భగీరథ నీళ్లపై భయం పోతలే ! ప్రారంభమై ఐదేండ్లయినా.. 30 శాతం కూడా తాగుతలే..

భగీరథ నీళ్లపై భయం పోతలే ! ప్రారంభమై ఐదేండ్లయినా.. 30 శాతం కూడా తాగుతలే..
  • నాడు తరుచూ లీకేజీలతో నీరు కలుషితం
  • జనాల్లో సన్నగిల్లిన విశ్వాసం
  • నమ్మకం కలిగించేందుకు కాంగ్రెస్ సర్కార్ తిప్పలు
  • ఊరూరా అవగాహన కార్యక్రమాలు
  • పల్లెల్లో నీటి సహాయకుల ఏర్పాటుతో తగ్గుతున్న లీకేజీలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మిషన్ ​భగీరథ పథకాన్ని ప్రారంభించి ఐదేండ్లు దాటినా.. ఆ నీళ్లు తాగేందుకు జనం ఇంకా జంకుతున్నారు.  ఇంటి అవసరాలకు తప్ప కనీసం 30 శాతం మంది కూడా భగీరథ నీళ్లు తాగట్లేదని, ఎప్పట్లాగే  ఊరూరా వెలిసిన మినరల్ వాటర్​ ప్లాంట్ల నుంచి క్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నీళ్లు తెచ్చుకొని తాగుతున్నారని ఇటీవల నిర్వహించిన ఆఫీసర్ల సర్వేలో తేలింది. దీంతో జనంతో భగీరథ నీళ్లు తాగించేందుకు అధికారులు పడరాని పాట్లు పడ్తున్నారు. పల్లెల్లో పైప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్లను మార్చడం, నీటి సహాయకుల ఏర్పాటుతో లీకేజీలు తగ్గాయని ప్రజలంతా నిర్భయంగా నీటిని తాగవచ్చని కొద్దిరోజులుగా ఊరూరా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

లీకేజీలే అసలు సమస్య..
స్టేట్‌వైడ్ 23,890 రూరల్​, 121 అర్బన్‌ హ్యాబిటేషన్లలోని సుమారు 2.72 కోట్ల మందికి 24 గంటలు వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సప్లై చేయాలన్న లక్ష్యంతో 2016లో మిషన్​భగీరథ స్కీం చేపట్టారు. ఇందుకోసం సుమారు రూ.40 వేల కోట్లు కేటాయించారు. 1.50 లక్షల కిలోమీటర్ల వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాంట్ల నుంచి సెగ్మెంట్లకు వెళ్లే మెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైన్లతో పాటు ఇంట్రా పైపులైన్లు కీలకం. భారీ మొత్తంలో ఖర్చు చేసినప్పటికీ ఎక్కడికక్కడ పాత ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అడ్డగోలుగా వాడేశారు. పాత ట్యాంకులన్నింటికీ కొత్త రంగు పూసి మిషన్​భగీరథలో కలిపేశారు.

గ్రామాల్లో 80 నుంచి 90 శాతం, టౌన్లలో 70 నుంచి 80 శాతం ఇంట్రాపైపులైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాతదే వాడుకున్నారు. ఎస్సీ కాలనీలతో పాటు పాత లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తిగా దెబ్బతిన్న చోట్ల మాత్రమే కొత్తగా ఇంట్రాపైపులైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేశారు. ఈ పనులను కూడా ఎక్కడికక్కడ లోకల్ ఏజెన్సీలు, కాంట్రాక్టర్లకు అప్పగించడంతో అస్తవ్యస్తంగా చేశారు. లోక్వాలిటీ పైపులను తక్కువ లోతులో వేయడంతో ట్రాక్టర్లు వెళ్లినా, డ్రైన్ల కోసం, కేబుల్స్ కోసం ఏ కొంచెం తవ్వినా, లోపల వాటర్​ప్రెజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరిగినా పైపులు పుటుక్కున పగిలేవి.

