్ని యాది చేసుకున్న నా భార్య.. జాగ్రత్తగా ఉండండ్రి అని చెప్పింది’’ అని గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. మరో మూడు కుటుంబాలది కూడా ఇదే విధమైన దయనీయ స్థితి. కనీసం ఆ నలుగురు మహిళల పిల్లల విద్యా బుద్ధుల కోసమైనా ప్రభుత్వం చేయూత ఇస్తే, ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.