- ఏసీబీ కేసుతో వెనక్కి తగ్గిన ఎఫ్ఈవో
- ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ లో కేసు వాపస్
- మొత్తం 4 సీజన్లకు ఎఫ్ఈవోతోగత బీఆర్ఎస్ సర్కార్ ఒప్పందం
- ఒక్క సీజన్‌కే రూ.200 కోట్లు లాస్
- రేసు రద్దుతో ప్రభుత్వానికి తప్పిన రూ.800 కోట్ల నష్టం
హైదరాబాద్, వెలుగు: ఫార్ములా–ఈ రేసు వ్యవహారంలో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తున్నది. ఇందులో అక్రమాలు జరిగినట్టు గుర్తించిన ప్రభుత్వం.. ఏసీబీ కేసు నమోదు చేయడంతో, బ్రిటన్ కు చెందిన ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈవో) కంపెనీ వెనక్కి తగ్గింది. లండన్ లోని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ లో వేసిన కేసును వాపస్ తీసుకుంది. దీంతో సర్కార్ కు రూ.వేల కోట్ల పెనాల్టీ తప్పింది. అంతేకాకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎఫ్ఈవోతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయడంతో రూ.800 కోట్ల నష్టాన్ని ప్రభుత్వం ఆపగలిగింది.
ఫార్ములా–ఈ రేసు నిర్వహించడంతో ఇన్వెస్ట్మెంట్స్వచ్చాయని బీఆర్ఎస్ నేతలు చెబుతుండగా, అదంతా వట్టిదేనని ప్రభుత్వం తేల్చేసింది. పైగా ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలతో భారీగా ప్రజాధనం ప్రైవేట్ కంపెనీకి చెల్లించాల్సి వచ్చేదని సెక్రటేరియేట్ వర్గాలు పేర్కొన్నాయి. పోయినేడాది డిసెంబర్ మూడో వారంలో ఎఫ్ఈవో కంపెనీ ప్రతినిధులు ఫార్ములా–ఈ రేస్సీజన్ 10 కోసం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసినట్టు తెలిసింది.
దీంతో అసలు దీనిపై ఒక సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలని అప్పటి స్పెషల్ సీఎస్‌ను సీఎం ఆదేశించారు. ఆ రిపోర్ట్ చూసి ప్రభుత్వానికి నష్టం వాటిల్లే విధంగా ఒప్పందం చేసుకున్నారని గుర్తించి రేసును రద్దు చేశారు. వెంటనే అప్పటి ఎంఏయూడీ స్పెషల్సీఎస్అర్వింద్కుమార్ను బదిలీ చేశారు. ఫార్ములా–ఈ రేసుపై ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అగ్రిమెంట్ ను అడ్డం పెట్టుకుని పరిహారం కోరుతూ లండన్‌లోని ఇంటర్నేషనల్ఆర్బిట్రేషన్ లో ఎఫ్ఈవో కంపెనీ కేసు ఫైల్ చేసింది.
సర్కార్ సీరియస్ గా తీసుకోవడంతో తప్పిన నష్టం..
ఓవైపు ఫార్ములా–ఈ రేసు వ్యవహారంలో ఏం జరిగిందనే దానిపై ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుండగానే, మరోవైపు రూ.వేల కోట్ల నష్టపరిహారం కోరుతూ లండన్‌లోని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్‌లో ఎఫ్ఈవో కంపెనీ కేసు వేసింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించేందుకు సీనియర్ అడ్వొకేట్హరీశ్సాల్వేను వాళ్లే నియమించారు. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియదు. మూడు హియరింగ్స్జరిగిన తర్వాత దాదాపు రూ.6 కోట్లు చెల్లించాలని అడ్వొకేట్ ప్రభుత్వం దగ్గరకు వచ్చినట్టు తెలిసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన రాష్ట్ర సర్కార్.. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని ఏసీబీని రంగంలోకి దింపింది.