ఇక పాతపైపులైతే కొద్దిపాటి ప్రెజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా తట్టుకోలేక లీకయ్యేవి. చాలా చోట్ల డ్రైనేజీల్లోంచి పైపులు ఉండడంతో ప్రారంభంలో భగీరథ నీటిలో బురద, మట్టి, పురుగులు వచ్చాయి.  ఇక పైపులు పగులుతాయనే భయంతో ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాంట్ల నుంచి తక్కువ ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వాటర్​ వదలడంతో  చివరి గ్రామాలకు నీరందక పాత బోర్లకు మోటర్లు పెట్టి సప్లై చేస్తూ వచ్చారు. దీంతో ఈ నీటిని తాగేందుకు జనం ఇష్టపడలేదు. వీటిని ఇంట్లో ఇతర అవసరాలకు వాడుకుంటూ బయట క్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  నీటిని తెచ్చి తాగడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఊరూరా పెద్దసంఖ్యలో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాంట్లు పుట్టుకొచ్చాయి. మినరల్స్​ఏమాత్రం లేని ఆ నీటిని తాగడం వల్ల జనం రోగాలబారిన పడ్తున్నారు.

లక్ష్యం చేరని భగీరథ..

ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందించే లక్ష్యంతో సుమారు రూ.40 వేల కోట్లు ఖర్చు పెట్టి, గత బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కారు చేపట్టిన మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భగీరథ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేటికీ లక్ష్యం చేరుకోలేదు. మొదట్లో తరచూ లీకేజీలతో నీరు కలుషితం కావడం, మట్టి, బురద, పురుగులు రావడం, ఎక్కడికక్కడ లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోరు నీటిని వాడడం వంటి కారణాలతో ప్రజల్లో భగీరథ నీళ్లపై విశ్వాసం సన్నగిల్లింది.

దీంతో ఈ నీళ్లను తాగాలంటే భయమేస్తోందని, వాటిని స్నానానికి, బట్టలు ఉతకడానికి, బోళ్లు కడగడానికి మాత్రమే వాడుతున్నామని ఆమధ్య సర్వేకు వెళ్లిన అధికారులతో జనం తేల్చి చెప్పారు. ఈ క్రమంలో భగీరథ నీళ్లు కలుషితం కావడానికి ప్రధాన కారణం ఇంట్రాపైపులైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీకేజీలేనని గుర్తించిన కాంగ్రెస్​ప్రభుత్వం, గడిచిన ఐదారు నెలలుగా లీకేజీలను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. 

ఇందులో భాగంగా -ఊరూరా మంచినీటి సహాయకులను నియమించి, నిరంతర పర్యవేక్షణతో పాటు లీకేజీలకు అడ్డుకట్ట వేస్తోంది. ఇంత చేస్తున్నా జనం ఆర్వో వాటర్​ తాగుతుండడంతో భగీరథ నీటిపై ప్రజల్లో అపోహలను తొలగించేందుకు రాష్ట్ర సర్కారు రంగంలోకి దిగింది. పైపులైన్​లీకేజీలకు అడ్డుకట్టవేశామని, ఆర్వో వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే భగీరథ నీటిలో మినరల్స్​ఎక్కువగా ఉంటాయని, అందువల్ల నల్లా నీటినే తాగాలంటూ ఊరూరా మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భగీరథ ఆఫీసర్లు, మంచినీటి సాయకుల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపడ్తోంది.

లీకేజీలను అరికట్టడంపై కాంగ్రెస్​ సర్కారు దృష్టి..
కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భగీరథ స్కీంపై ప్రభుత్వం సర్వే చేయించగా, పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ప్రారంభంలో చాలాకాలం పాటు భగీరథ నీటిలో బురద, మట్టి, పురుగులు రావడం వల్లే తాగేందుకు జనం ఇష్టపడడం లేదని, ఇంట్లో ఇతర అవసరాలకే తప్ప కనీసం 30 శాతం మంది కూడా ఈ నీటిని తాగడం లేదని గుర్తించారు.

