పోరాడితేనే…

అన్ని దేశాలు మహిళా దినోత్సవాన్ని  చాలా ఉత్సాహంగా జరుపుకుంటాయి. జీవితంలో ఏర్పరచుకున్న లక్ష్యాలను, ఎదుర్కొన్న  సమస్యలను, తాము సాధించిన విజయాలను చర్చించుకోవడానికి మహిళా దినోత్సవం ఒక ప్లాట్ ఫాంగా మారింది. ప్రతి ఏడాది మహిళా దినోత్సవానికి ఏదో ఒక థీమ్​ను నిర్ణయించుకున్నట్లే… ఈ ఏడాది ‘ఐయామ్ జనరేషన్ ఈక్వాలిటీ: రియలైజింగ్ ఉమెన్స్  రైట్స్’ అనే థీమ్​ నిర్ణయించారు. ఆడ–మగ మధ్య  జెండర్ ఈక్వాలిటీ అనేది చాలా ముఖ్యమైన అంశం. ప్రపంచ మహిళా దినోత్సవం ప్రారంభం నుంచి ఇప్పటివరకు అంతర్జాతీయంగా మహిళలు అనేక హక్కులను సాధించుకున్నారు. ఓటు హక్కు, సమాన అవకాశాలు, సమాన వేతనాలు, రాజ్యాంగ హక్కులు ఇందులో ముఖ్యమైనవి. గతంతో పోలిస్తే  మహిళలు చదువు, ఉద్యోగ అవకాశాల్లో  ఎంతో అభివృద్ధి సాధించారు. కొన్ని రంగాల్లో మహిళలే ముందున్నారు. రాజకీయాల్లో పెద్ద పదవుల్లో కొనసాగుతున్నారు.

ప్రపంచంతో పోటీ పడుతున్న భారత మహిళ

ఈ రోజున ప్రపంచ మహిళలతో పోటీ పడుతున్నారు. స్వాతంత్ర్యం తరువాత అన్ని రంగాల్లో మహిళలు అభివృద్ది సాధించారు. చదువు, క్రీడలు, పాలిటిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మీడియా, సర్వీసెస్ సెక్టార్ ఇలా అన్నిటిలోనూ  రాణిస్తున్నారు. పోరాటాలతో తమ హక్కులు సాధించుకుంటున్నారు. సాదాసీదా గృహిణి స్థాయి నుంచి బడా కార్పొరేట్ కంపెనీ సీఈవో వరకు మన మహిళలు ఎదిగారు. ఒకవైపు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ, మరో వైపు ఇంటిని చక్కదిద్దుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

‘ఫోర్బ్స్’ మేగజైన్ లిస్టులో…

‘ఫోర్బ్స్’ మేగజైన్ 2019లో ప్రపంచంలో 100 మోస్ట్​ పవర్​ఫుల్​  ఉమెన్​ లిస్టులో మన దేశానికి చెందిన  ‘హిందూస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ (హెచ్సీఎల్)’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోషిని నాడార్  మల్హోత్రా, బయోకాన్ ఫార్మా ఫౌండర్ చైర్​పర్సన్​ కిరణ్ మజుందార్ షా చేరారు. 2019లో ‘ఫెమీనా’ మేగజైన్ ఎంపిక చేసిన వంద మందిలో మన దేశానికి చెందిన ఏడుగురు మహిళలు ఉన్నారు. ఇది భారతీయ మహిళల గొప్పతనాన్ని చాటి చెప్పే సందర్భం. ఒకప్పుడు వంటగదికే  పరిమితమవుతున్న మహిళలు ఇంతటి ఘన విజయాలు సాధించడం అందరికీ గర్వకారణమే.

ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. మరో కోణంలో చూస్తే భద్రత కరువై  బిక్కుబిక్కుమంటూ ఉంటోంది.  మహాత్మా గాంధీ చెప్పినట్లు ‘ఆడవాళ్లు అర్థరాత్రి నిర్భయంగా బయటకెళ్లే  రోజులు’ ఇంకా రాలేదు. బయటికెళ్లిన మహిళలు  క్షేమంగా ఇంటికి చేరతారన్న గ్యారంటీ కూడా లేదు. మహిళల పట్ల సెక్సువల్ హెరాస్మెంట్ ఎక్కువైంది. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లోని ఆడవాళ్లే కాదు, వర్కింగ్ ఉమెన్ కూడా వేధింపులు ఎదుర్కొంటున్నారు. పరువు హత్యలు, యాసిడ్ దాడులు, రేప్ ఇన్సిడెంట్లు పెరిగాయి. ఏ రోజు పేపర్ చూసినా కిడ్నాప్​లు, అమ్మాయిల ట్రాఫికింగ్​ వార్తలే కనిపిస్తున్నాయి. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు ఉన్నా… వాటిలో ఏ ఒక్కటీ మానవ మృగాల నుంచి మహిళలను రక్షించలేకపోతున్నాయి. 70 శాతం మంది మహిళలు గృహ హింసకు గురవుతున్నారు. అధికారిక లెక్కలే ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి. మన

సాధించింది తక్కువే

మన దేశంలో మహిళలు ఎంతగా అభివృద్ది చెందినా ఇంకా సాధించాల్సింది చాలానే ఉంది. ఆర్థిక స్వావలంబన సాధించిన మహిళలు కేవలం 40 కోట్ల మందే. అలాగే 56 శాతం మంది మహిళలకు ఇప్పటికీ సమాన వేతనాలు అందడంలేదు.  అలాగే ఉద్యోగాల్లో ఉన్న మహిళలు 24 శాతం మాత్రమే. మేనేజర్ల వంటి కీలక పోస్టుల్లో కేవలం 21 శాతం మాత్రమే ఉన్నారు. కేవలం పది లక్షల మంది మాత్రమే హై లెవెల్ పోస్టుల్లో ఉన్నారు. పురుషులతో పోలిస్తే  మహిళల్లో లిటరసీ రేటు ఇప్పటికీ తక్కువే.

కలిసికట్టుగా పోరాడితేనే……..

మహిళలు కలిసికట్టుగా పోరాడితే ఏమైనా సాధించగలరని అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది.  ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూస్తూ కూర్చోకూడదు. తమను తామే రక్షించుకునే స్థాయికి మహిళలు ఎదగాలి. పులి ముందు అమాయకంగా ఉండే లేడి పిల్ల కారాదు. మానవ మృగాలు ఎదురైతే మహిళలే పులుల్లా తిరగబడాలి. అలా చేసినప్పుడే కామాంధులు తోక ముడుస్తారు. అప్పుడు ప్రతిరోజూ ఓ మహిళా       దినోత్సవమే అవుతుంది.