ఫార్ములా–ఈ రేసులో అక్రమాలకు పాల్పడ్డారని, అసలు దీంతో రాష్ట్ర సర్కార్‌కు సంబంధం లేదని ప్రభుత్వం ఆర్బిట్రేషన్ కు నివేదించింది. అంతేకాకుండా ఏసీబీ కేసు ఎదుర్కోక తప్పదని ఎఫ్ఈవోను హెచ్చరించింది. దీంతో ఎఫ్ఈవో వెనక్కి తగ్గి, ఆర్బిట్రేషన్ లో కేసును వాపస్ తీసుకున్నట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్‌గా లేకుంటే ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ రూ.వేల కోట్ల పెనాల్టీ విధించే అవకాశం ఉండేదని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఒకవేళ చెల్లించబోమని మొండికేస్తే నేరుగా హెచ్ఎండీఏ ఆస్తులను వేలం వేసి మరీ పరిహారం ఇప్పిస్తాయని.. ఇలాంటి సంఘటనలు ఇంటర్నేషనల్ఆర్బిట్రేషన్లో తరుచూ జరుగుతుంటాయని పేర్కొన్నాయి. సీఎం సీరియస్‌గా తీసుకోకుంటే రాష్ట్ర ఖజానాకు రూ.వేల కోట్ల నష్టం వచ్చేదని చెప్పాయి.
నిధులు కొల్లగొట్టేలా ఒప్పందం..
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొత్తం 4 ఫార్ములా–ఈ రేస్సీజన్లు నిర్వహించాలని నిర్ణయించారు. మొదట హెచ్ఎండీఏ ఫెసిలిటేటర్‌గా సీజన్9 నిర్వహించారు. ఇందులో భాగంగా రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కోసం హెచ్ఎండీఏ రూ.20 కోట్లు ఖర్చు చేసింది. స్టాల్స్, ప్రచారం, సీటింగ్, వీధి దీపాల లాంటి వాటికోసం ‘నెక్ట్స్జెన్గ్రీన్ కో’ అనే ప్రైవేట్ సంస్థ రూ.150 కోట్లు ఖర్చు చేసింది. ఇంకో రూ.30 కోట్లను ‘హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్’ ఖర్చు పెట్టింది.
సీజన్9లో రాష్ట్ర ప్రభుత్వం, గ్రీన్కో, ఎఫ్ఈవో ఉన్నాయి. ఈ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం (హెచ్ఎండీఏ) కేవలం ఫెసిలిటేటర్‌గానే ఉంది. అంటే లాభనష్టాలకు హెచ్ఎండీఏకు గానీ, ప్రభుత్వానికి గానీ ఎలాంటి సంబంధం లేదు. అయితే ఫార్ములా–ఈ రేస్‌ను ప్రమోట్ చేసిన గ్రీన్ కోకు సీజన్ 9లో చాలా నష్టం వచ్చింది. ఈ క్రమంలో అప్పటి ప్రభుత్వం గ్రీన్కోను ఎందుకు పక్కకు తప్పించిందో తెలియదు. నేరుగా ఎఫ్ఈవోతో ఒప్పందం చేసుకున్నారు.
ఒప్పందం కంటే 18 రోజుల ముందే సీజన్ 10కు సంబంధించిన నిధులను రెండు విడతల్లో రూ.55 కోట్లు ఆ కంపెనీకి చెల్లించారు. దీనికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ తీసుకోలేదు. అలాగే ఆర్బీఐ పర్మిషన్ లేకుండా, ఎన్నికల కోడ్ టైంలో ఈసీకి సమాచారం ఇవ్వకుండానే నేరుగా విదేశాల్లోని కంపెనీకి పౌండ్ల రూపంలో బదిలీ చేశారు.
ఎఫ్ఈవోతో ఒప్పందంలో ఏదైనా సమస్య వస్తే లండన్‌లోనే తేల్చుకునేలా నిబంధన పెట్టుకున్నారు. ఒక్క సీజన్లోనే గ్రీన్కోకు రూ.200 కోట్ల మేర నష్టం వచ్చింది. ఈ రూ.200 కోట్ల నష్టం కూడా ప్రభుత్వానికే అంటగట్టేలా హెచ్ఎండీఏతో ఎఫ్ఈవో బై పార్టీ ఒప్పందం జరిగినట్టు తెలుస్తున్నది. ఒకవేళ మిగిలిన మూడు సీజన్లు కూడా నిర్వహించి ఉంటే దాదాపు రూ. 800 కోట్ల మేర నష్టం ప్రభుత్వంపైనే (హెచ్ఎండీఏ) పడేది.