ప్రధానంగా లీకేజీలే ఇందుకు కారణమని తేలడంతో లీకేజీలను అరికట్టడంపై కాంగ్రెస్​ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైతం దృష్టిపెట్టింది. ఈక్రమంలోనే తాగునీటి సరఫరాపై నిత్య పర్యవేక్షణ ఉండాలన్న ఉద్దేశ్యంతో  గ్రామగ్రామాన మంచినీటి సహాయకులను నియమించింది. మంచినీటి సహాయకులు లేని చోట మల్టీపర్పస్​వర్కర్లకు  తాగునీటి సరఫరా బాధ్యతలు అప్పగించింది.

మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భగీరథ పైపులైన్ల లీకేజీలు అరికట్టడం, క్లోరినేషన్, నీటి పరీక్షలు చేయడం, ప్లంబింగ్​, మోటార్​రిపేర్లు స్వయంగా నిర్వహించుకునేలా వీరికి పూర్తి స్థాయిలో శిక్షణ  ఇచ్చింది. దీంతో  గ్రామాల్లో తాగునీటి సరఫరా మెరుగైంది. ఎక్కడ, ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా సిబ్బంది తక్షణమే స్పందించి రిపేర్లు చేస్తున్నారు. 

ముఖ్యంగా పైపుల లీకేజీలు అరికట్టడంతో పాటు నీరు కలుషితం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. దీనికి తోడు ఊరూరా ఫ్లోరోస్కోప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాటర్​ టెస్ట్​కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెన్లు, పంచాయతీ సిబ్బంది నీటి పరీక్షలు చేశాకే నీటిని విడుదల చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 76 ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో ఎప్పటికప్పుడు నీటి పరీక్షలు చేస్తూ సమస్య ఉన్న చోట పరిష్కరిస్తున్నారు. 

ఇక భగీరథ అధికారులు సైతం ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వాల్వ్స్, పైప్ లైన్లను పరిశీలిస్తూ ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. హైదరాబాద్‌ మిషన్ భగీరథ కార్యాలయం నుంచి ప్రతిరోజూ ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. పైపులైన్​ లీకేజీలు, నీటి సరఫరా తీరుపై జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. 

జిల్లాల నుంచి ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈలు, ఈఈలు, భగీరథ సిబ్బంది రోజు ఉదయమే గ్రామాల్లో నీటి సరఫరా తీరు, సమస్యలు తదితర అంశాలపై మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భగీరథ ఈఎన్సీకి వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెడ్తున్నారు. కానీ ఈ విషయాలేవీ తెలియని చాలా మంది  భగీరథ నీళ్లంటే నేటికీ భయపడ్తున్నారు. దీంతో ఇటీవల మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ప్రజల్లో నల్లానీటిపై విశ్వాసం పెంచేందుకు మిషన్‌ భగీరథ అధికారులు  గ్రామాల్లో  అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

పంచాయతీ కార్యదర్శులు, మిషన్‌ భగీరథ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భగీరథలో లీకేజీలను ఎలా అరికడ్తున్నామో వివరిస్తున్నారు. అన్ని పరీక్షలు నిర్వహించాకే నీటిని వదులుతున్నామని చెప్తున్నారు. బయట ఆర్వో ప్లాంట్ల నుంచి కొనుగోలు చేసే నీరు తాగడానికి రుచిగా ఉంటాయి తప్ప అందులో మినరల్స్ ఉండవని, ఆ నీటిని తాగడం వల్ల అనేక రోగాలు వస్తాయని పేర్కొంటున్నారు.

టీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవల్స్​, మినరల్స్​సరైన మోతాదులో ఉన్న భగీరథ నీళ్లే సురక్షితమని అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ప్రజల్లో కొంత మార్పు కనిపిస్తోందని, రాబోయే రోజుల్లో 100 శాతం భగీరథ నీటినే తాగే లక్ష్యంతో మరింత విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడ్తామని మిషన్​భగీరథ ఆఫీసర్​ ఒకరు ‘వెలుగు’తో  పేర్కొన్నారు.