పెద్ద హీరోల సినిమాలకు భారీగా టికెట్ రేట్లు.. అసలు కారణం ఇది..

 పెద్ద హీరోల సినిమాలకు భారీగా టికెట్ రేట్లు.. అసలు కారణం ఇది..

హైదరాబాద్, వెలుగు: పెద్ద హీరోల సినిమాలకు టికెట్ రేట్లు భారీగా పెంచుతున్నారు. రెండు మూడేండ్ల నుంచి ఈ ట్రెండ్​ బాగా పెరిగింది. దీంతో సామాన్యులు ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూసే పరిస్థితి లేకుండా పోతున్నది. మామూలు టికెట్ ధరకు మూడు నుంచి నాలుగు రెట్లు రేటు పెంచుతుండడంతో నలుగురున్న ఒక ఫ్యామిలీ కనీసం రూ.2 వేలు లేనిదే సినిమా చూసేందుకు అవకాశం ఉండడం లేదు. వాటిపై జీఎస్టీతో పాటు స్నాక్స్ ఖర్చు కూడా కలుపుకుంటే రూ.3 వేల దాకా ఖర్చవుతున్నది.

దీంతో ఎంటర్​టైన్ మెంట్ కోసం సినిమా చూద్దామనుకునే సగటు ప్రేక్షకులు థియేటర్​కు వెళ్లేందుకు జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్ద హీరో సినిమా అనగానే టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వాలు కూడా ఓకే చెప్పేస్తున్నాయి.రేట్లను అడ్గగోలుగా పెంచుతుండడంతో కొందరు నెటిజన్లు సోషల్​మీడియాలో ‘బాయ్​కాట్’ ట్రెండ్​ను నడిపిస్తున్నారు. 

భారీ బడ్జెట్తో సినిమాలు..
సినిమాల్లో ప్రెస్టీజ్ ఇష్యూ కూడా బాగా పెరిగిపోయింది. హీరో ఇమేజ్​కు తగ్గట్టు సినిమా బడ్జెట్​ను భారీగా పెంచేస్తున్నారు. పాన్​ఇండియా, పాన్ ​ఇంటర్నేషనల్​ సినిమాలంటూ అదనపు హంగులను జోడిస్తున్నారు. పదేండ్ల క్రితం వరకు సినిమా బడ్జెట్​రూ.వంద కోట్లు దాటితేనే వండర్ అని చెప్పుకునే పరిస్థితులు ఉండేవి. కానీ, ఇప్పుడు ఆ బడ్జెట్​ కాస్తా రూ.వెయ్యి కోట్ల దాకా పోతున్నది. పెద్ద హీరోల సినిమాలు కనీసం రూ.400 కోట్ల బడ్జెట్​ లేనిదే రూపుదిద్దుకోవడం లేదు. ఆ బడ్జెట్​లోనూ సగం దాకా హీరోహీరోయిన్లు, డైరెక్టర్లకే రెమ్యూనరేషన్లకే పోతున్నది.  

ఫస్ట్​ వారంలోనే రాబట్టుకునేలా ప్లాన్..
కొన్నేండ్లుగా సినిమాలను మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా వివిధ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. దేశాలు, ఖండాలను దాటి సినిమాల రిలీజ్​ జరుగుతున్నది. ఓవర్సీస్​లోనూ మన హీరోలకు అభిమానులు పెరిగిపోతుండడంతో వారి కోసం కూడా రిలీజ్​లు చేస్తున్నారు. దీంతో డిస్ట్రిబ్యూషన్​ ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. వాటన్నింటినీ సినిమా రిలీజైన వారం రోజుల్లోనే రాబట్టుకునేలా నిర్మాతలు ప్లాన్​ చేసుకుంటున్నారు. 

అందులో భాగంగానే సినిమా ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేస్తున్నారు. దానికి ప్రభుత్వాలు కూడా ఓకే చెప్పేస్తుండడంతో.. టికెట్ల ధరలు ఆకాశానికి చేరుతున్నాయి. ప్రస్తుతం బ్లాక్​మార్కెట్​తగ్గినా ప్రభుత్వమే అధికారికంగా ధరలను పెంచుకునేందుకు అవకాశం ఇస్తుండడంతో నేరుగా పబ్లిక్​పై ఆ భారం పడుతున్నది.  

