టార్గెట్ బీసీ .. అన్ని పార్టీలదీ అదే జపం.. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్!

టార్గెట్ బీసీ .. అన్ని పార్టీలదీ అదే జపం.. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్!

హైదరాబాద్: పార్టీలన్నీ బీసీల జపం చేస్తున్నాయి. వెనుకబడిన కులాలే టార్గెట్గా తమ ఎజెండాను సెట్ చేసుకుంటున్నాయి. తెలంగాణ జనాభాలో అత్యధికంగా ఉన్న వర్గాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన అంశాన్ని ప్రస్తావించింది. బీజేపీ సైతం ఓ అడుగు ముందుకేసి తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించింది. సూర్యాపేట సభలో హోం మంత్రి అమిత్ షా ఈ విషయాన్ని ప్రకటించారు.

లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి ఇటీవలే జైలు నుంచి బెయిల్పై విడుదలైన ఎమ్మెల్సీ కవిత పాలిటిక్స్లో యాక్టివ్ అయ్యారు. ఆమె కూడా బీసీలే లక్ష్యంగా తన కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. గతంలో ఏర్పాటు చేసిన ఫూలే ఫ్రంట్ను మళ్లీ తెరమీదకు తెచ్చారు. బీసీ కులగణనలో లోపాలను ఎత్తి చూపుతూ డెడికేషన్ కమిషన్  కు వినతిపత్రం అందించారు. ఇవాళ జరిగిన ఫూలే వర్ధంతిలోనూ ఆమె పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా వైసీపీ తరఫున రాజ్యసభ ఎంపీగా కొనసాగిన బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య.. ముందస్తుగానే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వ్యూహాలకు  పదును పెడుతున్నారు. ఆయన  బీసీలే ఎజెండాగా ఓ  రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తారనే చర్చ కూడా మరో వైపు సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ బీఫారంపై పోటీ చేసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన తీన్మార్ మల్లన్న కూడా బీసీ ఎజెండాతో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ALSO READ | నకిలీ డాక్టర్లపై ఉక్కు పాదం .. కలకలం రేపిన మెడికల్​ కౌన్సిల్​రైడ్స్​

ఇటీవలే నల్లగొండ జిల్లా హాలియాలో మొల్ల విగ్రహానికి భూమి పూజ చేశారు. బడుగు వర్గాల తరఫున తన గళాన్ని వినిపిస్తూ తీన్మార్ మల్లన్న టీం పేరుతో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. రాజ్యాధికారంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. వాస్తవానికి రావాల్సిన పదవులు ఎన్ని..? వచ్చినవి ఎన్ని అనే లెక్కలు చెబుతూ ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో అదే ఎజెండా
రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలే ఎజెండాగా ఓట్లు సంపాదించేందుకు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు స్పష్టమవుతోంది. జనాభాలో సింహభాగం ఉన్న బీసీలకు సర్వత్రా అన్యాయం జరుగుతోందని, రాజ్యాధికారం వారికే రావాలనే గళాన్ని వినిపించేందుకు సిద్ధమవుతున్నాయి. గతంలో సామాజిక న్యాయం నినాదంతో వచ్చిన పార్టీలు పెద్దగా సక్సెస్ కాలేక పోయాయి. అయితే ఈ సారి ప్రధాన పార్టీల దృష్టంతా బీసీలపైనే ఉండటం విశేషం.