రైతు భరోసా సాయానికి ఎలాంటి షరతులు లేవు.. వీ6 వెలుగు ప్రత్యేక ఇంటర్వ్యూలో తుమ్మల..

రైతు భరోసా సాయానికి ఎలాంటి షరతులు లేవు.. వీ6 వెలుగు ప్రత్యేక ఇంటర్వ్యూలో తుమ్మల..
  • కేసీఆర్ అప్పుల దరిద్రాన్ని నెత్తినపెట్టి పోయిండు: తుమ్మల
  • ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా రైతులను ఆదుకుంటున్నం
  • రైతు భరోసాపై మేనిఫెస్టోకు కట్టుబడతం 
  • ఎకరాకు రూ.7,500 ఇస్తం.. ఈసారి రూ. 6,000 
  • వచ్చే ఏడాది నుంచి రూ.500 చొప్పున పెంపు
  • ఏ ఆంక్షలు లేకుండా సాగుభూములకు ఇస్తం
  • దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడి
  • వీ6 వెలుగుకు ప్రత్యేక ఇంటర్వ్యూ

హైదరాబాద్, వెలుగు: రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర రైతులకు మేలు జరిగితే ఆ రెండు పార్టీల నేతలు ఓర్చులేకపోతున్నారని విమర్శించారు. ఎకరానికి ఆరు వేల చొప్పున, ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలనే రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకించే వారు మూర్ఖులని ఫైర్​ అయ్యారు. 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా, కేసీఆర్ పోతూపోతూ అప్పులు, దరిద్రాన్ని నెత్తిన పెట్టి వెళ్లినా.. కాంగ్రెస్ ప్రభుత్వం ధైర్యంతో రైతులను ఆదుకుంటున్నదని చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలోనే 25 లక్షల రైతు కుటుంబాలకు రూ.21వేల కోట్లతో రుణమాఫీ చేసి దేశంలో చరిత్ర సృష్టించామన్నారు. వ్యవసాయానికి బడ్జెట్ లో 35 శాతం నిధులు కేటాయిస్తూ రైతు పక్షపాతిగా తమ ప్రభుత్వం పేరు తెచ్చుకుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతుబంధు అమలులో ఫెయిల్​అయిందని విమర్శించారు. లక్ష రుణమాఫీ చేయలేదని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రైతుబంధుపై రాజకీయం చేసి వాయిదా వేస్తే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు ఆ డబ్బులు చెల్లించామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ బ్లడ్​లోనే మోసం, దగా ఉన్నాయని మండిపడ్డారు.

60 శాతం సన్న వడ్ల సాగు
రాష్ట్రంలో ఈ సారి సన్నాల సాగు బాగా పెరిగిందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ప్రతి క్వింటాల్​సన్నవడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామని చెప్పడంతో వానాకాలంలో సన్నాల సాగు 60 శాతం పెరిగిందన్నారు. వచ్చే వానకాలం 90% దాకా పెరిగే చాన్స్ ఉందన్నారు. దీంతో కౌలు రైతుల సమస్యలకు పరిష్కారం లభించిందని పేర్కొన్నారు.

ఇక యాంత్రీకరణపై దృష్టి 
ప్రభుత్వం ఇక వ్యవసాయ యాంత్రీకరణపై దృష్టి సారించబోతున్నదని తుమ్మల తెలిపారు. గత ఐదేండ్లు వ్యవసాయ యాంత్రీకరణ అమలు చేయలేదని.. వచ్చే నాలుగేండ్లలో డ్రిప్, స్ప్రింక్లర్, కూలీల సమస్యను అధిగమించేలా సబ్సిడీపై యంత్రాలను ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. రైతులకు ఈ యంత్రాలపై శిక్షణ కూడా ఇచ్చేందుకు యోచిస్తున్నామని తెలిపారు. ప్రతి జిల్లాకి ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్లను మంజూరు చేస్తున్నామని చెప్పారు.

సాగు చేసే ప్రతి ఎకరాకు ఇస్తం
జనవరి 26 నుంచి రైతు భరోసా, రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు ప్రారంభిస్తామని మంత్రి తుమ్మల అన్నారు. రైతు భరోసా సాయానికి ఎలాంటి షరతులు లేవని, రైతులు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేశారు. శాటిలైట్. జియో టాగింగ్ తో సాగు భూముల లెక్కలు తీసి వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రూ.6,500 చొప్పున చెల్లించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. పథకం ప్రారంభమైన వారం రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నామని చెప్పారు. గత ఏడేండ్లలో వ్యవసాయ యోగ్యం కాని భూములకు రైతుబంధు కింద రూ.22 వేల కోట్లు చెల్లించి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఈ సారి దుబారా లేకుండ పక్కాగా సాగు చేసే రైతులకే భరోసా నిధులు జమ కాబోతున్నాయని చెప్పారు.