ఎన్ని వసూళ్లు వస్తే సినిమా అంత హిట్..
ఒకప్పుడు సినిమా హిట్ ​అంటే.. ఎన్ని ఎక్కువ థియేటర్లలో వంద రోజులు ఆడితే అంత హిట్​అనేలా ఉండేది. సినిమా వసూళ్లు దానికి తగ్గట్టే వచ్చేవి. ఏయే థియేటర్​లో వంద రోజులు ఆడిందో పేపర్​లో లిస్ట్​తో సహా వచ్చేది. సినిమా బాగుంటేనే ఎక్కువ రోజులు థియేటర్​లో ఆడేది. బాగాలేకుంటే వెంటనే థియేటర్​నుంచి తీసేసేవాళ్లు. కానీ, రానురాను ఆ పద్ధతిలో మార్పు వచ్చేసింది. గత పదేండ్ల కాలం నుంచి ఆ ట్రెండ్​పూర్తిగా మారిపోయింది. ఓ సినిమాకు ఎన్ని భారీ వసూళ్లు వస్తే సినిమా అంత హిట్​అనే స్థాయికి వచ్చేసింది. ప్రస్తుతం సినిమాల థియేటర్​రన్​ కేవలం పది రోజుల నుంచి నెల రోజుల్లోపే ఉంటున్నది. 

Also Read :- దసరా డైరెక్టర్ తో సినిమా కన్ఫర్మ్ చేసిన మెగాస్టార్

తొలి రోజు కలెక్షన్లతో పాటు ఓవరాల్​కలెక్షన్లు ఎన్ని వచ్చాయన్న దానిపైనే సినిమా హిట్టా ఫ్లాపా అన్నది డిసైడ్​చేస్తున్నారు. తొలి రోజే వంద కోట్ల గ్రాస్​కలెక్షన్లు దాటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ హీరో సినిమా తొలి రోజు వంద కోట్ల కలెక్షన్లు రాబడితే.. దానిని మించి వసూళ్లు రాబట్టేలా ఇంకో హీరో సినిమాను ప్లాన్​ చేస్తున్నారు. కలెక్షన్ల రికార్డులవైపే సినీ పెద్దలు దృష్టి సారిస్తున్నారని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

బాయ్​కాట్ ట్రెండ్​..
సినిమా టికెట్ల ధరలను విపరీతంగా పెంచేస్తుండడంతో కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సినిమాలను బాయ్ కాట్ చేయాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. 
 
చిన్న సినిమాల పరిస్థితేంటి?
పెద్ద హీరోల సినిమాలకు టికెట్ల ధరలను భారీగా పెంచేందుకు అవకాశం ఇస్తున్న ప్రభుత్వాలు.. చిన్న సినిమాలను మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలూ ఉన్నాయి. పెద్ద హీరోల సినిమాలు వస్తున్నాయంటే చిన్న సినిమాల రిలీజ్​ను పోస్ట్​పోన్​ చేసుకునే పరిస్థితి వస్తున్నది. పెద్ద హీరోల సినిమాలు కూడా అదే ప్యాటర్న్​లో రిలీజ్​అవుతున్నాయి. 

ఒక పెద్ద హీరో సినిమా విడుదలవుతున్నదంటే.. అదే టైంకు విడుదల కావాల్సిన మరో పెద్ద హీరో సినిమా వాయిదా వేయాల్సి వస్తున్నది. వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో సినిమా ఆడితేనే.. అంత ఎక్కువ కలెక్షన్లు వస్తాయన్నది సినీ నిర్మాతల ఆలోచనగా ఇండస్ట్రీ ప్రతినిధులు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే టికెట్ల ధరలను పెంచి సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఓ నెల ఆగితే ఓటీటీలో సినిమాను రిలీజ్​చేసేస్తున్నారు కాబట్టి.. చాలా మంది ప్రేక్షకులు ఓటీటీలో రిలీజ్​ అయ్యే వరకు ఎదురు చూస్తున్నారు. పెద్ద హీరో సినిమాలతో థియేటర్లు దొరకని చిన్న సినిమాలు కూడా ఓటీటీపైనే ఆధారపడాల్సి వస్తున్నది. కొన్ని సినిమాలను నేరుగా ఓటీటీలోనే విడుదల చేస్తుండడం అందుకు నిదర్శనం.